Saagu Movie : ఓటీటీలోకి 'సాగు'.. కన్నీళ్లు పెట్టించే కథపై నిహారిక ఎమోషనల్
X
(Saagu Movie) పిడికెడు బువ్వ పొట్టను నింపేందుకు రైతు కోటి కష్టాలు పడతాడు. కమ్మెస్తున్న కష్టాల మబ్బుల్లో కూడా రైతు కన్నీటి వర్షాన్ని కార్చి సాగు చేస్తాడు. ఎన్నో కురుక్షేత్ర యుద్దాలు చేసి తడి కళ్లను తుడుచుకుంటూనే ముందుకు సాగుతాడు. ఆఖరికి నలుగురి చేతుల్లోకి చేరిన బువ్వను చూసి గుక్కెడు నీళ్లు తాగుతాడు. అదే విజయం అనుకుని మురిసిపోతాడు. అటువంటి రైతు కథను కళ్లకు కట్టినట్లు చూపించేదే సాగు. వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రల్లో వినయ్ రత్నం దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీని డాక్టర్ యశస్వి వంగా రూపొందించారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో ఈ మూవీ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తోంది.
ప్రేమ, వివక్ష, వ్యవసాయం ఈ మూడు ఇతివృత్తాల చుట్టూ సాగు కథ సాగుతుంది. మార్చి 4వ తేదిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కైబింగ్, ఎంఎక్స్ ప్లేయర్, హంగామా, యాక్ట్, నెట్‌ప్లస్ బ్రాండ్ వంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. సాగు మూవీపై సమర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ..సాగు మూవీ తనకు ఎంతో ప్రత్యేకమైందన్నారు. లైఫ్‌లో ఎదురుదెబ్బలు తగిలినా ఒక హోప్‌తో ముందుకెళ్లాలన్నారు. గంట పాటు ఉన్న ఈ మూవీని 4 రోజుల్లోనే చిత్రీకరించారన్నారు.
ఒక యంగ్ టీమ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతోందని, ప్రేక్షకులు సాగు టీమ్‌ను ఆదరించాలని కోరారు. రైతు కష్టాలను తానెప్పుడు దగ్గరుండి చూడలేదని, కానీ అలాంటి సినిమాను అందరి ముందుకు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్ వినయ్ రత్నం మాట్లాడుతూ..రైతు గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే సాగు మూవీని తీశానన్నారు. సమస్య ఎలాంటిదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, ఆ విషయాన్నే ఈ సినిమా ద్వారా తెలియజేయాలనుకున్నానని అన్నారు. తమ ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని వినయ్ రత్నం కోరారు.