Telangana assembly elections: డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి... ఓటు మాత్రం..: ఆర్జీవీ
X
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా హైలైట్ అయ్యారని చెప్పవచ్చు. తరచూ ఎవరో ఒకరిపై కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేయడం ఆర్జీవికి అలవాటే. ప్రస్తుతం ఆయన సినిమాలకంటే కూడా రాజకీయాలపైనే తనదైన శైలిలో స్పందిస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తూ.. పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ అర్టిస్ట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. కార్టూన్ల ద్వారా ఓటర్లను చైతన్య పరిచేందుకు కార్టూనిస్టులంతా వివిధ రూపాల్లో కార్టూన్లు వేసి సోమాజిగూడ ప్రెస్క్లబ్ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంగోపాల్ వర్మ.. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన 'ఆర్ట్ ఫర్ డెమోక్రసీ' వాల్ పోస్టర్ ను వర్మ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ... ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరు డబ్బులిచ్చినా తీసుకొండి... కానీ ఓటుమాత్రం మంచి చేస్తాడని నమ్మేవారికే వేయాలని ప్రజలకు రాంగోపాల్ వర్మ సూచించారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన కలిగి, ప్రజా సమస్యలు తెలిసినవారికి ఓటేసి గెలిపించుకోవాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. నియోజకవర్గం అభివృద్ది, ప్రజలకు మౌళిక వసతులు కల్పించే నాయకులకు గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే వుందన్నారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోను తాను చూడలేదని... కాబట్టి వాటిగురించి మాట్లాడబోనని అన్నారు. ఈ మేనిఫెస్టోను రూపొందించడం, అమలుచేయడం ఎలాగో తెలిస్తే దానిపై స్పందించడం ఎందుకు... తానే రాజకీయ నాయకుడిగా మారేపోయేవాడినని రాంగోపాల్ వర్మ అన్నారు.