Sankranthi Special 2024: ఈ సంక్రాంతికి సిక్సర్ గ్యారెంటీ
X
సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాకు ది బెస్ట్ సీజన్. సమ్మర్ కంటే కూడా ఎక్కువగా సంక్రాంతికి ప్రాధాన్యం ఇస్తారు మేకర్స్. ఆ టైమ్ లో వచ్చే సినిమాలు యావరేజ్ గా ఉన్నా.. హిట్ అయిపోతాయి. అందుకే స్టార్ హీరోలంతా సంక్రాంతి వేదికగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో 2024 సంక్రాంతి కోసం చాలా ముందుగానే రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుని బరిలోకి దిగుతున్నారు. ఒకటీ రెండు సినిమాలు మాత్రం సడెన్ గా సంక్రాంతికి వస్తున్నాయి. ముందు అనుకున్నవి మధ్యలో యాడ్ అయినవి తాజాగా అనౌన్స్ అయినవీ కలిపితే ఇప్పటి వరకూ ఏకంగా ఆరు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. వీటిలో ఒకటి డబ్బింగ్ మూవీ.
సంక్రాంతి బరిలో ముందు నుంచీ వినిపించిన సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీ నిజానికి గత సంక్రాంతికే రావాల్సి ఉంది. రకరకాల కారణాలతో వాయిదా పడి 2024 సంక్రాంతికి షెడ్యూల్ అయింది. అయితే ఈ సారి కూడా గ్యారెంటీ లేదు అనే టాక్ ఉన్నా.. ఖచ్చితంగా విడుదలవుతుందని నిర్మాత నాగవంశీ చెప్పాడు. కాకపోతే డేట్ చెప్పాల్సి ఉంది.
సంక్రాంతి సీజన్ ను పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసుకోవడం ఎలాగో తెలిసిన నిర్మాత దిల్ రాజు ఈ సారి కూడా బరిలో నిలుస్తున్నాడు. దర్శకుడు పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో ఫ్యామిలీ మేన్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ నెల 19న ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. అదే రోజు మూవీ రిలీజ్ డేట్ కూడా చెబుతారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా గీత గోవిందం తరహాలోనే పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందట.
ఇక సంక్రాంతికే రిలీజ్ అని పక్కాగా ఫిక్స్ అయిన సినిమా ఈగిల్. రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీకి పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఇక అనూహ్యంగా ఈ రేస్ లోకి ఎంటర్ అయ్యాడు నాగార్జున. ఆయన సినిమా నా సామిరంగా ప్రారంభం అయిన రోజునే సంక్రాంతి విడుదల అని చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇంత తక్కువ టైమ్ లో పూర్తి చేసి రిలీజ్ చేయడం సాహసం అనుకున్నారు. బట్ ఆ సాహసం చేయడానికే సిద్ధమయ్యాడు నాగ్. పొరింజు మరియం జోష్ అనే మళయాల మూవీ రీమేక్ గా రూపొందుతోన్న నా సామిరంగా నాగ్ కు 99వ సినిమా కావడం విశేషం. విజయ్ బిన్ని ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఈ లీగ్ లోకి ఊహించని విధంగా రావాల్సిన వచ్చిన హీరో వెంకటేష్. ఆయన నటించిన సైంధవ్ చిత్రాన్ని డిసెంబర్ 23న విడుదల చేయాలనుకున్నారు. బట్ 22న సలార్ డేట్ వేయడంతో తప్పక వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఆల్రెడీ టఫ్ కాంపిటీషన్ ఉన్నా సంక్రాంతినే ఎంచుకున్నాడు వెంకీ. వెంకటేష్ కు ఇది 75వ సినిమా. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. సైంధవ్ ను జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా ప్రకటించారు.
ఇక తెలుగుతో పాటు తమిళ్ నుంచి రజినీకాంత్ కూడా సంక్రాంతి రేస్ లో ఉన్నాడు. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తారంటున్నారు.ఆల్రెడీ తమిళ్ లో డేట్ వేశారు. తెలుగులోనూ అదే టైమ్ కు విడుదల చేస్తాం అంటున్నారు. సో.. ఇప్పటికే సంక్రాంతికి ఆరు సినిమాలు అయ్యాయి. చూస్తోంటే వీరిలో ఎవరూ డేట్ మార్చుకునేలా లేరు. ఇంకా చెబితే కొత్త సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఎంత ఫెస్టివ్ సీజన్ అయినా.. ఇన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా అనేదే పెద్ద ప్రశ్న.