'స్పై' స్ లేని కథనం..నిఖిల్ సినిమా ఎలా ఉందంటే..?
X
కార్తికేయ2తో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు నిఖిల్. నార్త్ టు సౌత్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కార్తికేయ2 బాగా కనెక్ట్ అయింది. దీంతో అదే ఇమేజ్‌కి తగ్గట్లుగా తన నెక్స్ట్ ప్రాజెక్టులను ఎన్నుకున్నాడు నిఖిల్. అందులో భాగంగానే గూఢచారి కథ స్పైతో మారోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటనే కాన్సెప్ట్‌తో స్పై చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్ గ్యారీ బీహెచ్ . శుక్రవారం పాన్ ఇండియన్ స్థాయిలో స్పై సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? నిఖిల్ మరోసారి హిట్ కొట్టాడా? కథ, కథనం బాగుందా? నేతాజీ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం.
స్టోరీ ఏమిటంటే :
'స్పై'లో నిఖిల్ ఓ రా ఏజెంట్. శ్రీలంకలో పనిచేస్తుంటాడు. తన సోదరుడు బోస్ కూడా ఓ రా ఏంజెటే. కానీ ఓ ఆపరేషన్‌లో బోస్ చనిపోతాడు. ఈ క్రమంలో ఉగ్రవాది అబ్దుల్ ఖాదిర్‌ను పట్టుకునే బాధ్యతను నిఖిల్‌కి అప్పగిస్తారు. ఆ తరువాత అందరూ ఉగ్రవాది చనిపోయాడని భావిస్తారు. కానీ అతడి వెనకాల ఓ పెద్ద హ్యాండ్ ఉందని నిఖిల్ అండ్ టీమ్ గుర్తిస్తుంది. అతడిని పట్టుకోవడంతో పాటు భారత్‌పై దాడి చేసేందుకు అతను తయారు చేసిన మిసైల్‌ని నిర్వీర్యం చేసే బాధ్యత కూడా నిఖిల్ అండ్ టీమ్‌పై పడుతుంది. మరి మిషన్‌తో రంగంలోకి దిగిన నిఖిల్ అబ్దుల్‌ను పట్టుకుంటాడా? లేక ఆ ఉగ్రవాది చనిపోయాడా? తన అన్నను చంపిన వారిని నిఖిల్ ఎలపట్టుకుంటాడా? ఈ మిషన్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ వెనకున్న సీక్రెట్కీ సంబంధం ఏమిటనేది మిగతా స్టోరీ.
సినిమా ఎలా ఉందంటే :
కార్తికేయ2 హిట్ తరువాత వచ్చిన సినిమా కావడంతో స్పై పైన భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఓ సీక్రెట్ స్టోరీతో రూపొందించిన చిత్రంగా స్పై ప్రచారమైంది. నేతాజీ ఎపిసోడ్ ఉంటుందని చెప్పడంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. కానీ సినిమా మాత్రం ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, దేశభక్తితో తీసిన ఇలాంటి గూఢచారి కథలకి కథనం ప్రాణం. ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. భావోద్వేగాలు బలంగా ఉంటేనే బాక్సాఫీస్‌లో హిట్ బొమ్మగా నిలుస్తుంది. ఇవన్నీ లేకుండా కేవలం కథ మాత్రమే ఉండి ఎన్ని దేశాలు చుట్టొచ్చినా వృథానే. అదే విషయాన్నిస్పై మరోసారి నిరూపించింది. దేశానికి ముప్పుగా మారిన ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టేందుకు ఓ మిషన్, అందులో హీరో.. ఇలా చాలా సినిమాల్లో చూసినట్టే ఓ ఫార్ములాతో ఫస్ట్ పార్ట్ మొత్తం సాగిపోతుంది. అంతేకానీ ఎక్కడా కూడా ఆసక్తి రేకెత్తించే స్పెషల్ ఎలిమెంట్స్ లేవు. రెండవ భాగంలో ఏదైనా మ్యాజిక్ చేస్తారనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది.
ఆకట్టుకోని నేతాజీ ఎపిసోడ్ :
ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైల్ చుట్టూ సాగే కొన్ని సన్నివేశాలను రెండో భాగంలో చూపించాడు డైరెక్టర్ . ఆయన పోరాట స్ఫూర్తి నేపథ్యం తప్ప మరో అంశం ఆకట్టుకోలేకపోయింది. ద్వితీయార్ధంలో కొత్త విలన్ ఇంట్రడ్యూజ్ అవుతాడు. రెండు దేశాల మధ్య యుద్ధం, పోరాట ఘట్టాలు చాలానే ఉన్నాయి. తెరమీద హంగామా కనిపించినా ఎక్కడా కూడా ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలు ఉండవు. ప్రధానంగా రచన, దర్శకత్వంలోనే లోపాలు కనిపిస్తున్నాయి.
ఎవరు ఎలా చేశారు :
నిఖిల్ ఈ సినిమాలో కొత్తగా ఏమీ కనిపించలేదు. గెటప్, యాక్టింగ్‌లోనూ మార్పులేమీ కనిపించవు. ఫైట్ సీన్స్ కోసమైతే నిఖిల్ బాగానే కష్టపడ్డాడు. అభినవ్ గోమటం తన సంభాషణలతో అక్కడక్కడా నవ్వించాడు. హీరోయిన్స్ ఐశ్వర్య మేనన్, సానియా వారి అందంతోనూ, నటనతో ఆకట్టుకున్నారు. ఆర్యన్ రాజేశ్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సచిన్ ఖేడేకర్ వారి వారి పాత్రలు సినిమాలో ఎలాంటి ప్రభావం పెద్దగా చూపించవు . రా అధికారిగా నటించిన మకరంద్ దేశ్‌పాండే యాక్టింగ్‌లో నాచురాలిటీ కనిపించదు. విలన్ పాత్రల్లోనూ పెద్దగా బలం లేదు. రానా అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. టెక్నికల్ విభాగాల్లో కెమెరా, మ్యూజిక్ మాత్రం కాస్త ప్రభావం చూపించాయి. దర్శకుడిగా గ్యారీ పనితనం అంతంత మాత్రమే అయినా ఎడిటర్‌గా ఈ సినిమాని బాగా మలిచారు.