Home > సినిమా > కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ

కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ

కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ
X

రివ్యూ : కోటబొమ్మాళి పీఎస్

తారాగణం : శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, బెనర్జీ తదితరులు

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్ ఆర్

సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి

సంగీతం : రంజిన్ రాజ్

నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడు

దర్శకత్వం : తేజ మార్ని

రీమేక్స్ అంటే ఎంత సేఫ్ గా ఉంటుందో అంతే రిస్క్. కానీ కొన్ని కథలకు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంటే సింపుల్ గా నేటివిటీలో మార్పులు చేస్తే సరిపోతుంది. అలాంటి మార్పులు చాలానే చేశాం అంటూ ముందు నుంచీ చెబుతూ వస్తోన్న సినిమా కోటబొమ్మాళి పిఎస్. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన నాయాట్టుకు రీమేక్ ఇది. ఇప్పటికే చాలామంది చేతులు మారిన ఈ సినిమా ఫైనల్ గా గీతా ఆర్ట్స్ మీదుగా బన్నీవాస్ నిర్మాణం నుంచి బయటకు వచ్చింది.కాస్టింగ్ క్రేజ్ లేకపోయినా లింగి లింగిడి అనే పాటతో మరింత పాపులర్ అయిన కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ ఎలా ఉందనేది చూద్దాం.

కథ :

రామకృష్ణ(శ్రీకాంత్) కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్. ఆ స్టేషన్ లోనే కుమారి(శివానీ) పనిచేస్తుంది. కారుణ్య నియామకం కింద అదే స్టేషన్ లో కొత్తగా జాయిన్ అవుతాడు రవి(రాహుల్ విజయ్). ఈ స్టేషన్ ఉన్న నియోజకవర్గం టెక్కలికి ఉప ఎన్నికలు వస్తాయి. కేవలం ఒక కులం ఓట్లే విజయాన్ని డిసైడ్ చేసే టెక్కలి ఉపఎన్నిక అధికార పార్టీకి కీలకం అవుతుంది. అందుకే ట్రబుల్ షూటర్ అనిపించుకున్న హోమ్ మినిస్టర్ బరిసెల జయరామ్(మురళీ శర్మ)కు ఆ నియోజకవర్గ బాధ్యత ఇస్తారు. అంతా సెట్ అనుకుంటోన్న టైమ్ లో కోటబొమ్మాళిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ఒక లోకల్ రౌడీ వల్ల కుమారి ఇబ్బంది పడుతుంది. ఆ వ్యక్తిని స్టేషన్ కు పిలిపించి మాట్లాడే క్రమంలో రామకృష్ణ, రవితో గొడవపడతాడు. ఈ క్రమంలో సిఐ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణుగుతుంది. అయితే ఆ స్టేషన్ ఇష్యూను ఒక వ్యక్తి ఫోన్ లో వీడియో తీస్తాడు. ఆ వీడియో వైరల్ కాకుండా హోమ్ మినిస్టర్ అడ్డుకుంటాడు. కట్ చేస్తే ఆ వీడియో తీసిన వ్యక్తి రవి, రామకృష్ణ, కుమారి ఉన్న పోలీస్ జీప్ కు తగిలి ప్రమాద వశాత్తూ చనిపోతాడు. దీంతో వాళ్లు కావాలనే హత్య చేశారు అనే ప్రచారం మొదలవుతుంది. తమ అనుచురుడిని చంపిన పోలీస్ లను సస్పెండ్ చేయాలని.. అప్పటి వరకూ తమ కులం ఓట్లు మీకు వేయం అని వాళ్లు భీష్మించుకుంటారు. అప్పటికి ఎన్నికలకు రెండు రోజులే టైమ్ ఉంటుంది. ఇటు జరిగిన మొత్తం సీన్ వల్ల తాము ప్రమాదంలో ఉన్నామని ఈ ముగ్గురు పోలీస్ లూ పారిపోతారు. వారిని పట్టుకుని సస్పెండ్ చేయకపోతే ఓట్లు పడవు అని హోమ్ మినిస్టర్ 24 గంటల్లోగా ఆ నలుగురిని పట్టుకుని సస్పెండ్ చేస్తా అని ‘తొడ’ కొడతాడు. ఇందుకోసం ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన రజియా అలీ(వరలక్ష్మి శరత్ కుమార్)కి ఆ కేస్ ను 24గంటల్లో సాల్వ్ చేయమని చెబుతాడు. మరి ఈ అలీ ఆ ముగ్గురు పోలీస్ లను పట్టుకుందా..? పట్టుకుంటే ఎలా సాధ్యం అయింది..? వాళ్లు ఎంత వరకూ పారిపోయారు.. ఈ క్రమంలో పొలిటికల్ గేమ్ లో పోలీస్ లు ఎలా బలయ్యారు అనేది మిగతా కథ.

ఎలా ఉంది..

కోటబొమ్మాళి పిఎస్.. చాలా సాధారణంగా మొదలవుతుంది. పాత్ర పరిచయం వేగంగానే ముగిసిపోతుంది. అయితే ఆరంభంలోనే వచ్చే ఒక ఎన్ కౌంటర్ సీన్ ఆకట్టుకున్నా.. దానికి కంటిన్యూటీ అంటూ ఏం ఉండదు. కథలోకి రాజకీయాలు, ఎన్నికలు ఎంటర్ అయిన తర్వాత ఒక్కో అంశం ఆసక్తికరంగా ముందుకెళుతూ ఉంటుంది. ఉప ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకి రెఫరెండం లాంటివి అన్న డైలాగ్స్ ప్రెజెంట్ పాలిటిక్స్ కు సరిపోయేలా ఉండటం విశేషం. కథలోకి ఒక కులానికి సంబంధించిన యువ నాయకుడి పాత్ర తీరు వల్ల కథనంలో వేగం పెరుగుతుంది. ఏదీ ఫోర్స్ డ్ గా కాకుండా చాలా సహజంగా కుదిరాయి. ఎన్నికల టైమ్ లో పోలీస్ లు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు.. ఎన్ని ఒత్తిళ్లు ఉంటాయి అనేవి బాగా చూపించారు. రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న కులం కార్యకర్త చనిపోవడం.. అందుకు కారణమైన పోలీస్ లను సస్పెండ్ చేయాలనే డిమాండ్ రావడంతో కథనంలో మరో స్టేజ్ కు వెళుతుంది. ఇటు ఎన్నికలు, అటు పోలీస్ లే పోలీస్ లను వెంటాడే సన్నివేశాలతో ఒక రేసీ స్క్రీన్ ప్లే చూడబోతున్నాం అనే కట్ తో ఇంటర్వెల్ పడుతుంది.

సెకండ్ హాఫ్ కు సంబంధించి ఊహించిన దానికంటే ఎక్కువ హై మూమెంట్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా చాలా సాధారణంగా పరిచయమైన శ్రీకాంత్ పాత్రను ఎలివేట్ చేస్తూ వచ్చే సన్నివేశాలు డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 18యేళ్ల పాటు గ్రే హౌండ్స్ లో పనిచేసి పోలీస్ గా అతన్ని మరో స్థాయిలో పరిచయం చేస్తారు. అతను ఒక కేస్ ను రాస్తే.. ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ కమీషన్ కూడా ఏం చేయలేదు అనేందుకు రిఫరెన్స్ గా ఫస్ట్ గా సీన్ గా వచ్చిన ఎన్ కౌంటర్ ను రిపీట్ చేయడం సింప్లీ సూపర్బ్. ఇక సెకండ్ హాఫ్ అంతా రామకృష్ణ, రవి, కుమారిలను పట్టుకోవడానికి వచ్చిన ఇంటెలిజెంట్ లేడీ పోలీస్ ఆఫీసర్ రజియా అలీకి రామకృష్ణకు మధ్య మైండ్ గేమ్ లా సాగుతుంది. ఈ మైండ్ గేమ్ లో మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కనిపిస్తాయి. ఎత్తులూ పై ఎత్తులూ.. అందుకోసం రామకృష్ణ కోణంలో కనిపించే తెలివైన ఎత్తుగడలూ మాస్ ఆడియన్స్ ను కూడా ఊపేస్తాయి. వీరిని పట్టుకోవడానికి పోలీస్ లు వారి ఫ్యామిలీ మెంబర్స్ తో గేమ్ ఆడినా.. అదంతా సెంటిమెంట్ గా ఉందే తప్ప కథనంలో వేగం తగ్గించదు.

ఇక ప్లీ క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్ ఒక్కసారిగా మొత్తం మార్చేస్తుంది. చూస్తున్నవాళ్ల హృదయాలు ఒక్కసారిగా బరువెక్కేలా ఉంటాయి. అలాగే కోర్ట్ రూమ్ లో వచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. ఇక చివరగా రామకృష్ణ .. రజియా అలీకి వార్నింగ్ ఇచ్చే వీడియో ఒక హై మూమెంట్ తేవడంతో పాటు.. ‘‘న్యాయంపై ఎప్పుడూ రాజకీయాలు గెలవకూడదు’’ అనే సందేశం కనిపిస్తుంది.

సింపుల్ గా ఇది పొలిటీషియన్స్ ఇలా బరితెగించిపోవడానికి ప్రధాన కారణం రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు సరిగా వాడుకోకపోవడమే కారణం అనే పాయింట్ ను హైలెట్ చేస్తూ కనిపిస్తుంది. ఇదేం సందేశంలా ఉండదు. కానీ పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో ఈ పాయింట్ మరింత కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే సాధారణంగా మొదలై.. అసాధారణ థ్రిల్లింగ్ మూమెంట్స్ తో సాగుతూ.. క్లాసులు పీకని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా కనిపిస్తుందీ కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్.

నటన పరంగా శ్రీకాంత్ అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీకాంత్ నటన ఈ సినిమాకు మెయిన్ హైలెట్. కానిస్టేబుల్ పాత్రల్లో శివానీ, రాహుల్ విజయ్ బాగా మెప్పించారు. మురళీ శర్మకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. వరలక్ష్మి శరత్ కుమార్ అలీ పాత్రలో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో అంతా బాగా చేశారు.

టెక్నికల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. లింగి లింగి లింగిడి పాట ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. సహజమైన లొకేషన్స్ లో అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. ఎడిటింగ్ బావుంది. మాటలు బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సింప్లీ సూపర్బ్. దర్శకుడుగా తేజ మార్ని ఈ చిత్రాన్ని పూర్తి కమాండ్ తో రూపొందించాడు. ఒరిజినల్ నుంచి చాలామార్పులు చేశాడు. అవన్నీ ఆకట్టుకునేలా ఉండటమే అతని సక్సెస్. కోటబొమ్మాళి రీమేక్ అయినా.. దర్శకుడుగా అతని ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

శ్రీకాంత్ నటన

కథ

కథనం

సంగీతం,

సినిమాటోగ్రఫీ

మెసేజ్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా నెమ్మదించిన కథనం

పండని సెంటిమెంట్

ఫైనల్ గా : కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో హ్యాపీగా అరెస్ట్ కావొచ్చు.

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల

Updated : 24 Nov 2023 4:46 PM IST
Tags:    
Next Story
Share it
Top