Invitation to Mohan Babu: నాకు కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది.. కానీ.. మోహన్ బాబు
X
500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరబోతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు దేశంలో సినీ, రాజకీయా, క్రీడా ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. తాజాగా తనకూ ఆహ్వానం అందిందని చెప్తున్నారు డైలాగ్ కింగ్ మోహన్‌బాబు. శనివారం నాడు ఫిలిం నగర్‌లో.. అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్టపై సమావేశం నిర్వహించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. "ఇది రాముడు పుట్టిన దేశం.. ఇది రామ జన్మ భూమి అని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. మోదీ ప్రధాని అయ్యాక భారతీయతను ప్రపంచానికి చాటి చెబుతూనే ఉన్నారు. జనవరి 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి ఊరూరా తరలి వెళ్తున్నారు. నాకు కూడా అహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాం అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. క్షమించమని ఉత్తరం రాశాను. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దైవ సన్నిధానంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అందరూ వచ్చి విజయవంతం చేయండి" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
ఇంకా ఏమన్నారంటే.. . 'ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్‌లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులున్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు(రాములవారి ప్రాణప్రతిష్ట పూర్తయ్యేవరకు) అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము' అని చెప్పుకొచ్చాడు.