Home > సినిమా > Salaar Movie Review : Part 1 సలార్ మూవీ జెన్సూన్ రివ్యూ

Salaar Movie Review : Part 1 సలార్ మూవీ జెన్సూన్ రివ్యూ

Salaar Movie Review : Part 1  సలార్ మూవీ జెన్సూన్ రివ్యూ
X

రివ్యూ ః సలార్

తారాగణం ః ప్రభాస్, పృథ్వీరాజ్, శ్రుతి హాసన్, జగపతిబాబు, శ్రేయారెడ్డి, గరుడ రామ్, టిను ఆనంద్, ఈశ్వరీ రావు తదితరులు ..

ఎడిటర్ ః ఉజ్వల్ కులకర్ణి

సినిమాటోగ్రఫీ ః భువన్ గౌడ

సంగీతం ః రవి బస్రూర్

నిర్మాత ః విజయ్ కిరంగదూర్

దర్శకత్వం ః ప్రశాంత్ నీల్

కేజీఎఫ్ రెండు భాగాలతో ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారాడు. కేజీఎఫ్ లో అతను ప్రతి సీన్ నూ హీరో ఎలివేషన్ సీన్ లాగానే మలిచాడు. అప్పుడు యశ్ గురించి మిగతా భాషల ఆడియన్స్ కు పెద్దగా తెలియకపోయినా ఎంటర్టైనర్ అయ్యారు. బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ లాంటి ప్యాన్ఇండియన్ కటౌట్ తోడైతే ఎలాంటి కథతో వస్తాడు. ఏ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయో అంటూ సలార్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి ఆ అంచనాలను ప్రశాంత్ నీల్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం..

కథగా చూస్తే.. వందలయేళ్లుగా బందిపోట్లుగా ఉంటూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశంలో కలవకుండా స్వతంత్రంగా ఉంటూ దేశాన్నే శాసించే ఖాన్సార్ అనే ప్రాంతం ఒకటి ఉంటుంది. అక్కడే వరదరాజమన్నార్(పృథ్వీరాజ్) దేవా(ప్రభాస్) కథ మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు. వరదరాజు కోసం చిన్నప్పుడే ఓ పెద్ద సాహసం చేస్తాడు దేవా. దేవా కోసం తన అధికారాన్నే వదులుకుంటాడు వరద. కానీ దేవా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా తన స్నేహితుడు ఎప్పుడు పిలిచినా వస్తాను అని మాట ఇచ్చి వెళ్లిపోతాడు. ఓ పాతికేళ్ల తర్వాత దేవా అస్సాం ప్రాంతంలో ఉంటాడు. విదేశాల నుంచి ఆద్య(శృతిహాసన్) ఇండియాకు వస్తుంది. ఆమెను చంపాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కాపాడే బాధ్యతను దేవాకు ఇస్తాడు మరో వ్యక్తి. ఆద్యను వెదుకుతున్నవాళ్లంతా దేవా పేరు వింటే ఉలికిపడుతుంటారు. అసలు దేవా అస్సాంలో ఎందుకు ఉన్నాడు. ఆద్య ఎవరు..? దేవా మళ్లీ కాన్సార్ కు వెళ్లాడా ..?వరదరాజు ఏమయ్యాడు అనేది మిగతా కథ.

కొన్ని కథలు చూస్తున్నంత సేపూ కనెక్ట్ కావడం కష్టం. కానీ దర్శకుడు, హీరో కలిసి ఏదైనా మ్యాజిక్ చేస్తూ.. ఆ కథలోని లోపాల వైపు వెళ్లకుండా ప్రయత్నిస్తే కొంత వరకూ కనెక్ట్ అవుతాం. సలార్ కూడా అలాంటిదే. వందలకొద్దీ పాత్రలు పరిచయం చేస్తూ ఉంటాడు దర్శకుడు. కానీ కథకు వాళ్ల సంబంధం ఏంటనే ప్రశ్న ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత అతను చాలా సాదాగా ఉంటాడు. కానీ మనసులో ఓ పెద్ద విస్ఫోటనం ఉన్న భావన కలిగేలా ప్రశాంత్ నీల్ ఇచ్చే బిల్డప్స్ఆకట్టుకుంటాయి. ఆద్యను కాపాడే బాధ్యత తీసుకున్నా.. తల్లి మాట జవదాటడు. ఈ సన్నివేశాలు అతని రాఘవేంద్ర సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఆద్యను రౌడీలు ఇబ్బంది పెట్టినా యాక్షన్ లోకి దిగడు. అదే ఆద్యను ఆమెను వెదుకుతున్న వాళ్లు పట్టుకుపోతున్నప్పుడు తల్లి చెప్పిందని తన విశ్వరూపం చూపిస్తాడు. ఇక్కడే ప్రభాస్ కటౌట్ ను కరెక్ట్ గా వాడుకున్నాడు దర్శకుడు. అతను కొడుతుంటే అది నిజమేనేమో అనే భావన కలుగుతుంది. అలా మొదలైన యాక్షన్ పర్వం ఇంటర్వెల్ వరకూ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇందులో ఏ ఎమోషన్ కనిపించదు. దీంతో ఈ ఫైట్స్ తెరపై బావున్నా.. వాటి వెనక కారణం కనిపించక ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేరు. ప్రభాస్, శృతి హాసన్ మధ్య ఏ రిలేషన్ కనిపించదు. దీంతో ఆమె కోసం అతనెందుకు అంత రిస్క్ తీసుకుంటున్నాడు అనేది ఫజిల్ గానే ఉంటుంది. ఈ ఫజిల్ ఇంటర్వెల్ వరకూ కొనసాగుతుంది. అయినా కరెక్ట్ రీజన్ మాత్రం కనిపించదు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్, నేపథ్య సంగతం వల్ల ఈ మైనస్ కనిపించదు.

