Home > సినిమా > యాక్షన్‌ తీసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు... సురేశ్ కొండేటి

యాక్షన్‌ తీసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు... సురేశ్ కొండేటి

యాక్షన్‌ తీసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు... సురేశ్ కొండేటి
X

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి సోషల్ మీడియా బాగా ట్రోలింగ్‌కు గురవుతున్న వ్యక్తి సురేష్ కొండేటి. సీనియర్ సినిమా జర్నలిస్టునంటూ.. పలు మూవీ ప్రెస్ మీట్‌లో ఆయన అడిగే తిక్క ప్రశ్నలపై నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్ల పుట్టుమచ్చల గురించి.. హీరోల లవ్ ఎఫైర్స్ గురించి, అదే విధంగా టాలీవుడ్ దర్శకులకు సినిమా తీసే సత్తా ఉందా అంటూ... తక్కువచేసి ప్రశ్నలు అడిగారు. మొన్నీమధ్య ‘2018’ మూవీ ప్రెస్ మీట్‌లో కూడా ఆయన అడిగిన ఓ ప్రశ్నకు దర్శకుడు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో సురేష్ కొండేటిపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది.

ఒకప్పుడు సంతోషం మ్యాగజైన్ యజమానిగా, సినీ నిర్మాతగా పని చేసింది.. ఈ వ్యక్తేనా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా. అయితే, సురేష్ కొండేటి ప్రెస్ మీట్లలో అడిగే ప్రశ్నలకు సంబంధించి పలు యూట్యూబ్ ఛానెళ్లు వీడియోలు పెడుతున్నాయి. ఆ వీడియోలకు థంబ్ నైల్స్ అసభ్యకరంగా, తనను అవమానించేలా పెడుతున్నారని సురేష్ కొండేటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటులు, దర్శక నిర్మాతలతో తనకున్న చనువుతోనే అలాంటి ప్రశ్నలు అడుగుతానని.. అలాంటి ప్రశ్నలు అడిగి వైరల్ అయిన సినిమాలన్నీ థియేటర్లలో హిట్టవుతున్నాయని చెబుతున్నారు. ఇంకోసారి ఎవరైనా మితిమీరి తనపై అసభ్యకరంగా వీడియోలు, తంబ్‌నైల్స్ పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.




"అందరికీ నమస్కారం,

నేను మీ సురేష్‌ కొండేటి.. నేను గతంలో ‘వార్త’ సురేష్‌‌గా, తరువాత సంతోషం సురేష్‌‌గా సినీ పరిశ్రమలో అందరికీ సుపరిచితం. సంతోషం మ్యాగజైన్‌ ఎడిటర్‌‌గా అసంఖ్యాక ప్రేక్షక లోకానికి కూడా పరిచితమే. 31 సంవత్సరాలుగా నేను సినిమా జర్నలిస్టుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న విషయం కూడా దాదాపు అందరికీ తెలుసు. సినిమా జర్నలిస్టుగా సినిమా కెరియర్‌ మొదలుపెట్టి డిస్ట్రిబ్యూటర్‌‌గా మారి దాదాపు 85 సినిమాలను విజయవంతంగా డిస్ట్రిబ్యూట్‌ చేశాను. 16కు పైగా సినిమాలను నిర్మాతగా చేశాను. పీఆర్వోగా 600 పైగా సినిమాలకు పని చేశాను. అంతేకాదు సినీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న అనేక సంఘాలలో కీలక బాధ్యతలు చేపట్టి విజయవంతంగా చేశాను, చేస్తున్నాను.

నేను సినిమా వాడిని.. మళ్లీ చెబుతున్నా నేను సినిమా ప్రేమికుడిని..

ఈ 31 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌‌లో సినిమా పరిశ్రమలో ఉన్న అనేక రంగాలకు చెందిన టెక్నీషియన్లు, నటీనటులతో ఉన్న సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ప్రెస్‌ మీట్లలో ఆ సమయానికి అవసరమైన మేర కొన్ని ప్రశ్నలు సంధించడం ఈ యూట్యూబ్‌ పుట్టక ముందు నుంచి జరుగుతూ వస్తోంది. అయితే అప్పుడు యూట్యూబ్‌ అంతగా లేని రోజుల్లో నేను ప్రెస్‌ మీట్లతో పాటుగా ఇంటర్వ్యూలలో కూడా నేను అడిగే ప్రశ్నలకు సినీ ప్రముఖులు అబ్బురపడి వారి వారి పర్సనల్‌ లెటర్‌ ప్యాడ్ల మీద నన్ను అభినందిస్తూ ఇంటర్వ్యూ చాలా బాగా రాశారు అంటూ లేఖలు రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో స్పెషల్‌‌గా మీడియా కోసం ప్రొజెక్ట్‌ చేస్తున్న టీజర్‌, ట్రైలర్‌ లేదా వీడియో కంటెంట్‌‌‌ని చూసిన తర్వాతే నా మదిలో మిగిలిన ప్రశ్నలను సినిమా యూనిట్‌ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఉన్న నటీనటులు లేదా డైరెక్టర్లు, నిర్మాతలతో నాకున్న సాన్నిహిత సంబంధాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని ప్రశ్నలు అడగటం, వాటికి వారు నాతో ఉన్న చనువు వల్ల సరదాగా ఒకరిద్దరు సెటైరికల్‌‌గా సమాధానాలు చెప్పడం దాన్ని చిలువలు-పలువలుగా యూట్యూబ్‌ ఛానల్స్‌ ప్రోజెక్ట్‌ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానల్స్‌‌లో సినిమా వారిని నేను అడిగిన ప్రశ్నకు కానీ సమాధానానికి కానీ సంబంధం లేకుండా కొత్త కంటెంట్‌ క్రియేట్‌ చేసి జనాల్లోకి వదులుతున్నారు. నిజానికి నేను కూడా రెండు యూట్యూబ్‌ ఛానల్స్‌ నడుపుతున్నాను. కానీ నేను వార్తలు, ప్రెస్‌ మీట్‌‌లో జరిగిన వాస్తవాలను తప్ప మరే ఇతర కంటెంట్‌‌ని ప్రజల మీద రుద్దడంలేదని గర్వంగా చెప్పుకుంటాను.

