Home > సినిమా > వెనకడుగు వేసిన చంద్రముఖి 2.. సోషల్ మీడియాలో పోస్ట్

వెనకడుగు వేసిన చంద్రముఖి 2.. సోషల్ మీడియాలో పోస్ట్

వెనకడుగు వేసిన చంద్రముఖి 2.. సోషల్ మీడియాలో పోస్ట్
X

రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి' చిత్రం అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన 18 ఏళ్లకు ఆ మూవీ సీక్వెల్ రూపొందుతోంది. ‘చంద్రముఖి 2’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ చంద్రముఖిగా కనిపించబోతోంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ముందుగా ప్రచారం జరిగింది.

అయితే, తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. సెప్టెంబర్ 28న విడుదల చేయాలని తాజాగా చిత్రబృందం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఈ హార్రర్-కామెడీ మూవీ ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. అయితే, సినిమా విడుదల వాయిదాకు కారణాలు ఏంటనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ సినిమాలో చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి. ప్రస్తుతం టెక్నికల్ టీమ్ విజువల్ ఎఫెక్ట్స్ కు మరిన్ని హంగులను అద్దుతోంది. ఇందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక నటించారు. ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక కనబర్చిన నటనకు అప్పట్లో ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. గంగ అనే క్యారెక్టర్ లో చాలా అమాయకంగా కనిపిస్తూనే చంద్రముఖి అనే భయానక పాత్రలో నటించి మెప్పించింది. చంద్రముఖిగా ఆమె డ్యాన్సును చూసి.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పట్లో రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Updated : 9 Sep 2023 3:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top