Home > సినిమా > మంత్రి రోజాకు బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సీనియర్ హీరోయిన్స్

మంత్రి రోజాకు బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సీనియర్ హీరోయిన్స్

మంత్రి రోజాకు బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సీనియర్ హీరోయిన్స్
X

మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై సీనియర్ నటీమణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో మహిళలు ఎదగడం చూసి ఓర్వలేకే ఇలాంటి పిచ్చి కూతలు కూస్తున్నారని ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. ఫైర్ అయ్యారు. తాజాగా సీనియర్ హీరోయిన్స్ మీనా, రమ్యకృష్ణలు కూడా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలు విడుదల చేశారు.

మీనా షేర్ చేసిన వీడియోలో.. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో చూశానని, ఆ వీడియో చూడగానే తనకు చాలా కోపమొచ్చిందని చెప్పారు. ఒక ఆడదాని జీవితంలో ఎదుగుల చూసి సహించలేక ఇలాంటి మాటలు మాట్లాడితే భయపడి, ఏడ్చే రోజులు పోయాయన్నారు. ఇలాంటి మాటలు బండారు ఎంత దిగజారుడు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని.. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనమని అన్నారు. బండారు బహిరంగంగా ఎలాంటి తప్పుడు కూతలు కూశారో.. అలానే బహిరంగంగా ఆమెకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి తనకు తెలుసున్న మీనా.. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి నాకు పూర్తిగా తెలుసని, రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ అని అన్నారు. ఓ నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. మంత్రి రోజా చేసే పోరాటానికి తాను అండగా ఉంటానని.. తన మద్దతు ప్రకటించారు. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇక రమ్యకృష్ణ కూడా ఓ వీడియో విడుదల చేస్తూ.. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని రమ్యకృష్ణ డిమాండ్ చేసారు.

Updated : 8 Oct 2023 9:41 AM IST
Tags:    
Next Story
Share it
Top