Home > సినిమా > న్యూసెన్స్ వెనుక తప్పెవరిది.. మీడియాదా.. జనానిదా..?

న్యూసెన్స్ వెనుక తప్పెవరిది.. మీడియాదా.. జనానిదా..?

న్యూసెన్స్ వెనుక తప్పెవరిది.. మీడియాదా.. జనానిదా..?
X

మీడియాకు ప్రతి వార్త అపురూపమే. ఏ చిన్న సమాచారమైనా సంచలనమే. కొన్ని సంస్థలైతే పనికొచ్చే విషయాల కన్నా పనికి రాని వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ మీడియా ఇజ్జత్ తీస్తున్నాయి. ఎక్స్‌క్లూజివ్ అంటూ గంటల తరబడి లైవ్లు, అర్థంపర్థం లేని డిబేట్లతో రేటింగ్ కోసం కక్కుర్తిపడుతున్నాయి. సందర్భంతో పనిలేకుండా ఇటీవల మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై సోషల్ మీడియాలో జనం ఏకిపారేస్తున్నా మాకేం పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

మీడియా ఓవరాక్షన్

సెలబ్రిటీల ఇంట్లో ఏం జరిగినా మీడియాకు పండగే. సందర్భం ఏదైనా ఓ ఈవెంట్ గురించి ఉప్పందిందంటే చాలు.. కెమెరాలు, మైకులు పట్టుకుని రిపోర్టర్లు అక్కడ ప్రత్యక్షమైపోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనకు పాప పుడితే మీడియా చేసిన హడావుడి, హంగామా అంతా ఇంతా కాదు. ఉపాసన డెలవరీ ఎప్పుడు, ఎక్కడవుతుంది అన్న వివరాల నుంచి పుట్టిన బిడ్డ జాతకం చెప్పడం వరకు మీడియా చేస్తున్న ఓవరాక్షన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవకాశం దొరకాలే గానీ పుట్టిన బిడ్డ అభిప్రాయం తెలుసుకుందామంటూ పాప మూతి దగ్గర మైకులు పెట్టే ఛానళ్లు ఉన్నాయి.

పాప జాతకం చెప్పేసిన ఛానళ్లు

బిడ్డ పుట్టిన విషయాన్ని లైవ్లో రిపోర్ట్ చేయడమే ఎక్కువ. అలాంటిది పాప జాతకం ఇలా ఉంటుందంటూ ముక్కుపచ్చలారని చిన్నారి భవిష్యత్పై రచ్చ చేస్తుండటం మరో విడ్డూరం.మెగా ప్రిన్సెస్ పుట్టిన ముహూర్తం అద్భుతంగా ఉందని, పాపకు తిరుగులేదని కొన్ని ఛానెళ్లు జాతకాలు చెప్పేస్తున్నాయి. ఇంకొన్నైతే మెగా ఫ్యామిలీ రెండో తరంలో మొదటి బిడ్డగా ఆడపిల్లలు పుడతారని అది ఆనవాయితీ అంటూ కొత్త సెంటిమెంట్లు పుట్టిస్తున్నారు.

మెగా డాటర్స్ విషయంలో

ఇదొక్కటే కాదు... మెగా డాటర్స్ విషయంలో మీడియా చూపిన అత్సుత్సాహం జుగుత్స కలిగించింది. మీడియా సంస్థలే దగ్గరుండి వారికి విడాకులు ఇప్పించేలా ఉన్నాయన్న విమర్శలు ఎదురవుతున్నయాి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, నాగబాబు కుమార్తె నిహారిక విడాకుల గురించి మీడియా చేసిన, చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇవన్నీ చూడలేక ఒక దశలో స్వయంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ మీడియా తీరుపై అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా దున్నపోతుపై వానపడ్డట్లు దులిపేసుకున్న ఛానెళ్లు షరా మామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

పర్సనల్ లైఫ్ ఉండదా

సెలబ్రిటీల ఇంట్లో బిడ్డ పుడితే మీడియా అంత ఫోకస్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే. వారికి పర్సనల్స్ ఉంటాయి. ప్రైవసీ అవసరం అనే ఇంగితం లేకుండా మీడియా ప్రవర్తిస్తోందని జనం ఫైర్ అవుతున్నారు. కేవలం సెలబ్రిటీలైనంత మాత్రాన వారిని పబ్లిక్ ప్రాపర్టీలా మార్చేసి రేటింగ్ కోసం మీడియా హద్దులు దాటడాన్ని తప్పుబడుతున్నారు. మినిట్ టు మినిట్ ప్రసారాల పేరుతో ఒక ఫ్యామిలీ హ్యాపీ మూమెంట్ను ఎంజాయ్ చేయకుండా చేసే హక్కు మీడియాకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు

జనాల తీరు

ఇదంతా నాణేనికి ఒకవైపు. జనాల తీరు మరోవైపు. మీడియా ఇలా తయారయ్యేందుకు ఆడియన్సే కారణమనడంలో ఎలాంటి డౌట్ లేదు. సినిమా స్టార్లు కనిపించగానే సెల్ఫీల కోసం పరిగెత్తుకెళ్లే జనమే.. వారి అఫైర్లు, విడాకుల గురించి ఎగబడి మరీ చూస్తారు. చదువుతారు. ‘‘భర్తతో విడిపోయిన మెగా డాటర్, నటి కిన్నెర అసలు స్వరూపం, సమంత ఆ రాత్రి ఎవరితో ఉందో తెలుసా’’ అనే హెడ్ లైన్స్ ఉన్న వార్తలు, వీడియోలకు మిలియన్ల వ్యుస్ రావడమే ఇందుకు నిదర్శనం. జనాలే ఇలాంటి వార్తలు చూసినప్పుడు వాటిని ప్రోత్సహించినప్పుడు వాటిని చూపించడంలో తప్పేముందన్నది మీడియా వాదన. ముందు జనం చూసే తీరు మారితే మీడియా ఆటోమేటిక్గా మారుతుంది. అలా జరగనంత కాలం లైవ్ కవరేజీల పేరుతో మీడియా హద్దులు దాటూతూనే ఉంటుంది. మినిట్ టూ మినిట్ వార్తల ప్రసారం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

Updated : 20 Jun 2023 5:30 PM IST
Tags:    
Next Story
Share it
Top