చైనా ప్రాడక్ట్ కంటే దారుణంగా జపాన్
X
రివ్యూ : జపాన్
తారాగణం : కార్తీ, అనూ ఇమ్మానుయేల్, సునిల్, విజయ్ మిల్టన్, జితన్ రమేష్ తదితరులు
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజు
సినిమాటోగ్రఫీ : రవివర్మన్
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
నిర్మాత : ఎస్.ఆర్. ప్రభు
దర్శకత్వం : రాజ్ మురుగన్
రిలీజ్ డేట్ : 10.11.2023
కార్తీ సినిమాలంటే తెలుగులో ఒక క్రేజ్ ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తాడన్న పేరుంది. తనకూ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అతని ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. అయితే కొన్నాళ్లుగా కార్తీ కాస్త నిరుత్సాహ పరుస్తున్నాడు. అయినా తాజాగా జపాన్ అనే చిత్రమైన టైటిల్ ఉన్న సినిమాతో వచ్చాడు. దీపావళి సందర్భంగా అంటూ విడుదలైన జపాన్ టీజర్, ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చింది. మరి సినిమా ఎలా ఉందనేది చూద్దాం.
కథ :
జపాన్(కార్తీ) ఒక నగల దొంగ. దోచుకున్న సొత్తునంతా విలాసాలకు ఖర్చు చేస్తుంటాడు. పైగా తను దొంగతనాలు చేసే తీరునే కథగా మలిచి ఒక సినిమా కూడా చేస్తాడు. తనే హీరో, విలన్ కూడా. మత్తులో ఉంటే ఎవరికి పడితే వారికి నగలు దానంగా వేస్తుంటాడు. ఓ సారి నగరంలో ఒక పెద్ద నగల దుకాణంలో భారీ దొంగతనం జరుగుతుంది. అది జరిగిన తీరును బట్టి జపానే చేశాడని పోలీస్ లు వెదుకుతుంటారు. ఇందుకోసం శ్రీకాంత్(సునిల్) ఒక టీమ్ తో భవానీ(విజయ్ మిల్టన్) ఒక టీమ్ గా ఫామ్ అయ్యి వెదుకుతుంటారు. వారి నుంచి తప్పించుకుంటూ విపరీతంగా తాగుతూ మధ్యలో తను ప్రేమించిన ఒక హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తాడు. అదే టైమ్ లో శ్రీకాంత్ కు పట్టుబడతాడు. అప్పుడే అతనికి నగల దుకాణంలో దొంగతనం గురించి తెలుస్తుంది. అది తను చేయలేదని.. చెప్పినా పోలీస్ లు వినరు. 26మంది పోలీస్ లకు సంబంధించిన ఒక సీక్రెట్ జపాన్ వద్ద ఉంటుంది. తనలాగా దొంగతనం చేసిన వాడిని పట్టుకోవడంలో సాయం చేస్తే ఆ సీక్రెట్స్ ఇస్తా అంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది..? జపాన్ ఎందుకు దొంగలా మారాడు..?అతనిలా దొంగతనం చేసి ఇరికించింది ఎవరు..? అతని వద్ద ఉన్న పోలీస్ ల రహస్యం ఏంటీ అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
జపాన్ కార్తీకి 25వ సినిమా. దీంతో బలమైన కథ, కథనాలుంటాయని ఎక్స్ పెక్ట్ చేస్తే అవి తేలిపోవడానికి పది నిమిషాలు కూడా పట్టదు. అంత పేలవమైన కథ, కథనంతో ఉందీ మూవీ. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. పరాయి సొమ్ము తినకూడదు. అలా తిన్నవారికి మంచి చావు కూడా రాదు అన్న కన్న తల్లి మాట నిజమైన సందర్భంగా ఈ సినిమా కనిపిస్తుంది. బట్ ఆ ఎమోషన్ పండలేదు. ఇతని దొంగతనాలు ఆకట్టుకోవు. మొదటి సగం అంతా కారులో తిరుగుతూ బాటిల్లకు బాటిల్లు మందు తాగుతూ.. తననే వేసేయాలనుకున్న తమ్ముడి లాంటి వాడి ద్రోహం, ఆ తర్వాత వచ్చే పాట, పాటలో బంగారాన్ని విపరీతంగా పంచడం.. ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీగా కనిపిస్తాయి. ముఖ్యంగా తన తల్లిని పూడ్చి పెట్టిన చోటకు వెళ్లి ఆమె అస్తిపంజరాన్ని బయటకు తీసి.. బంగారం అంతా ఆమె మెడలో వేసి కార్తీ చెప్పే సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. కానీ దర్శకుడు దీన్ని ఓ గొప్ప సన్నివేశంలా భావించి రూపొందించినట్టు కనిపిస్తుంది. ఎంతో ఎమోషన్ పండాల్సిన చోట నవ్వులు వచ్చాయి. సినిమా అంతా ఇలాంటి తప్పుల తడకలే ఉంటాయి. స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ కు జీరో మార్కులు వేయొచ్చు. సినిమా అంతా చిరాకు పెట్టి చివర్లో ఏదో ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాం అన్న కలరింగ్ ఇస్తే సరిపోదు కదా..? పైగా కార్తీ కథకు సమాంతరంగా మరో పేదవాడి కథను నడిపిస్తాడు. ఆ కథ వల్ల కార్తీ కథ ‘ఎండ్’ అవుతుంది.
ఇందులో హీరోకు ఎయిడ్స్ ఉంటుంది. అసలు ఆ ఎపిసోడ్ ఎందుకు పెట్టారు అనేది అర్థం కాదు. ఒకవేళ అతని తల్లి చెప్పినట్టుగా అతనికి మంచి చావు కూడా రాదు అనే మాటకు జస్టిఫికేషన్ ఇవ్వడానికే అనుకున్నా.. అందుకు తగ్గ సన్నివేశం ఒక్కటీ లేదు. పైగా ఆ తర్వాతే హీరోయిన్ తో ఫిజికల్ గా కలవాలని ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఆ హీరోయిన్.. సినిమాలోనూ హీరోయిన్ పాత్రలో కనిపిస్తుంది. కాకపోతే ఐటమ్ గర్లా.. లేక వ్యాంపా అనేది తెలియకుండా ఉంటుందా పాత్ర. దీనికి తోడు ఇంటర్వెల్ కే ఈ పాత్రను వదిలేశాడు దర్శకుడు. కరెక్ట్ గా చూస్తే ఇది క్యారెక్టర్ డ్రైవెన్ సినిమా. ఒక పాత్ర చుట్టూనే కథ, కథనం ఉంటుంది. ఇలా చేయాలంటే స్క్రీన్ ప్లే పకడ్బిందీగా ఉండాలి. ఈ మూవీలో అది పూర్తిగా తేలిపోయింది. ప్రతి ఒక్కరూ నిజాయితీగా బ్రతకాలి అనే పాయింట్ తో ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఏ దశలోనూ నిజాయితీగా రూపొందించినట్టు అనిపించదు. అసలు ఇలాంటి కథను కార్తీ ఎలా ఒప్పుకున్నాడా అనేదే పెద్ద ఆశ్చర్యం.
జపాన్ అనే పాత్రకు ఆ పేరు పెట్టడానికి ఓ కారణం ఉంటుంది. కానీ అది చాలా గొప్పది. ఇక్కడ పాత్ర చెత్తగా ఉంటుంది. దర్శకుడి ఆలోచనధోరణికి ఇదో ఉదాహరణ.
ఇక జపాన్ పాత్రలో కార్తీ ఏదో చేయడానికి ప్రయత్నించాడు. డైలాగ్ డెలివరీ కొత్తగ ప్రయత్నించారు కానీ.. అది ఓవర్ గా అనిపిస్తుంది. అతని నటన ఓకే. అనూ ఇమానుయేల్ కు మరోసారి అన్యాయం జరిగింది. సునీల్ బాగా ఆకట్టుకున్నాడు. మరో పోలీస్ గా నటించిన విజయ్ మిల్టన్ తో పాటు.. సునిల్ ఇరికించిన అమాయకుడి పాత్ర చేసిన నటుడు ప్రతిభావంతంగా నటించాడు. మిగతా పాత్రలన్నీ రొటీన్.
టెక్నికల్ గా జివి ప్రకాష్ కుమార్ నేపథ్యం సంగీతం నీరసంగా ఉంది. పాటలు కూడా ఏమంత ఆకట్టుకోలేదు. అలాగని బాలేదని కూడా చెప్పలేం. సినిమాటోగ్రఫీ బావుంది. కలర్ కరెక్షన్, డి. ఐ సింప్లీ సూపర్బ్. ఎడిటింగ్ పరంగా ఓ పదినిమిషాలైనా కట్ చేయొచ్చు. మాటలు బాలేదు. కాస్ట్యూమ్స్ ఓకే. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫైనల్ గా దర్శకుడు ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
ఫైనల్ గా : చైనా ప్రాడక్ట్ కంటే దారుణంగా జపాన్
రేటింగ్ : 2/5
- కామళ్ల. బాబురావు.