Home > సినిమా > మా ఊరి పొలిమేర2 రివ్యూ

మా ఊరి పొలిమేర2 రివ్యూ

మా ఊరి పొలిమేర2 రివ్యూ
X

రివ్యూ : మా ఊరి పొలిమేర2

తారాగణం : సత్యం రాజేష్, డాక్టర్. కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, సాహితి దాసరి, జనార్ధన్, రవివర్మ, చిత్రం శ్రీను తదితరులు..

ఎడిటింగ్ : శ్రీ వరా

సినిమాటోగ్రఫీ : కుషీదర్ రమేష్ రెడ్డి

సంగీతం : గ్యాని

నిర్మాత : గౌర్ క్రిసేన

రచన, దర్శకత్వం : డాక్టర్ అనిల్ విశ్వనాథ్

రిలీజ్ డేట్ : 03.11.2023

లాక్ డౌన్ టైమ్ లోనే తెలుగునాట ఓటిటిల హవా పెరిగింది. ఆ హవాలో వచ్చిన సినిమా మా ఊరి పొలిమేర. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య వంటి నటులు చేసిన సినిమా. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అనూహ్యంగా మంచి టాక్ వచ్చింది. గ్రామాల్లో జరిగే చేతబడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని ట్విస్ట్ లకు ఓటిటి ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. పైగా చివర్లో సీక్వెల్ కు పక్కగా సరిపోయే ట్విస్ట్ ఉండటంతో అప్పటి నుంచి సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఫైనల్ గా ఈ శుక్రవారం మా ఊరి పొలిమేర2 విడుదలైంది. మరి ఈ మూవీ కథేంటీ.. ఎలా ఉంది అనేది చూద్దాం..

కథ :

మా ఊరి పొలిమేర చివర్లో కొమురయ్య(సత్యం రాజేష్) ను చంపేశారని అతని తమ్ముడు జంగయ్య (బాలాదిత్య) కేస్ వేయడం.. తీరా తీర్పు రోజు కేస్ వెనక్కి తీసుకోవడం.. అటుపై ఆ ఊరిలో జరిగిన హత్యలకు కారణం తన అన్నే అని.. అతనింకా బ్రతికే ఉన్నాడనీ.. అలాగే చనిపోయిందనుకున్న కవిత అతనితోనే ఉందనే ట్విస్ట్ తో ఫస్ట్ పార్ట్ ముగిసిపోయింది. ఇక మా ఊరి పొలిమేర2లో తన అన్నను వెదుకుతూ వెళ్లిపోతాడు జంగయ్య. అతను పనిచేసే స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఎస్ఐ రవీంద్ర నాయక్( రాకేందు మౌళి) ఆ కేస్ ను మళ్లీ బయటకు తీస్తాడు. అదే సమయంలో ఊరి చివరి ఉన్న గుడిలోకి వెళ్లాలని కొందరు ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మరోవైపు కొమురయ్య స్నేహితుడు బలిజ(గెటప్ శ్రీను) భార్య అతన్ని వదిలివెళ్లిపోతుంది. ఆమె కోసం మారాలని అతను అయ్యప్ప మాల వేసుకుంటాడు. ఆ మాల తీసేందుకు కేరళ వెళ్లిన అతనికి అనుకోకుండా కొమురయ్య కనిపిస్తాడు. అతన్ని ప్రశ్నిస్తూ అనుసరించిన బలిజకు అనేక విషయాలు అర్థం అవుతాయి. అవన్నీ తప్పని చెప్పినా కొమురయ్య వినిపించుకోడు. వికృతమైన క్షుద్ర పూజలు చేస్తూ.. కేరళలలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మరింత మంది మంత్రగాళ్లను కలుసుకుని పెద్ద తంత్రాలు నేర్చుకుంటాడు. ఆ పూజల ద్వారా అతనేం చేయాలనుకున్నాడు. ఊరిలో హత్యలు చేస్తున్నది ఎవరు..? గుడిని తెరవాలనుకుంటున్నది ఎవరు..? ఎందుకు..? ఎస్ఐ ఈ కేస్ లో వెలికి తీసిన నిజాలేంటీ.. కొమురయ్య తమ్ముడు జంగయ్య ఏమయ్యాడు..? చివరికి కొమురయ్య అతని భార్య లక్ష్మి(కామాక్షి భాస్కర్ల) కలుసుకున్నారా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

మా ఊరి పొలిమేర మూఢ నమ్మకాల్లో ఒకటిగా భావించే చేతబడి నేపథ్యంలో సాగే కథ. ఆ కథను మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఈ రెండో భాగంలో కనిపిస్తుంది. కొమురయ్య పాత్రను రివీల్ చేసిన విధానం చేయడానికి బలిజ పాత్రతో అయ్యప్ప మాలను వేయించడం అనేది మంచి ఎత్తుగడ. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఎస్ఐ తీసుకున్న నిర్ణయం, దానికి ఇంటర్ లింక్ గా కేరళ ఎపిసోడ్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. అయితే పదే పదే.. ముందు వెనకా అంటూ.. కొన్ని రోజుల క్రితం అనే ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా వస్తుండటం ఫస్ట్ హాఫ్ లో కాస్త ఇబ్బందిగా సాగుతాయి. ఫస్ట్ పార్ట్ చూడని వారికోసం చేశారేమో అనిపించినా.. ఎక్కువ సార్లు రిపీట్ కావడం బాలేదు. అయితే కేరళలో బలిజ.. కొమురయ్యను కలిసిన తర్వాత సాగే క్షుద్ర పూజల ఎపిసోడ్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. గెస్ట్ పాత్రలో కనిపించిన కరుణ కుమార్ కూడా ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుండటంతో సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తి ఏర్పడుతుంది.

ఒక రకంగా సెకండ్ హాఫ్ గురించి చెప్పడం కంటే చూస్తేనే బావుంటుంది. ఫస్ట్ హాఫ్ కంటే చాలా బెటర్ గా ఉంటుంది. వరుసగా వచ్చే ట్విస్ట్ లు సింప్లీ సూపర్బ్. రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయలేనన్ని ట్విస్ట్ లు ఉన్నాయి. ఆ ట్విస్ట్ లన్నీ ఒకటొకటిగా రివీల్ అవుతున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒక జర్క్ కనిపిస్తుంది. ఇదే దర్శకుడి సక్సెస్ కు నిదర్శనం. ముఖ్యంగా కవిత, రాముల, సర్పంచ్ కూతురు కోణంలో వచ్చే సన్నివేశాలన్నీ ఒక్కసారిగా అదిరిపడేలా ఉన్నాయి. అలాగే కవిత కోణంలో ఇచ్చిన ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ లో తను కొమురయ్యతో కలిసి కేరళ వెళ్లినా.. సెకండ్ పార్ట్ లో ఆ పాత్రతో అదిరిపోయే ట్విస్ట్ ఉంది.

