Narakasura Movie Review : నరకాసుర రివ్యూ
X
రివ్యూ : నరకాసుర
తారాగణం : రక్షిత్ అట్లూరి, అపర్ణా జనార్ధన్, సంగీర్తన విపిన్, నాజర్, చరణ్ రాజ్, శతృ, శ్రీ మాన్ తదితరులు..
ఎడిటర్ : సిహెచ్. వంశీకృష్ణ
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
సంగీతం : నాఫాల్ రాజా
నిర్మాతలు : డాక్టర్ శ్రీనివాస్, కరుమురు రఘు
రచన, దర్శకత్వం : సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్(సెబి. జూ)
ఏ నటుడికైనా కెరీర్ ఆరంభంలోనే బెస్ట్ మూవీ పడితే అతనికంటూ సెపరేట్ ఇమేజ్ స్టార్ట్ అవుతుంది. అలా పలాస 1978 అనే చిత్రంతో ఆకట్టుకున్న రక్షిత్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ కు కారణం నరకాసుర అనే సినిమా. ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో మూడేళ్లు ఆలస్యం అయినా నరకాసురకోసం ఎదురుచూశాడు. సెబాస్టియన్ అనే దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ వారం చిత్రాల్లో నరకాసురపై కాస్త అంచనాలున్నాయి. మరి ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..
కథ :
ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్స్ లో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు శివ(రక్షిత్) అతన్ని చిన్నతనం నుంచి మరదలు వీరమణి(సంగీర్తన విపిన్) ప్రేమిస్తుంది. అతని కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంది. కానీ శివ ఎస్టేట్ ఓనర్ అయిన మీనాక్షి(అపర్ణా జనార్ధన్)ని ప్రేమిస్తాడు. అతని మంచితనం చూసి మీనాక్షి కూడా ప్రేమలో పడుతుంది. పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగానూ కలుస్తారు. ఇక ఆ ప్రాంత ఎమ్మెల్యే వీరి నాయుడు(చరణ్ రాజ్)కు శివ అంటే కొడుకుతో సమానం. అతనికి ఓ కొడుకు ఉంటాడు. అతనికి మీనాక్షి అంటే ఇష్టం. కానీ ఎమ్మెల్యే దగ్గరుండి శివ, మీనాక్షి పెళ్లి జరిపిస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత శివ కనిపించకుండా పోతాడు. మరోవైపు మీనాక్షి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఆమెను ప్రాణాలకు తెగించి మరీ కొందరు అర్థనారీశ్వరు(హిజ్రాలు)లు కాపాడతారు. మరి దీని వెనక ఎవరున్నారు. శివ ఏమయ్యాడు. శివ కుటుంబం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన వాళ్లెవరు.. వారికి శివకు ఉన్న సంబంధం ఏంటీ..? వీరమణి ఏమైంది.. అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
నరకాసుర.. ఈ టైటిల్ వినగానే చాలామంది రాక్షస సంహారానికి సంబంధించిన కథ అనుకున్నారు. అలాగే ఉన్నా.. దర్శకుడు ఎంచుకున్న కోణం వేరే. ప్రతి మనిషినీ జెండర్ తో సంబంధం లేకుండా గౌరవించాలనే సందేశాన్ని మిళితం చేసి ఈ కథ రాసుకున్నాడు. ఇందుకోసం ఎంచుకున్న నేపథ్యం అందంగా ఉంది. కానీ కథనం మాత్రం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మొదటి అరగంట ఏం జరుగుతుందా అనేది కామన్ ఆడియన్స్ కు అర్థం కావడం కష్టమే. కానీ ప్రతి సన్నివేశం ఎంగేజింగ్ గా ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు సెబాస్టియన్. ఇది అతని ఫస్ట్ మూవీ. ఆ మొదటి సినిమా తాలూకూ తడబాట్లు చాలాచోట్లనే కనిపిస్తాయి. చిన్నతనం నుంచీ ఇష్టపడుతున్న మరదలిని వద్దు అనుకోవడానికి కథానాయకుడి కోణం నుంచి సరైన కారణం చూపించలేదు. అలాగే తను ‘ఇష్ట’పడ్డ అమ్మాయి విషయంలోనూ ఆ క్లారిటీ మిస్ అవుతుంది. కథాకాలం ఖచ్చితంగా చెప్పలేదు. కానీ సెల్ ఫోన్స్ లేని టైమ్ ఇది. అందువల్ల ఆ కాలంలో అలా ఇష్టపడగానే ఇలా బెడ్రూమ్ కే ఆహ్వానించే అమ్మాయిలు ఉన్నారా.. అదీ చాలా పద్ధతిగా కనిపించే అమ్మాయి అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఆ సన్నివేశం గురించి అమ్మాయి చెబుతున్నప్పుడు ఫన్నీగానే ఉంటూనే కాస్త ఓవర్ అయినట్టూ అనిపిస్తుంది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కేరళ వెళ్లడం అక్కడ హిజ్రాలతో గొడవ, వారితో సఖ్యత.. ఈ సీన్స్ బావున్నాయి. మార్పు నా నుంచే మొదలు కావాలని.. సిగ్నల్స్ దగ్గర అడుక్కునే కొందరు హిజ్రాలను తను పనిచేసే ఎస్టేట్ లోనే పనికి పెట్టడం అన్నీ బావున్నాయి. మొదటి సగంలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నా శివ పెళ్లి తర్వాత కొన్ని హత్యలు బయటపడటం.. అవన్నీ ఎమ్మెల్యే కోసం చేసినట్టుగా ఉండటం అనే పాయింట్స్ కొత్తగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. తను నడిచే దారిని శివ ఏర్పాటు చేశాడని తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఒక్క విషయంలో భయపడుతుంటాడు. అదేంటనేది సులువుగానే అర్థం అవుతుంది. పెళ్లైన మహిళపై మనసు పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలో అలాగే చేయడం, హిజ్రాలు అని తక్కువగా చూడొద్దని, అవకాశం ఇస్తే వారూ అందరితో సమానంగా ఉంటారని చెప్పడం.. ఊరి కోసం ఎంత దూరమైన వెళ్లే ఒక దేవుడు లాంటి మంచివాడు.. సమస్య ఊరి వరకూ వస్తే రాక్షసుడిలానూ మారేందుకు వెనకాడని వైనాన్ని చెప్పాడు. ప్రెజెంట్, పాస్ట్ అంటూ కొన్ని చోట్ల కనిపించే స్క్రీన్ ప్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజింగ్ గా ఉన్నా.. సెకండ్ హాఫ్ సాఫీగా సాగుతుంది. ఊహించినట్టుగానే ఉన్నా.. కాస్త కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇందుకోసం హిజ్రాల కోణంలో సాగే యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ హిజ్రాలు అంటే కాస్త ఆడతనం కలిసిన సున్నితస్కులుగానే చూసిన వారికి ఈ మూవీలో మాత్రం కండలు తిరిగిన పహిల్వాన్స్ లా ఉండటం పెద్ద లోపంగా కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఫైట్, దానికి ముందుకు వచ్చే వీరమణి ఎపిసోడ్ మరీ కొత్తవేం కాదు. కానీ ఓకే అనిపిస్తాయి.
నటన పరంగా రక్షిత్ మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతని గెటప్ వల్ల సగం మొహం కనిపించకుండా పోయింది. అతని పేరు శివ కాబట్టి.. ఆ శివుడులానే జుత్తు ఉండాలనుకోవడం సరైన ఆలోచన అనిపించదు. హీరోయిన్లిద్దరూ చాలా సహజంగా కనిపించారు.. నటించారు. హిజ్రాల లీడర్ గా శతృ కు మరో వైవిధ్యమైన పాత్ర. చరణ్ రాజ్ కు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పడింది. నాజర్, శ్రీమాన్ పాత్రలు, నటన ఓకే. ఇతర పాత్రధారులంతా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ గా చూస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం సాంకేతిక నిపుణులే. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ ఉంటే, నాఫాల్ రాజా పాటలు, నేపథ్యం సంగీతం అద్భుతంగా కుదిరింది. సాధారణ సన్నివేశాలను కూడా తన ఆర్ఆర్ తో నెక్ట్స్ లెవల్ అనిపించాడు నాఫాల్. ఎడిటింగ్ బానే ఉంది. డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. కాస్ట్యూమ్స్ ఓకే. యాక్షన్ సీన్స్ సింప్లీ సూపర్బ్. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడు సెబాస్టియన్ కు ఫస్ట్ మూవీ అయినా అతనికి ప్రతి క్రాఫ్ట్ పై సమగ్రమైన అవగాహన ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంచుకున్న కథ బావుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఒక మంచి సినిమానే అందించే ప్రయత్నం చేశాడు. దీనికి కాస్త సందేశం కూడా తోడవడంతో హ్యాపీ ఎండింగ్ అనిపించుకుంది.
ప్లస్ పాయింట్స్ :
సంగీతం
సినిమాటోగ్రఫీ
ఫైట్స్
కథ
హీరోయిన్లు, రక్షిత్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
కథనం
హిజ్రాల ఎపిసోడ్స్
ఫైనల్ గా : ప్రతి మనిషినీ గౌరవిస్తూ.. అందరం బావుండాలని చెప్పిన నరకాసుర
రేటింగ్ : 2.75/5
- బాబురావు. కామళ్ల