Home > సినిమా > MAD Movie Review: మ్యాడ్ మూవీ రివ్యూ

MAD Movie Review: మ్యాడ్ మూవీ రివ్యూ

MAD Movie Review: మ్యాడ్ మూవీ రివ్యూ
X

రివ్యూ : మ్యాడ్

తారాగణం : నితిన్ నార్నే, రామ్ నితిన్, సంగీత్ శోభన్, శ్రీ గౌరీ ప్రియ, అననతిక, గోపిక, విష్ణు తితరులు

ఎడిటర్ : నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ : షామ్ దత్ - దినేష్ కృష్ణన్ బి

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

నిర్మాతలు : హారిక సూర్యదేవర, సాయి సౌజన్య

దర్శకత్వం : కళ్యాణ్ శంకర్

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనగానే కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి. కాలేజ్ స్టోరీస్ అంటే కూడా అలాంటివి కొన్ని కనిపిస్తాయి. ఈ తరహా కథలు మీటర్ దాటనంత వరకూ బావుంటాయి. దాటితే అయితే బెంచ్ మార్క్ అవుతాయి లేదంటే డిజాస్టర్ అవుతాయి. బట్ మీటర్ లోనే ఉంటూ నవ్విస్తే ఓకే అనిపించుకుంటాయి. ఈ తరహా కథేనేమో అని ట్రైలర్ తో అనిపించుకుని, ప్రమోషన్స్ తో హైప్ పెంచిన సినిమా మ్యాడ్. ఇవాళ(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :

మనోజ్(రామ్ నితిన్), అశోక్(నార్నె నితిన్), దామోదర్( సంతోష్ శోభన్), లడ్డు( విష్ణు) నలుగురు క్లాస్ మేట్స్. కలుస్తాడు. కాలేజ్ నచ్చలేదని వెళ్లిపోదాం అనుకున్న లడ్డును ఒప్పించి అక్కడే చదువుకునేందుకు ఒప్పిస్తారు. అలా మొదలైన వీరి స్నేహంలోకి ప్రేమకథలూ వస్తాయి. అశోక్ ఇంట్రావర్ట్.. తనను ఓ అమ్మాయి ఇష్టపడుతున్నా దగ్గర కావడానికి ఇబ్బంది పడతాడు. మదన్ రోమియో.. కనిపించిన అమ్మాయినల్లా ఫ్లర్ట్ చేస్తూ చివరికి ఆ కారణంగానే తను సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి నుంచి విడిపోవాల్సి వస్తుంది. డిడి అనబడే దామోదర్ తన లైఫ్ లోకి ఏ అమ్మాయీ రాదని క్లారిటీతో ఓ రోజు పెద్ద లెక్చర్ దంచుతాడు. అది విన్న ఒక అమ్మాయి.. అతన్ని ప్రేమిస్తున్నా అని ఒక లెటర్ రాస్తుంది. తనెవరనేది మాత్రం చెప్పదు. తనతో ఫోన్ లో మాట్లాడుతూనే నాలుగేళ్ల ఇంజినీరింగ్ పూర్తి చేస్తూ తనను ఆరాధిస్తుంటాడు డిడి. మరి ఇంజినీరింగ్ అయిపోయే నాలుగేళ్ల పాటు ఎలా సాగింది. ఎన్ని మలుపులు ఉన్నాయి.. ఎన్ని జ్ఞాపకాలున్నాయి.. లవ్ స్టోరీస్ ఎలా మొదలయ్యాయి.. ఎలా ఎండ్ అయ్యాయి.. అంటూ సాగే సింపుల్ కథ ఈ మ్యాడ్.

ఎలా ఉంది :

కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటే అదీ ఇంజినీరింగ్ కాలేజ్ అంటే అయితే కాలేజ్ లేదంటే హాస్టల్ కామన్ గా ఉంటాయి. ఈ సినిమాలో వీళ్లు కూడా అంతే. కాలేజ్ నుంచి క్యాంటీన్ గొడవ, ర్యాగింగ్ లు, లవ్ స్టోరీలూ.. భిన్నమైన నేపథ్యమైన లైటర్ వే లో సాగే ఎమోషన్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. విశేషం ఏంటంటే.. ఇప్పటి వరకూ వచ్చిన ఎన్నో కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ లో ఈ కథనం చాలాసార్లు చూసి ఉన్నాం. అయినా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. నిజానికి మ్యాడ్ అంటే మదన్, అశోక్, దామోదర్ ల పేర్లలోని మొదటి అక్షరాల కలయిక. అంచేత ఇది పిచ్చి కాదు.

కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై జరిగే ర్యాగింగ్ విషయంలో వీళ్లు కాస్త శ్రుతి మించిన డైలాగ్స్ వాడారు. బట్ వాటికి కనెక్ట్ అయ్యే వాళ్లూ ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ర్యాగింగ్, ముగ్గురి కథలు, ప్రేమలూ, క్యాంటీన్ కోసం బాస్కెట్ బాల్ పోటీ అంటూ చకా చకా సాగిపోతుంది. పాత కథనమే, చాలా హ్యాపీడేస్ మొదలుకొని ఆ మధ్య వచ్చిన చిచ్చోరే వరకూ ఇలాంటి సన్నివేశాలుచాలానే చూశాం. అయినా కొత్త డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే వేగంగా ఉండటం వల్ల కంటిన్యూస్ గా పంచ్ లు పేలడం వల్ల మొదటి సగం సాఫీగా సాగిపోతుంది.

రెండో సగం మొదలు కాగానే దర్శకుడు సడెన్ గా డల్ అయినట్టు అనిపిస్తుంది. బట్ కాలేజ్ లవ్ ఒద్దంటూ సాగే సాంగ్ తో మళ్లీ ఊపు మొదలవుతుంది. అటుపై గాళ్స్ హాస్టల్ లో దూరడం, ప్రేమకథలు మొదలవడం.. చివరికి అన్నీ సుఖాంతం కావడం.. ఇలా ఒక మీటర్ లో సాగుతూ.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలా ఫార్ములాను దాటకుండా రాసుకున్న స్క్రీన్ ప్లేతో హ్యాపీ ఎండ్ కార్డ్ వేస్తాడు దర్శకుడు. కథనం పరంగా కొన్ని పరమ రొటీన్ గా ఉన్నా.. ఫ్రెష్ కామెడీతో మెప్పిస్తాడు.

ఆర్టిస్టుల పరంగా అంతా బానే చేసినట్టు కనిపిస్తుంది. ఎన్టీఆర్ బావమరిదిగా చేసిన అశోక్ పాత్రధారి మాత్రం కాలేజ్ స్టూడెంట్ గా సెట్ కాలేదు. అతని కోసం మాస్ అప్పీల్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఆ తరహా కథల్లో సెట్ అవుతాడేమో కానీ మ్యాడ్ మెప్పించలేదు. నటన పరంగా ఓకే. మదన్ గా నటించిన నితిన్ బావున్నాడు. యాక్టివ్ గా కనిపించాడు. టైమింగ్ కూడా బావుంది. ఈ అందర్లోకీ సినిమా మొత్తం సింగిల్ హ్యాండ్ గా నడిపించాడా అనిపించింది సంతోష్ శోభన్. అతని టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ.. అచ్చంగా రాజేంద్ర ప్రసాద్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉందో అలా అనిపిస్తుంది. సినిమా మొత్తం అదరగొట్టాడు అంటే అతిశయోక్తి కాదు. సంతోష్ తెలుగులో చాలా చాలా బిజీ అవుతాడనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. హీరో మెటీరియల్ కాదు కానీ.. అతన్ని ఓ ట్రాక్ గా పెట్టుకుని బలమైన కామెడీ రాసుకోవచ్చు. ఇక లడ్డుగా నటించిన విష్ణు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ సెటైర్స్ తో బాగా నవ్వించాడు. మ్యాడ్ తర్వాత ఇతనూ బిజీ అవుతాడు. హీరోయిన్ల పాత్రలన్నీ వెరీ రొటీన్. ఉన్నారంటే ఉన్నారంతే. బట్ ఉన్నంతలో ముగ్గురూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్ వి రొటీన్ రోల్స్ .

టెక్నికల్ గా మ్యూజిక్ మెయిన్ ఎసెట్ గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో మంచి ఊపున్న బీట్స్ తో పాటు కథనానికి తగ్గట్టుగా హుషారైన నేపథ్య సంగీతం కూడా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడింగ్ బావుంది. డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడుగా కళ్యాణ్ శంకర్ కొత్త కథను ఎంచుకోలేదు. కానీ కొత్తగా చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.

ప్లస్ పాయింట్స్ :

ఆర్టిస్టులు

కామెడీ

సంగీతం

స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

ర్యాగింగ్ సీన్స్

యాక్షన్ ఎపిసోడ్స్

ఫైనల్ గా : రొటీన్ బట్ వెరీ ఎంటర్టైనింగ్

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల

Updated : 6 Oct 2023 12:50 PM IST
Tags:    
Next Story
Share it
Top