Martin Luther King Trailer : ఎడ్డి మొహం కాదు.. మార్టిన్ లూథర్ కింగ్
X
ఎన్నో కమర్షియల్ సినిమాల మధ్య బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడో కానీ రావు. ఆ ఎప్పుడో అనే సందర్భం కూడా తెలుగులో చాలా తక్కువ. అందుకే ఎక్కువగా డబ్బింగ్ సినిమాల విషయంలో ఇది చూస్తుంటాం. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా మండేలా. మండేలా అక్కడ సూపర్ హిట్ అయింది. ఆ చిత్రాన్నే తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ గా రీమేక్ చేశారు. తెలుగులో సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
ఓ చిన్న ఊరిలో అన్నదమ్ములిద్దరూ సర్పంచ్ పదవికి పోటీ పడుతుంటారు. ఖచ్చితంగా గెలవాలని అడ్డమైన హామీలన్నీ ఇస్తుంటారు. తీరా ఎన్నికల టైమ్ కు ఎవరి ఓట్లు ఎన్ని అనేది తేలిపోతుంది. బట్ ఇద్దరికీ సమానంగా ఉంటాయి ఓట్లు. తమను గెలిపించే ఆ ఒక్క ఓటు ఎవరిదా ఆరా తీస్తే అప్పటి వరకూ ఊరివాళ్లంతా.. ఎడ్డిగాడు అని పిలుచుకునే వ్యక్తి అని తెలుస్తుంది. అప్పటి నుంచి ఇరువర్గాలు ఆ వ్యక్తిని రకరకాలుగా కాకా పడుతూ తమకు ఓటు వేసేలా ప్రలోభ పెడుతుంటారు. మరి అతను ఎవరికి ఓటు వేశాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంతోషాలేంటీ, సమస్యలేంటీ.. అనేది సినిమాలో చూడాలి.
ఈ ట్రైలర్ చూస్తే సర్పంచ్ పదవి అనే కోణంలోనే చూపించినా.. ప్రస్తుతం మన దేశ ఎన్నికల ముఖచిత్రంపై అద్భుతమైన సెటైర్ అని తమిళ్ వెర్షన్ చూసిన వారికి అర్థం అవుతుంది. గెలవడమే లక్ష్యంగా ప్రజలను మోసం చేస్తూ అడ్డమైన హామీలిస్తూ.. తర్వాత వారిని గొర్రెలుగా మార్చే నాయకులు ఒకవైపు.. ఏ నాయకుడు ఎంత ఇచ్చాడు.. అది తీసుకుని మన ఓటును అమ్ముకున్నామా లేదా అనే ప్రజలు మరోవైపు గా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి సరైన అర్థం ఉండదు అంటూ అర్థవంతమైన కోణంలో సాగుతుందీ సినిమా.
సంపూర్ణేష్ బాబు పేరు నమోదు చేస్తూ శరణ్య ప్రదీప్ అతని పేరు అడుగుతుంది. అతను అందరూ తనను ఎడ్డిమొహం అంటారు.. కాబట్టి అదే తన పేరు అంటాడు. దానికి తను వాళ్లు పిలవడం వల్ల కాదు.. నువ్వు పలకడం వల్ల నీకు ఆ పేరు స్థిరపడింది అంటుంది. చిన్న డైలాగ్.. కానీ లోతైన అర్థంతో కనిపిస్తుంది. తర్వాత ఆవిడే అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెడుతుంది. మరి దీని వెనక కథేంటనేది సినిమాలో చూడాలి. ఓవరాల్ గా చూస్తే మార్టిన్ లూథర్ కింగ్ రీమేక్ ను సరిగ్గానే హ్యాండిల్ చేశారు అనిపిస్తోంది.