Home > సినిమా > 2022 లో రిలీజైన RRRకు 2021 అవార్డులా.. నెట్టింట్లో రచ్చ

2022 లో రిలీజైన RRRకు 2021 అవార్డులా.. నెట్టింట్లో రచ్చ

2022 లో రిలీజైన RRRకు 2021 అవార్డులా.. నెట్టింట్లో రచ్చ
X

2021 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ను అవార్డు వరించింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకి ఈ అవార్డు దక్కింది. అలాగే, బెస్ట్ తెలుగు ఫిల్మ్ విభాగంలో ఉప్పెనకు అవార్డు వరించింది. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్, బెస్ట్ కొరియాగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేల్ సింగర్, బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగాల్లో RRR సినిమా మొత్తం 6 జాతీయ అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్ (కొండపొలం)కు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ (ఆర్ఆర్ఆర్) కు గానూ కీరవాణికి జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ఆర్ఆర్ఆర్ కి అవార్డు వచ్చింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో పురుషోత్తమాచార్యులకు నేషనల్ అవార్డు దక్కింది.





తెలుగు చిత్రాలకు మొత్తం 11 పురస్కారాలు వస్తే, వాటిలో 6 అవార్డులు RRR మూవీకే దక్కాయి. అయితే ఈ చిత్రం మార్చి 25, 2022 లో రిలీజైతే, 2021 అవార్డ్ ఎందుకు ఇచ్చారు? సినిమా రిలీజ్ కాకముందే పాపులర్ అయిందని జ్యూరీ నిర్ణయించిందా? 2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డు అందుకున్న ఇదే సినిమా.. 2021 బెస్ట్ పాపులర్ సినిమా ఎలా అయిదంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అదే 2022 లో విడుదలైన 'KGF 2' చిత్రాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జాతీయ చలన చిత్ర అవార్డులకు ప్రమాణాలు ఏంటి? ఏ ప్రాతిపదికన ఇస్తారు? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.





ఏదైనా సినిమా జ్యూరీ పరిశీలనకు అర్హత పొందాలంటే, జనవరి 1 - డిసెంబర్ 31 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడాలి. ఇప్పుడు 2021 సంవత్సరంలో సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ పొందిన సినిమాలను పరిగణలోకి తీసుకొని, 69వ చలన చిత్ర అవార్డులను ప్రకటించబడ్డాయి. RRR మూవీ 2022 మార్చిలో రిలీజైనప్పటికీ, అంతకు ముందే సెన్సార్ చేయబడింది. 2021 నవంబర్ 25న సెన్సార్ సభ్యుల నుంచి సర్టిఫికెట్ జారీ చేయబడింది. అలానే 'చార్లీ 777' సినిమా గతేడాది విడుదలైనప్పటికీ 2021 లోనే సెన్సార్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. 2021లో సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయబడి, థియేటర్లలో విడుదల కాని సినిమాలు కూడా 69వ జాతీయ చలన చిత్ర అవార్డులకు అర్హత సాధించినవే అవుతాయి. ఆ ప్రకారంగానే RRR అవార్డులు వచ్చాయంటున్నారు.






Updated : 25 Aug 2023 9:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top