Mangalavaram: జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో అదరగొట్టిన ‘మంగళవారం’
X
16వ ‘జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ (Mangalavaram) నాలుగు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తంచేస్తూ తన టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి మంగళవారం ను తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బోల్డ్ కథతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక ఆసక్తికరమైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో (JIIF 2024) ఈ సినిమాకు ఏకంగా 4 అవార్డులు లభించినట్లు చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో మంగళవారం మూవీ నాలుగు అవార్డ్స్ దక్కించుకున్నట్లు కొత్తగా పోస్టర్ రిలీజ్ చేస్తూ విషయాన్ని తెలియజేశారు.
జైపూర్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా పాయల్ రాజ్‌పుత్ అవార్డ్ అందుకోగా.. ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో రాజా కృష్ణన్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అలాగే ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీలో గుళ్లపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ముదసర్ మొహమ్మద్ అవార్డ్స్ అందుకున్నారు. కథ - కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేసారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు.