హరిహర వీరమల్లు ఆగిపోయిందా.. నిర్మాత క్లారిటీ ఇదీ
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు. రెండు విడతల యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తను సినిమాలు చేస్తే రోజుకు రూ. 2 కోట్లు సంపాదిస్తానని, ప్రజలకు మేలు చేయాలనే సినిమాలు తగ్గించుకున్నానని చెప్పారు. మరోపక్క.. పవన్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు ఆయన రాజకీయాల వల్ల డేట్స్ సర్దుబాటు కాక ప్రాజెక్టులు వాయిదాపడుతున్నాయి.
వాటిలో అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మూడేళ్ల కిందట మొదలైన సినిమా షూటింగ్ 60 శాతం వరకు పూర్తయింది. పవర్ స్టార్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో చిత్రాలు ఉన్నాయి. ఒకపక్క రాజకీయ యాత్రలు, మరో ఇన్ని ప్రాజెక్టుల నడమ ఆయన సతమతం అవుతున్నారు. పీరియాడికల్ థీమ్‌తో తీస్తున్న హరిహర వీరమల్లు త్వరగా విడుదలైతే బావుంటుందని అభిమానులు ఎదురుచూస్తుండగా ఆ ప్రాజెక్టు అటెక్కిందని వార్తలు వచ్చాయి. వాటిపై నిర్మాత ఏం రత్నం తాజాగా ఓ ఇంటర్వూల్యో వివరణ ఇచ్చారు. ‘‘ఈ మూవీ ఆగిపోలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలను బట్టి ఆధారపడి ఉంది. ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాదే జరిగితే వచ్చే నెల నుంచి షూటింగ్ తిరిగా ప్రారంభిస్తాం. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికలు పూర్తయ్యాక మొదలు పెడతాం. పవన్ మాకు సహకరిస్తున్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. మేం ఆయనను అర్థం చేసుకోగలం. సినిమా బడ్జెట్ మేం ఊహించినదానికంటే కొంత పెరిగింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ కథానాయిక కాగా, ఐటమ్ బాంబ్ నోరా ఫతేహీతోపాటు బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు.