Home > సినిమా > రివ్యూ : ద ఫ్యామిలీ స్టార్

రివ్యూ : ద ఫ్యామిలీ స్టార్

రివ్యూ		: ద ఫ్యామిలీ స్టార్
X

రివ్యూ : ద ఫ్యామిలీ స్టార్

తారాగణం : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతి బాబు, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, రోహిణీ హట్టంగడి, వాసుకి, అభినయ తదితరులు

ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్

సంగీతం : గోపీ సుందర్

నిర్మాత : దిల్ రాజు

దర్శకత్వం : పరశురామ్ పేట్ల

గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి సినిమా చేస్తున్నారన్నప్పుడు చాలామంది ఆసక్తిగా చూశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత ఆ రేంజ్ లో మరో హిట్ కొట్టబోతున్నారు అన్నారు కూడా. ప్రమోషన్స్ పరంగా దిల్ రాజు ఇంతకు ముందెప్పుడూ లేనంత కాన్ సెంట్రేట్ చేశాడీ సినిమాపై. మరి ఇంత చేసిన ద ఫ్యామిలీ స్టార్ ఎలా ఉందనేది చూద్దాం.

కథ :

గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆర్కిటెక్చర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని అన్న తాగుబోతు. మరో అన్న సెటిల్ కావడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతో తనే కుటుంబ భాద్యతను మోస్తూ ఉంటాడు. కానీ అందులో ఆనందం వెతుక్కుంటాడు. అతని ఇంటి పై పోర్షన్ లోకి ఇందు దిగుతుంది. మొదట వద్దన్నా.. తర్వాత ఆమెతో కలిసిపోతాడు గోవర్ధన్. ప్రేమలో పడి, పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఇందు నిజంగా తమ కోసం రాలేదనీ.. ఆమె అజెండా వేరే ఉందని తెలుస్తుంది. దీంతో గోవర్ధన్ హర్ట్ అవుతాడు. ఆమెను ఛీత్కరించుకుని.. తన మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి బయట పడేందుకు మరో పెద్ద ఉద్యోగం చూసుకుంటాడు. ఆ ఉద్యోగం కోసం లండన్ వెళుతుండగా.. ఆ కంపెనీ సిఇవో ఇందు అని తెలుస్తుంది. మరి ఇద్దరూ కలిసి లండన్ వెళ్లిన తర్వాత ఏమైంది..? ఇందు అజెండా ఏంటీ..? చివరికి కలిశారా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

ఓ సాధారణ మిడిల్ క్లాస్ స్టోరీ టెంప్లేట్ లోనే మొదలవుతుందీ సినిమా. ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. ఎక్కడా సూపర్బ్ అనిపించే సన్నివేశాలుండవు. వాళ్లు బాధపడుతూ ఉండే సన్నివేశాలేవీ ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ కావు. దీంతో సీరియల్ ను తలపిస్తూ సాగతీతగా ఉంటుంది. మృణాల్ పాత్ర ఎంట్రీ తర్వాత వేగం పెరుగుతుందనుకుంటే అదీ లేదు. లవ్ స్టోరీ అత్యంత సాధారణంగా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ లో కాస్త హై మూమెంట్స్ వచ్చినా.. ఇమ్మీడియట్ సెకండ్ హాఫ్ లో డౌన్ అయిపోతుంది. ఫారిన్ వెళ్లిన తర్వాత కథనం అంతా కంగాళీగా ఉంటుంది. పైగా సినిమాకు కీలకమైన ఇందు పాత్రను ‘‘మ్యూట్’’ చేశాడు దర్శకుడు. దీంతో విజయ్ ఒక్కడే కథనం లాగాలంటే కుదరని పని.ఆ క్రమంలో వచ్చే అనేక సీన్స్ బోరింగ్ గానే ఉంటాయి. వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఎప్పుడూ కనిపించదు. ప్రేమికులు అంటే నమ్మడం కష్టం అనేలా ఆ పాత్రల క్యారెక్టరైజేషన్ రాసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా ఆంత్రోపాలజీ అంటే అర్థం ఏంటో దర్శకుడికి అస్సలు తెలియదు అని అర్థం అవుతుంది. మిడిల్ క్లాస్ మనుషుల కథలు ఆంత్రోపాలజీగా ఎలా థీసిస్ చేస్తారు అనేది లాజిక్ కు కాదు.. కామన్ సెన్స్ కూ అందని విషయం. యూఎస్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ బలవంతంగా ఉంటాయి తప్ప.. నేచురల్ గా ఉండవు. ఓ రకంగా చూస్తే సరైన కథ, కథనం లేకుండానే ఏవో కొన్ని సీన్స్ అనుకుని సెట్స్ పైకి వెళ్లారనిపిస్తుంది.

అయితే మానవీయ విలువల గురించి దర్శకుడు చెప్పాలనుకున్నాడు. మనిషికి మనిషి ఎంత అవసరమో తెలియజేయాలనుకున్నాడు. ఈ క్రమంలో వచ్చే డైలాగ్స్ బావున్నాయి. రెండు మూడు సన్నివేశాలూ ఆకట్టుకుంటాయి. బట్ కథగా వీటిని అంతే అందంగా చెప్పడంలో దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది.

ఎవరెలా చేశారు.. ?

గోవర్ధన్ గా విజయ్ దేవరకొండ, ఇందుగా మృణాల్ ఠాకూర్ బాగా నటించారు. బట్ వీరి మధ్య కెమిస్ట్రీ అంత బాగా అనిపించదు. ముఖ్యంగా లవర్స్ అంటే అస్సలు నమ్మాలనిపించదు. ఏదో ఏజ్ డిస్టన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నటన పరంగా ఎవరికి వారు బాగా చేసినా.. సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం వల్ల లవ్ స్టోరీ తేలిపోయింది. రోహిణీ హట్టంగడి బామ్మగా ఆకట్టుకుంది. జగపతి బాబు, వెన్నెల కిశోర్ తో పాటు మిగతా అన్ని పాత్రలూ వెరీ రొటీన్.

టెక్నికల్ గా ..

మ్యూజిక్ బావుంది. పాటలు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా ఇంకా చాలా కట్ చేసి ఉండాల్సింది. కాస్ట్యూమ్స్ చాలా బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముందీ..? దర్శకుడుగా పరశురామ్ ఎమోషన్స్ ను బాగా డీల్ చేస్తాడు అనే పేరుంది. ఈ సినిమాలో అది పూర్తిగా మిస్ అయింది. బట్ డైలాగ్స్ మాత్రం బాగా రాసుకున్నాడు. అందుకు తగ్గ సరంజామా సన్నివేశాల్లోనూ ఉండి ఉంటే ఇంకా బావుండేదేమో. సర్కారువారి పాటతో సగం తగ్గిన పరశురామ్ ప్రతిభ ఈ సినిమాతో మరింత తక్కువగా కనిపిస్తుందనే చెప్పాలి.

ఫైనల్ గా : సీరియల్స్ ను తలపించిన ఫ్యామిలీ మేన్

రేటింగ్ : 2/5

- బాబురావు. కామళ్ల.

Updated : 5 April 2024 1:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top