ఇక ఖాన్సార్ లో ముగ్గురి ఆధిపత్యం ఉంటుంది. కొందరిని దొరలు అంటారు. మరికొందరు కు కింగ్ లాంటి రాజమన్నార్(జగపతిబాబు) పాతికేళ్ల తర్వాత సడెన్ గా తన రెండో భార్య కొడుకు వరదరాజుకు తన పదవి ఇవ్వాలనుకుంటాడు. అప్పటికే ఆ సింహాసనంపై కన్నేసిన ఆ కింది వర్గం వ్యతిరేకిస్తారు. అదే టైమ్ లో రాజమన్నార్ తనకు ఓ ముఖ్యమైన పని ఉందని ఖాన్సార్ వదిలి వెళతాడు. ఇదే అదనుగా ఖాన్సార్ ను కైవసం చేసుకునేందుకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక తొమ్మిది రోజుల పాటు ఖాన్సార్ లో సీజ్ ఫైర్(కాల్పుల మోత వినిపించకూడదు) విధిస్తారు. మరోవైపు సింహాసనం కోరుకుంటోన్నవాళ్లంతా ఒక్కొక్కరుగా సొంత సైన్యం తయారు చేసుకుంటారు. ఇటు వరదరాజు ఒంటరవుతాడు. చివరికి తన స్నేహితుడు దేవాను తెచ్చుకుంటాడు. ఈ సన్నివేశాల్లోనూ సరైన ఎమోషన్ పండదు. అతను మాటిచ్చాడు కాబట్టి వచ్చేస్తాడు. దేవా ఖాన్సార్ వచ్చిన తర్వాత సన్నివేశాలు మరింత నీరసంగా మారతాయి. కొట్టేందుకు ప్రభాస్ రెడీ. కానీ ఇప్పుడే వద్దు అని ప్రశాంత్ నీల్ అన్నట్టుగా ఒక్కో సన్నివేశం సా...గదీతతో సహనానికి పరీక్షలా ఉంటుంది. ముఖ్యంగా ఒక దొర కొడుకు ఆడవాళ్ల పిచ్చోడు అని చెబుతూ సాగే ఎపిసోడ్ అయితేచిరాకు పెడుతుంది. చివరికి ఆ వ్యక్తి నుంచే దేవా కత్తి చేత పట్టుకుంటాడు. అలా మొదలైన సంహారం చివరి వరకూ సాగుతూనే ఉంటుంది. ప్రభాస్ లాంటి హీరో పదిమందిని కొడుతుంటే చూడ్డానికి బావుంటుంది. కానీ కత్తి చేతికి ఇచ్చి ఏవో పిచ్చి మొక్కలు నరకమని చెప్పినట్టు సాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కొన్నిసార్లు ఓవర్ ద బోర్డ్ అనిపిస్తాయి. సలార్ సీజ్ ఫైర్ నుంచి సెకండ్ పార్ట్ కు వెళ్లే ట్విస్ట్ ఊహించగలిగేదే అయినా.. గూస్ బంప్స్ తెప్పించేలా పిక్చరైజ్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ కు వెళ్లాలునుకోవడం మంచి ఎత్తుగడ. కానీ ఈ ఫస్ట్ పార్ట్ మాత్ర ఆశించినంత గొప్పగా అయితే కనిపించదు. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ ను మెప్పించొచ్చు.

ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఎలా ఉన్నా.. కేజీఎఫ్ లో ఉండే ఎమోషన్ ఈ సినిమాలో పూర్తిగా మిస్ అయింది. అక్కడ హీరోకు ఒక లక్ష్యం ఉంటుంది. అది తన తల్లికి ఇచ్చిన మాట కాబట్టి యూనిక్ గా కనెక్ట్ అయింది. అలాంటి కనెక్టింగ్ ఎమోషన్ ఈ సినిమాలో ఒక్కటీ లేదు. దేవా తల్లిగా ఈశ్వరీరావు నటించింది. ఈవిడ అక్కడక్కడా తమిళ్ ఫ్లేవర్ పూనినట్టుగా కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎంత యాక్షన్ ఎంటర్టైనర్ అయినా.. దానికి సరైన కారణం లేదా ఎమోషన్ లేకపోతే ఆయా నటుల ఒళ్లు హూనం అవుతుంది తప్ప కథ పరంగా గొప్పది అనిపించుకోదు. సలార్ కూడా అంతే. ప్రాణంలేని అందమైన బొమ్మలా ఉంటుంది.

నటన పరంగా ప్రభాస్ దేవా పాత్రకు అచ్చుగుద్దినట్టు సరిపోయాడు. ఆశ్చర్యంగా అతని పాత్రకు అతి తక్కువ డైలాగ్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఐదు పేజీలైనా ఉండవు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక శృతి హాసన్ పాత్రకు సెకండ్ హాఫ్ లో స్కోప్ ఉంటుందేమో కానీ.. ఈ పార్ట్ లో మాత్రం ఖాన్సార్ కథ వినే శ్రోతగా మిగిలిపోయింది. జగపతిబాబు, శ్రేయారెడ్డి, బాబీ సింహా, మైమ్ గోపీ సహజంగా నటించేశారు. జాన్ విజయ్ మాత్రం నటనతో కనిపించిన ప్రతిసారీ చాలా చిరాకు పెడతాడు. టినూ ఆనంద్ ను సరిగా వాడుకోలేదు. ఇతర పాత్రలన్నీ కేజీఎఫ్ తరహాలో తెరనిండా భారీ జుత్తు, గడ్డాలతో కనిపిస్తూ ఆకారపుష్టిగా మిగిలిపోయారు.

అనేక మైనస్ లు ఉన్న ఈ కథను కథనంగా నిలబెట్టింది రవి బస్రూర్ నేపథ్య సంగీతం. కొన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్స్ కలిగాయంటే కారణం కంటెంట్ కంటే ఇతని ఆర్ఆర్ అంటే అతిశయోక్తి కాదు. కేజీఎఫ్ రేంజ్ లో మరోసారి ఆకట్టుకున్నాడు. బట్ ఉన్న రెండు పాటలూ మాంటేజ్ సాంగ్స్ కావడంతో అవి అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ పరంగా కాస్త ఆ బ్లాక్ టోన్ తగ్గించినట్టున్నాడు ప్రశాంత్. బట్ మూవీకి తగ్గ మూడ్ క్రియేట్ చేసే లైటింగ్ తో ఆకట్టుకుంటుందీ కెమెరావర్క్. ఎడిటింగ్ అనేది ప్రశాంత్ నీల్ తరహా కన్ఫ్యూజింగ్ సీన్స్ తో నింపి చివర్లో క్లారిటీ ఇచ్చేలా ఉంది. రెగ్యులర్ గా సినిమాలు చూడని వారికి ఈ ఎడిటింగ్ ఇబ్బంది పెడుతుంది. డైలాగ్స్ బావున్నాయి. ఆర్ట్ వర్క్, సెట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముందీ. దర్శకుడుగా ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ మీద పెట్టిన శ్రద్ధ ఎమోషన్స్ మీద పెట్టలేదు. సెట్ ప్రాపర్టీస్ పై ఉన్న కాన్ సెంట్రేషన్ స్క్రీన్ ప్లే లో కనిపించదు. కేవలం ప్రభాస్ కటౌట్ ను డైలాగ్స్ కూడా తగ్గించి యాక్షన్ సీక్వెన్స్ ల కోసం వాడుకున్నాడు. అదీ వర్కవుట్ అయిందంటే కారణం ఖచ్చితంగా ప్రభాసే.

సినిమాలోని పేర్లు కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఈ పేర్లు, ప్రాంతాల పేర్లూ అర్థం అయ్యి గుర్తు పెట్టుకోవాలంటే రెండు మూడుసార్లు చూడాల్సి ఉంటుంది. మరి సహనానికి అనేక పరీక్షలు పెట్టే ఈ స్క్రీన్ ప్లేను అన్ని సార్లు చూసేవారుంటారా అనేదే పెద్ద డౌట్.

ప్లస్ పాయింట్ ః

ప్రభాస్

ఫైట్స్

నేపథ్య సంగీతం

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్ ః

కథ

కథనం

సాగదీత సన్నివేశాలు

సెకండ్ హాఫ్ లోని మొదటి అరగంటకు పైగా

చివరగా సలార్ ః యాక్షన్ హై డోస్.. ఎమోషన్ వెరీ లెస్

రేటింగ్ ః 2.5/5

Updated : 22 Dec 2023 1:44 PM IST
Tags:    
Next Story
Share it
Top