LEO MOVIE : లియో మూవీ రివ్యూ..
X
రివ్యూ : లియో
తారాగణం : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్, ప్రియాఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు.
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : మనోజ్ కే పరమహంస
సంగీతం : అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు : ఎస్ఎస్ లలిత్ కుమార్, దీరజ్ వైడి
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
షార్ట్ టైమ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు లోకేష్ కనకరాజ్. కొత్త నేపథ్యంలో కథలు చెప్పడం మొదలుపెట్టడం అతని ప్రత్యేకత. అదే షార్ట్ టైమ్ లో ఫేమ్ తెచ్చింది. ఖైదీ తర్వాత విజయ్ తో చేసిన మాస్టర్ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ విక్రమ్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ దేశవ్యాప్తంగా తిరుగులేని విజయం సాధించింది. ఈ మూవీతో పాటే లోకేష్ సినీ వర్స్ అంటూ ఖైదీ, విక్రమ్ ను కలుపుతూ కొత్త ట్రెండ్ కు తెరలేపాడు. ఆ క్రమంలో ఇప్పుడు లియో అంటూ మరోసారి విజయ్ తో సినిమా చేశాడు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను లియో అందుకున్నాడా లేదా అనేది చూద్దాం.
కథ :
పార్తీబన్( విజయ్ ) భార్య(సత్య)తో కలిసి హిమాచల్ ప్రదేశ్ లోని థియోగ్ అనే ప్రాంతంలో కాఫీ షాప్ నడుపుతుంటాడు. అతనికి టీనేజ్ కొడుకుతో పాటు స్కూల్ చదువుతున్న కూతురు ఉంటుంది. హ్యాపీ ఫ్యామిలీ. ఓ రోజు ఒక హంతక ముఠా అతని షాప్ కట్టేసిన తర్వాత లోపలకి జొరబడి దోపిడీ చేసి, వారిని చంపాలనుకుంటారు. ఈ క్రమంలో జరిగిన పోరాటంలో ఆ ఐదుగురినీ చంపేస్తాడు పార్తీబన్. కోర్ట్ వరకూ వెళ్లిన తర్వాత అతను ఆత్మరక్షణ కోసమే వారిని చంపాడనీ.. పైగా చనిపోయిన వాళ్లు కరడుగట్టిన హంతకులు అని కోర్ట్ నిర్దోషిగా విడిచిపెడుతుంది. కానీ అతనిపై దాడులు ఆగవు. అప్పటి వరకూ సంతోషంగాఉన్న జీవితం ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు పెట్టేలా మారుతుంది. ఒక దశలో అంతా సెట్ అనుకుంటోన్ టైమ్ లో ఆంటోనీ దాస్( సంజయ్ దత్) అతని వద్దకు వెళ్లి నువ్వు ‘‘లియో’’వి. అది ఒప్పుకోమని బెదిరిస్తాడు. దీని వెనక ఆంటోనీ తమ్ముడు హెరాల్డ్ దాస్( అర్జున్) కూడా ఉంటాడు. తను లియో కాదని చెప్పినా.. వారి దాడులు ఆగవు. మరి ఆ వచ్చిన వాళ్లు ఎవరు..? లియో ఎవరు..? లియోకి పార్తీబన్ కు ఉన్న సంబంధం ఏంటీ అనేది మిగతా కథ.
విశ్లేషణ :
లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే ఒక సెట్టింగ్ ను ఊహించుకునే రేంజ్ కు వచ్చాడు. విక్రమ్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత విజయ్ వంటి టాప్ స్టార్ తో రెండో సారి సినిమా చేస్తున్నాడంటే అంచనాలు భారీగా పెరిగాయి. అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ ఇదిలోకేష్ సినీవర్స్ లో భాగమా కాదా అంటూ విపరీతమైన చర్చలు. కానీ ట్రైలర్ ఆకట్టుకోలేదు. దీంతో లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నాడని మరింత అంచనాలు పెంచుకున్నారు జనం. బట్.. ఈ సారి లోకేష్ అంచనాలను అందుకున్నాడు అని చెప్పలేం. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ కాంబినేషన్ పై ఉన్న అంచనాలను అతను రీచ్ కాలేదు.
ఓ సాధారణ సెటప్ తో మొదలుపెట్టి.. పార్తీబన్ ఫ్యామిలీని పరిచయం చేసి.. అతన్ని వెంటాడే శతృవులను సెట్ చేసి హీరోను నిరంతరం ప్రాణభయంలో ఉంచుతూనే అవసరమైనప్పుడు అతను తిరుగుబాటు చేస్తూ తన కుటుంబం కోసం వచ్చిన వారిని హతమార్చడం చూస్తే ఇందులో కొత్తదనం లేకపోయినా.. తర్వాత అతని ఫ్లాష్ బ్యాక్ భయంకరంగా ఉంటుందని భావిస్తాం. బట్ అలాంటిదేం కనిపించదు. పైగా ఫ్లాష్ బ్యాక్ కోసం చాలా అంటే చాలా టైమ్ తీసుకున్నాడు. దీంతో ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. తీరా ఫ్లాష్ బ్యాక్ లో పరిచయం అయిన లియోను చూస్తే ఇప్పటి వరకూ తన హీరోలు ఏ శతృవు(డ్రగ్స్) పై అయితే పోరాటం చేస్తున్నారో.. ఈ హీరో అదే డ్రగ్స్ దందాలో ఉండటం సాధారణ ప్రేక్షకులకే కాదు.. విజయ్ ఫ్యాన్స్ కు కూడా మింగుడు పడని అంశం. పైగా అది ఒక వంశపారంపర్యంగా చేస్తున్న పనిలా భావించడం మరీ దారుణం.
తండ్రికి ఉన్న జాతకాల పిచ్చి వల్ల తన చెల్లిని ఏకంగా తండ్రే హతమార్చాలని చూడటంతో లియో ఎదురు తిరుగుతాడు. దీంతో అతన్ని కూడా చంపేయాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో చెల్లిని కోల్పోయిన లియో.. వారి బిజినెస్ మొత్తాన్ని దెబ్బ తీసి అక్కడ జరిగిన ప్రమాదంలో చనిపోతాడు. ఈ క్రమంలో వచ్చే ప్రతి యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లోని ఫైట్స్ అన్నీ సూపర్బ్ అనిపిస్తాయి. బట్ ఫ్లాష్ బ్యాక్ మాత్రం తేలిపోయింది. దీంతో టెక్నికల్ గా బ్రిలియంట్ అనిపించుకున్న లియో.. స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ రైటింగ్ పరంగా వీక్ గానే కనిపిస్తాడు. పైగా ఇద్దరు హీరోలు అన్నప్పుడు అసలు విషయం కనిపెట్టడం ఇవాళా రేపు ఆడియన్స్ కు పెద్ద కష్టమేం కాదు. అంతా అయిపోయిన తర్వాత కమల్ హాసన్ తో ఫోన్ చేయించడం చూస్తే డామేజ్ కంట్రోల్ లా ఉంది తప్ప నేచురల్ గా లేదు. సింపుల్ గా చెబితే టెక్నికల్ గా బావున్నా.. రైటింగ్ పరంగా చాలా వీక్ గా కనిపిస్తాడు లియో.
నటన పరంగా విజయ్ తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించాడు. సాల్డ్ అండ్ పెప్పర్ లుక్ తో ఇద్దరు పిల్లలకు తండ్రిలా కనిపించడం ఆహ్వానించాల్సిన విషయం. యాక్షన్ సీక్వెన్సెస్ లో విజయ్ మరోసారి అదరగొట్టాడు. త్రిష సైతం హుందాగా ఉంది. విలన్స్ గా భారీగా కనిపించినా.. సంజయ్ దత్, అర్జున్ లవి సాధారణ పాత్రలే. గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్ పాత్రలూ కొత్తవేం కాదు. మన్సూర్ అలీఖాన్, మడోన్నా సెబాస్టియన్ వి గెస్ట్ తరహా పాత్రలు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ రొటీన్.
ఈ సినిమాకు ప్రధాన బలం.. ఎప్పట్లానే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్. పాటలు బాలేదు కానీ.. నేపథ్యం సంగీతం నెక్ట్స్ లెవల్ లో ఉంది. ఆర్ఆర్ తోనే సగం సినిమాను నిలబెట్టాడు. ఎడిటింగ్ పరంగా ఇంకా చాలా కట్స్ ఉండొచ్చు. డైలాగ్స్ యావరేజ్. సినిమాటోగ్రఫీ మరో హైలెట్. సెట్స్ అన్నీ లోకేష్ గత సినిమాల్లో చూసినట్టుగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. దర్శకుడుగా లోకేష్ కనకరాజ్ ఈ మూవీతో తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేదు అనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
విజయ్
త్రిష
నేపథ్య సంగీతం
ఫైట్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కథ
కథనం
సెకండ్ హాఫ్
ట్విస్ట్
డ్రగ్స్
విలన్స్
ఫైనల్ గా : ఓన్లీ ఫర్ ఫ్యాన్స్
రేటింగ్ : 2.5/5
- కామళ్ల. బాబురావు.