యూట్యూబ్‌ ఛానల్‌ ఓనర్స్‌ & ఎడిటర్స్‌ అక్కడ అడిగే ప్రశ్నలు విని థంబ్‌ నైల్స్‌ పెట్టండి. అంతే కానీ అక్కడి ప్రెస్‌ మీట్‌‌లో ప్రశ్నకు జవాబుకు సంబంధం లేకుండా మీరే కంటెంట్‌ రాసి మీ క్రియేటివిటీ చూపించకండి. సమాజానికి పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి, అలాంటివాటి మీద మీ క్రియేటివిటీని చూపించండి. అంతే కానీ నా మీద, వినోదాన్ని పంచే సినిమా మీద చూపించకండి. మీ ఇష్టం వచ్చినట్టు అసలు ప్రెస్‌ మీట్‌ కూడా వినకుండా థంబ్‌ నెయిల్స్‌ పెట్టడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. మీరు ఇక ముందు పెట్టేటప్పుడు నేను ఏం ప్రశ్న అడిగాను? దానికి సినిమా వారు ఏం సమాధానం చెప్పారు? అనేది దయచేసి పూర్తిగా విని థంబ్‌ నెయిల్స్‌ పెడితే బాగుంటుంది. నేను రాని ప్రెస్‌ మీట్లకు కూడా నా పేరు నా ఫోటోలను వాడుతూ యూట్యూబ్‌‌లో వీడియోలు, థంబ్‌ నైల్స్‌ పెడుతున్న వారి మీద యాక్షన్‌ తీసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు. కానీ మనందరం ఒకటే కుటుంబం.. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను

అలాగే సినీ జర్నలిస్టుగా నా పయనం ప్రారంభమైన తర్వాత నా అనుభవం అంత వయసు లేని వారు కూడా ఏవేవో కామెంట్లు చేస్తున్నారు. ప్రెస్‌మీట్‌లో మీకు కనిపించేది కొంత. కానీ తెర వెనుక నటీనటులు, దర్శక నిర్మాతలతో నాకున్న సత్సంబంధాల రీత్యా మాత్రమే కొన్ని ప్రశ్నలు అడిగితే వాటికి వారు కూడా అదే స్పిరిట్‌‌తో సమాధానం ఇస్తారు. ఫైనల్‌‌గా నేను చెప్పేది ఒక్కటే.. నేను సినిమా వాడిని ఎప్పటికీ సినిమాని ప్రేమిస్తూ.. సినీ పరిశ్రమ వల్ల వేలాదిమంది బతికి ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేయాలని కోరుతూ ఉంటాను. ఇక ఈ ప్రశ్నలు అడగడం, దానికి సినిమా వారు సమాధానాలు ఇవ్వడం అంతా సినిమా ప్రమోషన్స్‌ కోసమే, అంటే సినిమాని బతికించడం కోసమే. కానీ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ మీరు వాడుతున్న పదజాలం ఏమాత్రం సరికాదు.. నేను ప్రశ్నలు అడిగి వైరల్‌ అయిన సినిమాలు థియేటర్లలో హిట్లుగా నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అది సినీ పరిశ్రమకు, నిర్మాతకి ఉపయోగపడేవే తప్ప ఎక్కడా నష్టం లేదు. నేను పరిశ్రమ బాగు కోసం చేస్తున్న దాన్ని అసభ్యకరంగా చిత్రీకరిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదు. మా లీగల్‌ టీం ద్వారా చర్యలు తీసుకుంటామని ముందుగానే చెప్పటం జరుగుతుంది" అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదలు చేశారు. ఈ నోట్‌పై కూడా రకరకాలు కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
















Updated : 1 Jun 2023 7:38 AM IST
Tags:    
Next Story
Share it
Top