Mr.Pregnant: మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ రివ్యూ..
X
తల్లి లేకపోతే జీవితమే లేదు. ప్రపంచానికి మూలాధారమైన మాతృమూర్తుల రుణం ఏమిచ్చినా తీరదు. చంద్రునికో నూలుపోగులా టాలీవుడ్ మనల్ని కన్న తల్లులకు అర్పించిన అరుదైన గౌరవ వందనమే ‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’ (Mr Pregnant movie review) మూవీ. టాలీవుడ్‌లో మాతృత్వంపై వచ్చిన టాప్ సినిమాల్లో ఇది ఒకంటంటే అతిశయోక్తి కాదు. అందరినీ కుర్చీల్లో కట్టిపడేసే మదర్ సెంటిమెంట్‌తోపాటు అద్భుతమైన కథ, ప్రేమాయణం, సంగీతం, నటన అన్నీ సమపాళ్లలో కలసిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఈ రోజు థియేర్లలో విడుదలైంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. నిర్మాతల అభిరుచికి, టాలీవుడ్ నయా ట్రెండ్‌కు అద్దం పట్టే ఈ చిత్రం మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ మెచ్చే ఫీల్ గుడ్ మూవీ. మగవాడు గర్భం దాల్చితే పరిస్థితి ఏమటని ఉత్కంఠ రేకెత్తించిన మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీలో ఏముందో చూద్దామా మరి..
భార్యకు ప్రేమతో..
కథానాయకుడు గౌతమ్ (సోహేల్) అనాథ. టూటూ ఆర్టిస్టు అయిన గౌతమ్‌ను మహి(రూపా కొడువాయుర్) ప్రేమిస్తుంది. అతడు పట్టించుకోడు. ఆమె వెనక్కి తగ్గదు. చివరికి కొన్ని షరతులతో పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లయ్యాక గౌతమ్ ఇష్టం లేకపోయినా మహి గర్భవతి అవుతుంది. దీంతో ఆమెను దూరంపెడతాడు. తర్వాత మనసు మార్చుకుని ఆమె గర్భాన్ని మోయడానికి ముందుకొస్తాడు. అతని గతం ఏమిటి? తొలుత మహిని ఎందుకు కాదన్నాడు, తర్వాత ఆమె గర్భాన్ని తను ఎందుకు మోయాలనుకున్నాడు, ఎలా మోశాడు, చివరికి ఏమైందన్నదే కథ.
ప్రసవం సక్సెస్
‘అమ్మ రాజీనామా2’, ‘మాతృదేవత’, ‘9 నెలలు’ వంటి హెవీ సెంటిమెంటల్ సినిమాకు భిన్నంగా మాతృత్వం గొప్పతనాన్ని ఆ తరం అభిరుచికి తగ్గట్లు చూపడంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ విజయం సాధించాడు. గంభీరమైన ఇతివృత్తంలో ఎక్కడ పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుంది కాబట్టి దర్శకుడు వింజనంపాటి శ్రీనివాస్ స్క్రిప్టును జనాన్ని ఆకట్టుకునేలా పకడ్బందీగా రాసుకున్నారు. నటీనటుల సత్తా, దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకుని సంగీతం, హాస్యం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేమ సన్నివేశాలు, ఉద్వేగాలకు, గర్భవతుడి కష్టనష్టాలతో మలుపులు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తుంది. తొలి అర్ధభాగం కథలోకి వెళ్లడానికి సాయపడుతుంది. దీంతో కాస్త నెమ్మదిగా అనిపించినా రెండో అర్ధభాగం ఊపుతో, నవ్వుల హోరుతో కొనసాగుతుంది. ప్రెగ్నెన్సీ కష్టాలు మగవాడికి కావడంతో వినోదానికి కొరతే లేదు. సోహెల్ అంతేసి కడుపును మోయడం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్ కామెడీ సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిచ్చే తల్లులకు పాదాభివందనం చేయాలన్నంత ఉద్వేగం కలుగుతుంది కొన్ని సన్నివేశాలను చూస్తే. మహిళలపై, గర్భధారణపై మన మనసులోని తుప్పును చక్కగా వదలగొడుతాడు మిస్టర్ ప్రెగ్నెంట్.
సోహెల్ ఎలా చేశాడు..
గౌతమ్ పాత్రంలో సోహెల్ (Syed Sohel) జీవించాడు. తన గతం, మహితో పొరపొచ్చాలు, గర్భంతో ఉన్నప్పుడు కలిగే హావభావాలను అద్భుతంగా పలికించాడు. అతని గత చిత్రాలతో పోలిస్తే పెర్ఫామన్స్‌లో పరిణతి కనిపించింది. తను చనిపోతే ఎలా అన్న సందర్భంలో అతని ఉద్వేగం మనసును కదిలిస్తుంది. మహిగా రూపా( Roopa Koduvayur) చాలా ఈజ్‌తో నటించింది. కడుపు మోసే భర్తకు భార్యగా చాలా అరుదైన పాత్రలో సత్తా చాటింది. సీనియర్ నటి సుహాసిని గురించి చెప్పాల్సిన పనిలేదు.
టెక్నికల్‌గా
మైక్ మూవీస్ బ్యానర్ చిత్రాలు సాంకేతికతలో రాజీపడవని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, నిజార్ షఫీ కెమెరా పనితనం నిర్మాణ విలువలను చాటిచెబుతున్నాయి. హే చెలి పాటతోపాటు నేపథ్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంటుంది. తొలి అర్ధభాగంలో కొంచెం దూకుడు పెంచి, స్క్రిప్టుకు మరికాస్త చక్కగా కత్తెర వేసి ఉంటే మరింత బావుండేదనిపిస్తుంది. ‘జార్జిరెడ్డి’ వంటి అరుదైన చిత్రం తీసిన నిర్మాత అన్నపరెడ్డి అప్పిరెడ్డి.. కథలోని గొప్పతనంపై నమ్మకంతో కొత్త టాలెంట్‌కు అవకాశమిస్తూ నిర్మించిన మిస్టర్ ప్రెగ్నెంట్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రం. ‘తల్లిని మించిన దైవమున్నదా’ అని మాతృత్వాన్ని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన టాలీవుడ్ నుంచి నవరసాలూ సమపాళ్లలో రంగరించి ఎదను తట్టిలేపే, అందరూ చూడాల్సిన చక్కని చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్.