Home > సినిమా > Naa Saami Ranga Trailer : కిష్టయ్యని ఎయ్యాలంటే సావుకు ఎదురెళ్లాలి

Naa Saami Ranga Trailer : కిష్టయ్యని ఎయ్యాలంటే సావుకు ఎదురెళ్లాలి

Naa Saami Ranga Trailer : కిష్టయ్యని ఎయ్యాలంటే సావుకు ఎదురెళ్లాలి
X

అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా ట్రైలర్ విడుదలైంది. విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. సంక్రాంతి బరిలో ఈ నెల 14న విడుదల కాబోతోందీ సినిమా. నాగార్జున సరసన అషికా రంగనాథ్ హీరోయిన్ గా నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముందు నుంచీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నా సామిరంగా పొరింజు మరియం జోస్ అనే మళయాల సినిమాకు రీమేక్. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశాం అని చెప్పారు.

ఇక ట్రైలర్ చూస్తే ఇది 1990ల కాలంలో సాగే కథలా కనిపిస్తోంది. ఆ కాలంలో గోదావరి జిల్లాల్లోని సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రభల నేపథ్యంలో సాగే కథ అని అర్థం అవుతుంది. ఆ ఊరిలో క్రిష్టయ్య అనే పేరుతో అందరికీ తలలో నాలుకలా కనిపించే పాత్రలో నాగార్జున నటించాడు. అతని స్నేహితులుగా నరేష్, రాజ్ తరుణ్ కనిపిస్తున్నారు. ఊరి పెద్ద పాత్రలో నాజర్ ఉన్నాడు. ఇక పూర్తి గ్రామీణ నేపథ్యంలో కనిపిస్తోన్న ఈ ట్రైలర్ చూస్తుంటే ఒకప్పుడు నాగ్ చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్లాం తరహా సినిమాలు గుర్తొచ్చేలా ఉన్నాయి. ఊర్లలో ఉండే సరదాలు, సరసాలు, అచ్చమైన ప్రేమలూ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఇక అషికా రంగనాథ్ వరాలు అనే పాత్రలో కనిపిస్తోంది. ఆమెను ప్రేమించినా పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఈ ఇద్దరూ ఉంటారనేలా ఉంది.

‘పాతికేళ్ల క్రితం ప్రభలు ఎల్లకపోతే వరదలు వచ్చాయని.. మా ఊళ్లో ఇప్పటికీ చెప్పుకుంటారు.. ఈ సారి క్రిష్టయ్య వచ్చాడని మీ ఊళ్లో చెప్పుకుంటారు..’ అనే డైలాగ్ చూస్తే.. పాతికేళ్ల తర్వాత ఆ ఊరిలో ప్రభలు వెళ్లేలా చేసే మొనగాడుగా నాగ్ కనిపిస్తాడని చెప్పొచ్చు. ఇక విలన్ గా షబీర్ కళ్లారక్కల్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నట్టున్నాడు. ఇతను ఇంతకు ముందు సార్పట్టై పరంపర అనే తమిళ్ మూవీలో డ్యాన్సింగ్ రోజ్ పాత్రతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. మొత్తంగా ఇది సంక్రాంతి పండగ నేపథ్యంలోనే సాగే సినిమాగా కనిపిస్తోంది. అందుకే సంక్రాంతి టైమ్ కు పర్ఫెక్ట్ ఛాయిస్ లా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చే మూవీలానూ కనిపిస్తోంది. మరి ఈ సంక్రాంతికి నాగ్ ఫ్యాన్స్ అంతా నా సామిరంగా అనుకుంటారా లేదా అనేది చూడాలి.


Updated : 9 Jan 2024 5:04 PM IST
Tags:    
Next Story
Share it
Top