'Guntur Karam' Song. : గుంటూరు కారం సాంగ్.. కుర్చీ తాతకి తమన్ ఆర్ధిక సాయం
X
కాలా పాషా.. అలియాస్ షేక్ అహ్మద్ పాషా.! పేరు ఏదైనా.. కుర్చీ తాతగా ఫేమస్ అయిన ఈ తాత.. ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు. కొద్ది రోజులు పలు మీడియా ఛానల్స్‌కు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. తాజాగా ఈ కుర్చీ తాత డైలాగ్‌తోనే.. మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారంలో ఓ సాంగ్ పెట్టారు. తాజాగా ఈ మాస్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా... ఇందులో ‘కుర్చీని మడతపెట్టి’ అంటూ సాగిన మాస్ బీట్‌కు హీరో మహేశ్ బాబు, హీరోయిన్ శ్రీలీల ఊరమాస్ స్టెప్‍లతో అదరగొట్టారు. డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. గుంటూరు కారం సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణలా కనిపిస్తోంది. అయితే, ఈ సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి పెద్ద చర్చే సాగుతోంది. బూతు పదం వల్ల వైరల్ అయిన డైలాగ్‍తో పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో పెట్టడం ఏంటనే వాదనలు వినిపిస్తున్నారు. మహేశ్ స్థాయికి ఈ సాంగ్ కరెక్ట్ కాదని అంటున్నారు.
ఇదే టైంలో పాట ఓనర్ కుర్చీ తాత గురించి, పాట కోసం అతడికిచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. దీనిపై తాజాగా, స్పందించిన కాలా పాషా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘మహేశ్ లాంటి స్టార్ హీరో సినిమాలో నా డైలాగ్‌ను పాటగా వాడుకోవడం సంతోషంగా ఉంది. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఈ పాటలో ఒక్క స్టెప్ అయినా వేయాలని ఉంది. కుర్చీ డైలాగ్ ను సినిమాలో వాడుకున్నామని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాతో ముందే చెప్పారు. అంతేకాక ఆర్థిక సాయం కూడా చేశారు’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే కుర్చీ తాతకు తమన్ ఐదు వేల రూపాయలు ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం కాలా పాషా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.