సనాతన వాదులకు సవాల్ విసిరిన నయనతార
X
మనోభావాలు.. ఇవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ను ఎవరైనా హర్ట్ చేస్తే రియాక్ట్ అవడం కామన్. అయితే మనోభావాలు కాస్తా మన దేశంలో కొన్నాళ్లుగా మతో భావాలుగా మారాయి. మతపరంగా ఏ చిన్న కంటెంట్ దొరికినా దేశవ్యాప్తంగా పాపులర్ చేసేస్తున్నారు. ఒక్కోసారి ఆ మత్తులో హత్యలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి వారికి సినిమా వాళ్లు ఈజీ టార్గెట్ అవుతారు. అవసరమైతే థియేటర్స్ వద్దకు వెళ్లి మరీ నిరసనలు చేస్తారు. అందుకే మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా.. నయనతార కొత్త సినిమా మరోసారి మతోభావాలకు పనిపెట్టేలా ఉంది. లేటెస్ట్ గా విడుదల చేసిన ఓ మూవీ టీజర్ చూస్తే .. ఈ సినిమాకు సనాతన వాదుల నుంచి షాకులు తప్పవు అనేలా ఉంది..
మతోభావాలు దెబ్బతింటే మూక దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామందికి అర్థమైంది. ఈ విషయంలో సినిమా వాళ్లే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న డైలాగులు ఉంటేనే దాడులు చేస్తోన్న రోజులు ఇవి. ఇంతకు ముందు కూడా నయనతార నటించిన మూకుత్తి అమ్మన్ అనే సినిమా విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. కానీ బలమైన కథనం, పదునైన డైలాగులు ఉండటంతో ఆ కొందరు ఎక్కువగా రియాక్ట్ కాలేకపోయారు. అయినా నయనతారపై కామెంట్స్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఈ సారి తప్పించుకోవడం కష్టం అనేలా ఏకంగా సనాతన వాదులనే కెలికారు. తాజాగా వచ్చిన టీజర్ చూస్తే అదే కనిపిస్తోంది. ఈ సినిమా పేరు అన్నపూర్ణ. ద గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ టీజర్ లో నయనతార ఇంటి వాతావరణం చూస్తే పూర్తిగా సనాతన సంప్రదాయాలను స్ట్రిక్ట్ గా పాటించే కుటుంబం. ఆమె కుటుంబ పెద్దలు అర్చక వృత్తిలో ఉన్నట్టుగా చూపించారు. మరోవైపు నయన్ చాలా శ్రద్ధగా ‘బిజినెస్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. ఇటు ఆమె బామ్మ జపమాలతో మంత్రాలు జపించుకుంటూ కనిపిస్తుంది. కట్ చేస్తే ఆ పుస్తకంలో తను చికెన్ లెగ్ పీస్ లు, మటన్ కర్రీ, మద్యం ఉన్న ఫోటోస్ చూస్తూ లొట్టలు వేస్తూ ఉంటుంది. అంటే ఆ కుటుంబ పద్ధతులకు పూర్తి భిన్నమైన వ్యవహారం ఇది. ఒక రకంగా వారి సనాతన ధర్మాన్ని అవమానించినట్టుగానే దీన్ని కొందరు చూస్తున్నారు. అలాగని టీజర్ కే ఇదై పోయి గొంతులు చించుకోవడం కంటే.. సినిమా చూస్తే నయనతార అలా ఎందుకు నాన్ వెజ్ ను లొట్టలు వేస్తూ చూస్తుంది అనేది అర్థం కాదు.
ఇక నయన్ తో పాటు జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కేఎస్ రవికుమార్ లు కీలక పాత్రలు చేస్తోన్న ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. థమన్ సంగీతం చేస్తున్నాడు. ఏ మాటకామాటే.. థమన్ నేపథ్య సంగీతం ఈ టీజర్ లో బలే ఉంది. మరి ఈ టీజర్ ను ఇలాగే చేస్తారా.. మా మనో భావాలు దెబ్బతిన్నాయని గోల మొదలుపెడతారా అనేది చూడాలి.