'అలా చేయాలని కాదు'.. ప్రభాస్ విగ్రహంపై మ్యూజియం నిర్వాహకులు
X
మైసూర్‌లోని చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన బాహుబలి (baahubali) ప్రభాస్ మైనపు విగ్రహం.. తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఈ విగ్రహాన్ని మ్యూజియంలో ఉంచారట. అయితే ఇటీవల ఓ పర్యాటకుడు దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. విగ్రహాన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్, నెటిజన్లు మండిపడ్డారు. బాహుబలి సినిమాలో ప్రభాస్‌గా ఉన్నట్లుగా మైనపు బొమ్మలేదని కామెంట్స్ చేశారు. షేరింగులు, కామెంట్లతో ఈ ఫోటో బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ వరకూ చేరింది. ఈ మైనపు విగ్రహాన్ని చూసి విసిగిపోయిన ఆయన.. మ్యూజియంలో ఉన్న ఆ బొమ్మకు అసలు బాహుబలి పొలికలులేవని, ఆ బొమ్మ ప్రభాస్ లా (prabhas) కనిపించడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ విగ్రహాన్ని తమ దృష్టికి తీసుకురాకుండా ఏర్పాటు చేశారని.. దీనిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సదరు మ్యూజియం నిర్వాహకులు స్పందించారు.
శోభు యార్లగడ్డ చేసిన ట్వీట్ పై రిట్వీట్ చేస్తూ.. "ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా చేయలేదు.. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి.. మ్యూజియం నుంచి విగ్రహాన్ని తొలగిస్తాం” అని వారు తెలిపారు. దీంతో ఈ ట్రోలింగ్ పుల్ స్టాప్ పడినట్టే అని తెలుస్తుంది. ఇకపోతే అమరేంద్ర బాహుబలి విగ్రహం మ్యూజియంలో ఏర్పాటు చేయాలంటే ముందుగా నిర్మాతల అనుమతి తీసుకోవాలి. అలాగే విగ్రహం తయారైన తర్వాత నిర్మాతలకు చూపించి వారు ఓకే అంటేనే దాన్ని మ్యూజియంలో ఆవిష్కరించాలి.
మొత్తానికైతే.. ప్రభాస్ విగ్రహంపై నెట్టింట వస్తున్న ట్రోల్స్‌కు బ్రేక్ పడింది. దీనిపై ప్రభాస్ అభిమానులు కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ప్రభాస్ రూపంలో లేదని అంటున్నారు. ఇక ‘బాహుబలి’లో ప్రభాస్ అద్భుతమైన నటనకు ఆయన మైనపు విగ్రహాన్ని అధికారికంగా మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.