కనకవ్వకు అనారోగ్యం.. అప్పిరెడ్డి పరామర్శ.. అండగా ఉంటామని..
X
కనకవ్వను తెలుగు పాటల ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన పల్లెటూరి పాటలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ పల్లె కోయిల ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధాప్య సమస్యలు తలెత్తడంతో చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది. నడుము నొప్పి, రక్తహీనత వంటి సమస్యలు చుట్టుముట్టినా పాటపై మమకారంతో కూనిగారాలు తీయడం మాత్రం మానలేదు. కనకవ్వ పరిస్థితి గురించి తెలుసుకున్న మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి కుటుంబసభ్యులతో కలసి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. కనకవ్వకు అండగా ఉంటామని, భయపడాల్సిన పనిలేదని హామీ ఇచ్చారు. కనకవ్వ తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడంతో అప్పిరెడ్డి దంపతులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమెకు అభయహస్తమిచ్చారు.
కనకవ్వ మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహించిన పాటల పోటీ కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’తో పరిచయమైంది. ఆమె పాడిన ‘నర్సపెల్లి గండిలోన’ వంటి అనేక జానపద పాటలు దుమ్మురేపాయి. చదువు సంధ్యల్లేని, ఒక అతి సాదాసీదా పల్లెటూరి మనిషి కనకవ్వ. ‘నర్సిపెల్లి గండిలో గంగధారి, ఆడనెమలీ ఆట చూసి గంగధారి, మగనెమలీ మోసపాయ గంగధారి’ పాటతో తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. సిద్దిపేట జిల్లా బొడిగెపల్లికి చెందిన కనకవ్వ బాల్యం నుంచే తల్లి ద్వారా పాటలు నేర్చుకున్నారు. పల్లెప్రజల కష్టసుఖాలను ఆమె పాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కూడా ఆమెపై కార్యక్రమం రూపొందించింది యూట్యూట్ మై విలేజ్ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన గంగవ్వ కూడా గవర్నర్ నుంచి అవార్డు అందుకున్నారు.