అయోధ్య మహోత్సవం.. రామ్ చరణ్ కు ఆహ్వానం
X
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం యావత్ భారతావని ఎదురు చూస్తోంది. జనవరి 22న జరగనున్న ఈ మహోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు హాజరవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరుకానున్నారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్, ధనుష్, రణబీర్ దంపతులు సహా పలువురికి ఆహ్వానాలు అందాయి. తాజాగా మరో టాలీవుడ్ స్టార్కు అయోధ్య ఆహ్వానం అందింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు అయోధ్య ఆహ్వానం వచ్చింది. ఆర్ఎస్ఎస్ నేత సునీత్ అంబేద్కర్ రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. మొన్న తండ్రికి, ఇవాళ తనయుడికి ఆహ్వానం అందడం గమనార్హం. కాగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఆయన ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తున్నారు. 11 రోజుల పాటు ప్రత్యేక ఆరాధన చేయనున్నారు. దీనికి సంబంధించి మోదీ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. రాముని ప్రాణప్రతిష్ఠను కనులారా వీక్షించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ప్రపంచంలో ఉన్న రామ భక్తులందరికీ ప్రవిత్రమైన సందర్భమని చెప్పారు.