అమర్నాథ్ యాత్రకు వెళ్లొచ్చిన సాయిపల్లవి.. ఏం చెప్పిందంటే..?
X
సాయిపల్లవి.. తన నటన, సినిమాల సెలక్షన్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన పర్సనల్ విషయాలను ఆమె ఎప్పుడూ పంచుకోదు. కానీ తాజాగా ఆమె వెళ్లిన ఓ ప్రదేశం గురంచి ప్రత్యేకంగా చెప్పింది. భక్తులు పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రకు సాయిపల్లవి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఆమె ఈ యాత్రకు వెళ్లి వచ్చారు. ఈ యాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె పంచుకున్నారు.
ఎదుటి వ్యక్తులకు సాయం చేయకపోతే మనం చనిపోయిన వాళ్లతో సమానమని అమర్నాథ్ యాత్ర తెలియజేసిందని సాయి పల్లవి అన్నారు. తిరుగు ప్రయాణంలో ఓ దృశ్యం తన మనసును కట్టిపడేసిందని చెప్పారు. ‘‘వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి నేను పెద్దగా ఆసక్తి చూపించను. కానీ అమర్‌నాథ్ తీర్థయాత్ర గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఎంతోకాలం నుంచి వెళ్లాలని కలలు కన్న యాత్ర ఇది. 60 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను ఈ యాత్రకు తీసుకువెళ్లడం ఎన్నో సవాళ్లు విసిరింది.
కొన్నిసార్లు వాళ్లు ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడుతూ ఛాతి పట్టుకోవడం.. దారి మధ్యలో అలిసిపోవడం వంటి పరిస్థితులు చూసి.. స్వామీ మీరు ఎందుకు ఇంత దూరంలో ఉన్నారు అని ప్రశ్నించేలా చేశాయి. దైవ దర్శనం అనంతరం నా ప్రశ్నకు సమాధానం దొరికింది. యాత్రను కొనసాగించలేక పలువురు యాత్రికులు ఇబ్బందిపడుతుండగా.. తోటి వాళ్లు ఓం నమః శివాయా అంటూ ఆ స్వామి నామాన్ని గట్టిగా స్మరించారు. వెళ్లలేం అనుకున్న యాత్రికులు కూడా ఒక్కసారిగా స్వామి వారిని తలచుకుని ముందుకు అడుగులు వేశారు.
సంపద, అందం, పవర్‌తో సంబంధం లేకుండా ఇతరులకు సాయం చేయడమే ఈ భూమిపై మన ప్రయాణానికి ఒక విలువని ఇస్తుంది. ఈ అమర్‌నాథ్ యాత్ర నా సంకల్ప శక్తిని సవాలు చేయడంతోపాటు నా ధైర్యాన్ని పరీక్షించింది ’’ అని సాయి పల్లవి పోస్ట్ చేశారు. దీంతో పాటు అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేశారు. విరాటపర్వం, గార్గి తర్వాత సాయిపల్లవి కెమెరా ముందు కనిపించలేదు. శివ కార్తికేయన్‌తో ఆమె ఓ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు సమాచారం.