Home > సినిమా > ఇక పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి

ఇక పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి

ఇక పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి
X

శివశంకర వర ప్రసాద్.. అలియాస్ మెగాస్టార్ చిరంజీవి.. అతను వెండితెర ఆశల శిఖరాన్ని అధిరోహించాలని కలలు కన్నాడు. విజయం శిఖరం వంటిది కదా.. ఒకటి చేరగానే మరోటి కనిపిస్తుంది. అందుకే ఆశ ఆశయం అయింది. అన్ని శిఖరాలూ చేరాలనుకున్నాడు. ఇందుకోసం పునాదిరాళ్లను బలంగా వేసుకున్నాడు. నటుడు కావాలన్న తన ఆశయాన్ని ప్రాణంకంటే ఖరీదుగా భావించాడు. అందుకే ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేశాడు. నలుగురులో ఒకడుగా మొదలైనా.. ఆ నలుగురిలోనూ తనదైన ముద్ర చూపించాడు. అడుగుల వేగం పెరిగింది. ఒక్కో సినిమానూ పేర్చుకుంటూ .. పెద్దల మాటలను ఆలకిస్తూ.. స్వయంకృషితో ఎదుగుతూ.. సుప్రీమ్ హీరోగా మారాడు. రొటీన్ రోల్స్ చేసినా తనకే సొంతమైన ఓ స్పార్క్ ను ఆడియన్స్ కు పరిచయం చేశాడు. ఆ స్పార్క్ అతని కళ్లల్లో కనిపిస్తుంది. అదే అతన్ని కోట్లమంది ప్రేక్షకులకు దగ్గర చేసింది. డ్యాన్స్ లో గ్రేస్, ఫైట్స్ లో రియలిజం, మ్యానరిజమ్స్ లో మాస్ కు బాగా దగ్గరయ్యాడు. ఏ నటుడైనా మాస్ ను మెప్పిస్తే ఇక అతనికి తిరుగుండదు కదా.. అందుకే వారస హీరోలెందరో తనతో పాటు పోటీలో ఉన్నా.. తనే మేటి అనిపించుకున్నాడంటే కారణం.. మాస్ కు నచ్చే అన్ని అంశాలపైన పట్టు సాధించాడు కాబట్టే.ఈ కారణంగానే ఎంతోపోటీ ఉన్న తెలుగు సినిమా గ్యాంగ్ కు అతనే లీడర్ అయ్యాడు.ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అనుకుంటోన్న టైమ్ లో బాలీవుడ్ మెగాస్టార్ అయిన అమితాబ్ ను కూడా దాటేసి.. ‘‘బిగ్గర్ దన్ బిగ్ బి’’ అనిపించుకున్నాడంటే ఆ ప్రయాణం ఎంత గొప్పగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో మరపురాని విజయాలు.. మరెన్నో రికార్డులు.. రివార్డులు. అలాగే కొన్ని ఫ్లాపులూ. బట్ ఆయన రేంజ్ మారలేదు. క్రేజ్ తగ్గలేదు. అభిమానుల హృదయాల్లో శాశ్వత ఖైదీలా నిలిచిపోయాడు కాబట్టే.. ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఏ ఇబ్బంది లేకుండానే కెరీర్ సాగింది.

స్థాయి పెరుగుతూ వచ్చినా.. తను వచ్చిన స్థానాన్ని మర్చిపోలేదు. అందుకే తనను ఇంత వాడిని చేసిన తెలుగు ప్రేక్షకుల కోసం, ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఎంతోమందికి ప్రాణదాతలా మారాడు. ఎంతోమంది కంటివెలుగై నిలిచాడు. రాజకీయంగానూ ప్రజాసేవ చేయాలని భావించినా.. అది తన లాంటి సున్నిత మనస్కులకు సరిపోదని తెలుసుకుని చాలా తక్కువ సమయంలోనే తప్పుకున్నాడు. ఇది అతని నిజాయితీకి మరో తార్కాణం.

వెండితెరపై నటుడుగా ఎలాంటి ‘వేషాలు’ వేసినా.. వ్యక్తిత్వంలో మెగాస్టార్ అనే బిరుదు ఆయనకు చాలా చిన్నది. ఎంతమంది తనపై అకారణంగా రాళ్లు వేసినా, వ్యక్తిగతంగా దూషించినా.. కుటుంబ సభ్యులను అనరాని మాటలు అన్నా.. తిరిగి పల్లెత్తు మాట కూడా అనకుండా కేవలం తన పనితో మాత్రమే సమాధానం చెప్పిన సిసలైన ‘‘స్థితప్రజ్ఞత ’’ చిరంజీవి సొంతం.

సినిమా రంగంలో చేసిన సేవలను గుర్తించి 2006లోనే అప్పటి ప్రభుత్వం మెగాస్టార్ ను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. అదే యేడాది ఆంధ్ర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. 2024లో ఇప్పుడు మెగా సిగలో మనదేశ రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ బిరుదునిచ్చి మరింత గౌరవాన్ని కల్పించింది భారత ప్రభుత్వం.

సినిమా నటుడుగా శిఖరమంత ఖ్యాతి ఉన్నా.. మనిషిగా ఎప్పుడూ నేలపైనే ఉంటూ.. అంతా నావాళ్లే అనుకునే అందరివాడు మెగాస్టార్.

మరోసారి కోట్లమంది హృదయ విజేతగా నిలిచిన ఈ జగదేక వీరుడుకి పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది మైక్ టివి.

- బాబురావు. కామళ్ల.

Megastar Chiranjeevi,

Padma Vibhooshan to Chiranjeevi,

Dr. Konedal Chiranjeevi,

Chiranjeevi got PadmaBhooshan in 2006

Updated : 26 Jan 2024 2:34 PM IST
Tags:    
Next Story
Share it
Top