ఎమ్మెల్యే, ఎంపీ.. ఏ ఎన్నికలైనా ఈజీగా గెలుస్తా : దిల్ రాజు
X
తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. రేపు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్, సీ. కళ్యాణ్ ప్యానెల్ పోటీ పడుతుంది. దీంతో ఇరువర్గాలు పోటా పోటీ ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయాల్లో ఎంట్రీపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదని దిల్ రాజు అన్నారు. ‘‘ నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీ, ఎమ్మెల్యేగా ఈజీగా గెలుస్తా. అయితే నా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం సినీ ఇండస్ట్రీకే. దాని తర్వాతే రాజకీయాలు. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం’’ అని అన్నారు. ఇండస్ట్రీలో సీనియర్లు ముందుకు రాకపోవడంతోనే తాను ప్రెసిడెంట్ పోటీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. తాను గెలిస్తే ఫిలిం ఛాంబర్ సమస్యలను పరిష్కరించి.. దానిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో 1600 మంది సభ్యులు ఉన్నా.. రెగ్యులర్ గా సినిమాలు చేసేవాళ్లు మాత్రం 200మంది మాత్రమే అని దిల్ రాజు చెప్పారు. ‘‘ఫిలిం ఛాంబర్ బైలాస్లో కొన్ని మార్పులు చేయాలి. ఛాంబర్లో సరైన వ్యక్తులు ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతోంది. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఏది మంచో.. ఏది చెడో బాగా తెలుసు. నేను గెలిస్తే కిరీటాలు పెట్టరు. ఇంకా సమస్యలు పెరుగుతాయి. అయినా ముందడుగు వేసి బరిలో నిలిచా’’ అని చెప్పారు.