Lokesh Kanagaraj:లోకేశ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.. హైకోర్టులో పిటిషన్
X
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)పై మధురై బెంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల ఆయన తీసిన లియో సినిమా.. హింసను ప్రోత్సహించేలా ఉందని, ప్రజలపై ఇది మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుందంటూ మధురైకు చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ‘లియో సినిమాలోని చాలా సన్నివేశాలు హింసను ప్రేరేపిస్తున్నాయి. ఈ సినిమాలో మతపరమైన చిహ్నాలు, తుపాకీ సంస్కృతి, మహిళలు, పిల్లల్ని చంపాలన్న ఘోరమైన ఆలోచనలు, డ్రగ్స్ వినియోగం ఉన్నాయి’ అని పిటిషన్ లో పేర్కొన్నారు.
అంతే కాకుండా అల్లర్లు, అక్రమ కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆయుధాల బిజినెస్, పోలీసుల సహకారంతో అన్ని నేరాలు చేయొచ్చు అన్న సంఘ వ్యతిరేక ఆలోచలనలను లియో మూవీలో చూపించారని, ఇలాంటి సినిమాలు సెన్సార్ డిపార్ట్ మెంట్ సరిగ్గా పరిశీలించాలని కోరారు. అంతేకాకుండా ఈ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ను మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు సైకాలజీ టెస్టులు చేయించాలని పేర్కొన్నాడు పిటిషనర్. ఇలాంటి హింసాత్మకమైన చిత్రాన్ని తీసిన ఆయనపై కేసు నమోదు చేసి.. లియో చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ కృష్ణకుమార్, విజయకుమార్ ఎదుట విచారణకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ తరఫు న్యాయవాదులు హాజరుకాకపోవడంతో విచారణ జనవరి 8కి వాయిదా పడింది.
ఈ సినిమాలో విజయ్ దళపతి హీరోగా , త్రిష హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 2023 అక్టోబరు 18న విడుదలైంది. ప్రస్తుతం.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.