వ్యూహం సినిమా స్టోరీ వెల్లడించిన ఆర్జీవీ..
X
దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'వ్యూహం'.ఇటీవల సినిమాకు సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వైఎస్ జగన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను తీస్తున్నారు. రెండు పార్ట్‌లలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యూహం 1, వ్యూహం 2తో ప్రేక్షకులముందుకు తెస్తున్నారు. అయితే వర్మ ఏం చూపించబోతున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో వ్యూహం సినిమా స్టోరీని ఆర్జీవీ వెల్లడించారు.
వ్యూహం మొదటి పార్ట్‌లో 2009 నుంచి 2014 ఎన్నికల వరకు సీఎం జగన్ జీవితం ఎలా సాగింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలు ప్రేక్షకులకు చూపించనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. వ్యూహం-2 లో 2015 నుంచి 2023 వరకు జగన్ జీవితంలోని అంశాలను చూపిస్తానని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్‌ను తొక్కేందుకు జరిపిన కుట్రలను సినిమాలో చూపించబోతున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు. సీఎం జగన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని..ఇచ్చిన మాట కోసం ఆయన కట్టుబడి ఉంటారని రాంగోల్ వర్మ స్పష్టం చేశారు. వ్యూహం 1 ఈ ఏడాది సెప్టెంబర్‌లో, వ్యూహం 2ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల ముందు కూడా లక్మీస్ ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ఆర్జీవీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. మరోసారి ఎన్నికల సమయంలో జగన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుండడం ఉత్కంఠ రేపుతోంది.