ఇక ఆ ఊరి గుడికి సంబంధించిన ప్లాట్ చాలా పాతదే అయినా దాన్ని చేతబడి కోణంలో చూపించడం కొత్తగా అనిపిస్తుంది. మామూలుగా ఇప్పటి వరకూ చేతబడి చేసేవాళ్లెవరూ గుడిలోకి వెళ్లరు అనేదే చాలా సినిమాల్లో చూశాం.. పుస్తకాల్లో చదివాం. అందుకు భిన్నంగా ఇక్కడ కొమురయ్య గుడికి వెళ్లడం, బొట్టు పెట్టుకోవడమే కాదు.. ఏకంగా గుడిలోనే క్షుద్రపూజ చేయడం అనేది ప్రీ క్లైమాక్స్ కు ముందు గూస్ బంప్స్ తెప్పించే సీన్. అలాగే అతను తన భార్య వద్దకు వెళ్లడం.. ఆమె అతని కోసమే ఎదురుచూస్తున్నట్టుగా.. వారికి ఇష్టమైన పున్నమి ఇంట్లో ఉండటం.. భర్త తిరిగి రాగానే పట్టలేని ఆనందంతో అన్నం వండి వడ్డించడం.. ఇవన్నీ క్లైమాక్స్ ను మరింత రసవత్తరంగా మారుస్తాయి. బట్ క్లైమాక్స్ లో దర్శకుడు హీరోయిన్ పాత్రను తీర్చి దిద్దిన విధానం సూపర్బ్. ఆ సీన్ లో కామాక్షి నటన చాలా చాలా బావుంది. ఈ క్రమంలో బ్రతుకులు మారాలంటే చేయాల్సింది చేతబడి కాదు.. చదువుకోవాలనే సందేశం తన పాత్రతో చెప్పించాడు దర్శకుడు.

చివరగా మూడో పార్ట్ కూ లీడ్ ఇస్తూ.. సడెన్ గా కామాక్షిని కొత్తగా ఎంటర్ అయిన పృథ్వీ చంపేయడంతో పాటు ఎస్ఐ వారితో చేతులు కలపడం.. జంగయ్య క్యారెక్టర్ మళ్లీ ఎంటర్ కావడంతో సినిమా ముగుస్తుంది.

నటన పరంగా సత్యం రాజేష్ కెరీర్ బెస్ట్ రోల్ ఇది. అద్భుతంగా నటించాడు. చాలా సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. కామాక్షికి ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ లో నటించేందుకు ఎక్కువ అవకాశం వచ్చింది. దాన్ని తను బాగా ఉపయోగించుకుని తన ప్రతిభనంతా చూపించింది. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి తను చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. ఇక గెటప్ శ్రీను, రాకేందు మౌళి బాగా చేశారు. అసలు ట్విస్ట్ సాహితి పాత్రతో ఉండటం .. తనూ బాగా నటించడం ప్లస్ అయింది. ఇక కొమురయ్య పెదనాన్న పాత్రలో నటించిన పలాస ఫేమ్ జనార్ధన్ కు ఈ పార్ట్ లో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. అతను నిజంగానే చేతబడులు చేసేవాడిలా నేచురల్ గా యాక్ట్ చేశాడు. మిగతా అందరూ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ గా గ్యానీ నేపథ్య సంగీతం మెయిన్ హైలెట్. అసలే మాత్రం ఊహించని రేంజ్ లో తన ఆర్ఆర్ తో సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. నెక్ట్స్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. నైట్ ఎఫెక్ట్స్ లో వాడిన లైటింగ్ నేచురల్ గా ఉండేందుకా లేక మైనసా అనేది వాళ్లే చెబితే బావుంటుంది. ఎడిటింగ్ బావుంది. డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా అనిల్ విశ్వనాథ్ కు ఈ సారి కాస్త ఎక్కువ బడ్జెట్ తో కూడిన స్వేచ్ఛ దొరికింది. దాన్ని మరిన్ని ట్విస్ట్ లో ఉపయోగించుున్నాడు అనే చెప్పాలి. ఓవరాల్ గా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఈ మూవీ సెకండ్ హాఫ్ చాలా బావుంది అని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

కథ

స్క్రీన్ ప్లే

ట్విస్ట్ లు,

నేపథ్య సంగీతం

ఇంటర్వెల్ బ్యాంగ్

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్

ఎడిటింగ్

మైనస్ పాయింట్స్ :

రిపీటెడ్ సీన్స్

హారర్ ఎలిమెంట్స్ లేకపోవడం

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

ఫైనల్ గా : మా ఊరి పొలిమేర2 మరిన్ని ట్విస్ట్ లతో మెప్పించిన సినిమా

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల

Updated : 3 Nov 2023 2:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top