LEO MOVIE : రామ్ చరణ్, ప్రభాస్ ను వాడేస్తోన్న లియో
X
ఏ సినిమాకైనా బజ్ లేకపోతే ఏదో ఒక ప్రయత్నం చేస్తూ స్టార్ హీరోలను తీసుకు వస్తుంటారు. వారి ద్వారా ఏదో ఒకటి రిలీజ్ చేయిస్తూ ఆ హీరోల ఫ్యాన్స్ ను కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు మేకర్స్. ఇది ఎప్పుడూ జరిగేదే. అయితే ఒక డబ్బింగ్ సినిమాకు బజ్ లేకపోతే అప్పుడేం చేస్తారు. పైగా వాళ్లు ప్రమోషన్స్ కూడా చేయకుండానే.. ఆ సినిమాకు బజ్ క్రియేట్ అవుతుందంటే కారణం ఏంటీ..? అంటే ఒక్కటని చెప్పలేం. అయితే ఇలాంటి సందర్భాలు అరుదు. ఆ అరుదైన సిట్యుయేషన్ ను తమదైన స్ట్రాటజీతో క్రియేట్ చేశారు లియో మేకర్స్.. అందులో భాగమే రామ్ చరణ్, ప్రభాస్ సినిమాల వ్యవహారాలు.
లియో.. తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా. ప్రస్తుతం సౌత్ లో తనదైన ముద్రను బలంగా వేసిన లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేశాడు. త్రిష, సంజయ్ దత్, అర్జున్ వంటి భారీ తారాగణం ఉంది. అనిరుధ్ సంగీతం చేశాడు. ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి. బట్ ఇదే కాంబోతో వచ్చిన మాస్టర్ మన దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే లియో విషయంలో మొదట బజ్ లేదు. ఎప్పట్లానే విజయ్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా లేదు. ఇటు చూస్తే దసరా బరిలో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు అంటూ భారీ పోటీ ఉంది. దీంతో లియో తెలుగులో కష్టమే అనుకున్నారు. బట్ ఊహించని విధంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ భగవంత్ కేసరితో పోటీ పడుతున్నాయి. అందుకు కారణమేంటా అని ఆలోచిస్తే రెండు విషయాలు అర్థం అవుతున్నాయి.
లియోలో రామ్ చరణ్ కేమియో చేశాడు అంటూ కోలీవుడ్ నుంచే న్యూస్ లీక్ అయింది. విక్రమ్ లో రోలెక్స్ లా చరణ్ ఎంట్రీ ఉంటుందని.. ఆ ఎంట్రీ లోకేష్ సినీవర్స్ లో మరో సినిమాకు లీడ్ అవుతుందనీ పుకార్లు షికార్లు చేశాయి. అవి నమ్మి తెలుగులోనూ చాలా రాశారు. బట్ ఇది నిజం కాదు అని కాస్త ఆలోచిస్తే అర్థం అవుతుంది. బట్ కామన్ ఆడియన్స్ అది పట్టించుకోరు. చరణ్ ఉన్నాడనే నమ్ముతున్నారు.. టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ తమిళ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ప్రభాస్ గురించి పదే పదే చెబుతున్నాడు. తను ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాననీ.. అయితే ఇది తన సినీవర్స్ లో భాగంగా కాకుండా ప్రభాస్ ఒక్కడి కోసమే రాసుకున్న కథ అనీ చెబుతున్నాడు. అలా ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా గేలం వేశాడు లోకేష్. సో.. ఈ ఇద్దరు హీరోల అభిమానులు తెలియకుండానే లియో మూవీ స్ట్రాటజీ ట్రాప్ లో పడిపోయారనేది టాలీవుడ్ విశ్లేషణ. లేదంటే ట్రైలర్ కూడా ఆకట్టుకోని లియో తెలుగులో ఇంత భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకుపోవడం సాధ్యమా అనేది వారి లాజిక్. అది నిజమా కాదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.