స్టార్ హీరో సినిమాలో..డజన్ మంది హీరోయిన్లు!
X
సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండటం కామన్. ఒక మూవీలో ఎంతమంది హీరోయిన్లు ఉంటే అంత కిక్కు అన్నది ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్‌గా మారింది. అలాంటిది ఓ హీరో పక్కన ఏకంగా 12 మంది హీరోయిన్లు నటించడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ అలా చేస్తే అది ఇండస్ట్రీలో ఓ రికార్డే అవుతుంది. ఇప్పుడు అలాంటి రికార్డునే క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో అదరగొడుతున్నారు. ఓ పక్క భోళా శంకర్ సినిమా చేస్తూనే మరోవైపు యువ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారు. బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి మొదటి సినిమాతోనే మ్యాజిక్ చేసిన వశిష్ట్ త్వరలో మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. యువ డైరెక్టర్ వశిష్ట్‌తో కలిసి పనిచేసేందుకు చిరు ఓకే కూడా చెప్పేశారు. కథ కూడా నచ్చడంతో త్వరలో ఈ సినిమా పట్టాలకెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు డైరెక్టర్.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజా ఊహాగానాల ప్రాకారం ఫాంటసీ జానర్లో వస్తున్న ఈ మూవీలో 12 మంది స్టార్ హీరోయిన్లను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. చిరు కూతురు ఈ సినిమాను నిర్మించనున్నారట. దీంతో హీరోయిన్లను వెతికే పనిలో మేకర్స్ నిమగ్నమయ్యారనే టాక్ వినిపిస్తోంది.
దాదాపుగా చాలా వరకు సినిమాల్లో ఒక హీరోయిన్ ఉన్నా ఆమెకంటూ పెద్దగా రోల్ ఏమీ ఉండదు. కేవలం గ్లామర్ పాత్రలకు పాటలకు తప్పా తెలుగు సినిమాల్లో పెద్దగా వారికి ప్రయారిటీ ఉండదనే టాక్ ఉంది. అందుకు విరుద్ధంగా వశిష్ట్ చిరు సినిమాను తీయబోతున్నారు. పేరుకే 12 మంది హీరోయిన్లను తీసుకోవడం కాదు ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందట. ఇంత మంది హీరోయిన్లను ఈ సినిమాలో చూపించడం ఓకే కానీ ఎవరిని ఎంపిక చేయాలన్నది ఇప్పుడు మేకర్స్‌కు పెద్ద టాస్క్‌గా మారిందట. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్లకు మామూలు డిమాండ్ లేదు. స్టార్ హీరోల సినిమాకు ఒక్క హీరోయిన్ దొరకడమే కష్టమనుకుంటే ఇప్పుడు 12 మందిని ఎక్కడి నుంచి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో ఎవరిని అడిగినా నో చెప్పే అవకాశం తక్కువే. వాళ్ల కాల్షీట్లు సర్దుబాటు కావడమే ఇక్కడ ప్రధానం. మరి చిరుతో జోడీ కట్టే ఆ 12 మంది హీరోయిన్లు ఎవరు? ఆ పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.