దారికి తెచ్చుకునేందుకే యువతి ఫొటోలు తీసి బ్లాక్ మేల్ చేశా: పుష్ప జగదీశ్
X
పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటించిన బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ యువతిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని ఫిర్యాదు రావడంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు విచారణలో జగదీశ్ కీలక విషయాలు బయటపెట్టాడు. గతంలో తనతో ప్రేమలో ఉన్న యువతి.. తర్వాత వేరే వ్యక్తికి దగ్గరవడం భరించలేక.. మళ్లీ తనను తిరిగి దారికి తెచ్చుకునేందుకు వాళ్ల ఫొటోలు తీసి భయపెట్టానని జగదీశ్ చెప్పుకొచ్చాడు.
ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ గత నెల 27న తనకు తెలిసిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు జగదీశ్ దొంగచాటుగా వీడియో తీశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆమె జగదీశ్‌కు ఇదివరకు పరిచయం ఉండడంతో ఏవో గొడవలు తలెత్తాయి. జగదీశ్ దురుద్దేశంలో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డంతో ఆమె గత నెల 29న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగదీశ్ అప్పట్నుంచి పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్‌కు పంపింది. అనంతరం కస్టడీలోకి తీసుకొని విచారించగా.. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. రెండు రోజుల కస్టడీ ముగియటంతో తిరిగి రిమాండుకు తరలించారు.