Home > సినిమా > నిర్మాతతో ఈగ విలన్ వివాదం..కోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం కేసు

నిర్మాతతో ఈగ విలన్ వివాదం..కోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం కేసు

నిర్మాతతో ఈగ విలన్ వివాదం..కోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం కేసు
X

సినీ పరిశ్రమలో నిర్మాతలు, హీరోల మధ్య వివాదాలు చర్చనీయాంశమవుతున్నాయి. తమతో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకొని హీరోలు ముఖం చాటేస్తున్నారంటూ పలు పరిశ్రమల్లో నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తమిళ్ హీరో ధనుష్‌పై శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్..నిర్మాత మండలికి ఫిర్యాదు చేసింది. సినిమా చేస్తానని మాటిచ్చి చాలా ఏళ్లవుతున్న స్పందించకపోవడంతో తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. దీనిపై వివాదం ఇంకా నడుస్తోంది. ధనుష్‌కు రెడ్ కార్డ్ ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

తాజాగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌పై నిర్మాతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ వద్ద రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేయలేదని ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి అంగీకరించి.. ఇప్పటి వరకు తనకు డేట్స్ కేటాయించలేదని వాపోయారు. కిచ్చా సుదీప్‌పై ఆరోపణలు శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే తనపై ఆరోపణలను కిచ్చా సుదీప్ కొట్టిపారేశారు. సదరు నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్‌లపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో కిచ్చా సుదీప్ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే.

Updated : 8 July 2023 5:33 PM IST
Tags:    
Next Story
Share it
Top