డిప్రెషన్ నుంచి బయటపడేందుకే గంజాయి తీసుకున్నా.. షణ్ముఖ్
డిప్రెషన్ నుంచి బయటపడేందుకే గంజాయి తీసుకున్నా.. షణ్ముఖ్
X
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.. గంజాయితో పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ యువతి ఫిర్యాదుతో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం వెళ్తే.. బై వన్ గెట్ వన్ ఆఫర్‌లోలా ఇద్దరు అన్నదమ్ములు గంజాయితో దొరికేశారు. గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తన పరిస్థితి ఏమీ బాలేదని, తాను కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నానని చెప్పినట్లు సమాచారం. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్నాయని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే గంజాయి తాగుతున్నానని షణ్ముఖ్ వివరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంపత్ ను అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ కనిపించాడు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలుసుకునేందుకు షణ్ముఖ్ ను విచారించగా.. తన మానసిక పరిస్థితి బాలేదంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడని తెలిపారు. కాగా, షణ్ముఖ్ శనివారమే బెయిల్ పై బయటకు వచ్చాడు.
ఇదిలా ఉంటే.. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ లీలలు.. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2016లో థిక్ షేక్ ఫ్యాక్టరీ (Thick Shake Factory) ప్రాంచైజీ పేరుతో ఓ యువతిని రూ. 20 లక్షలు మోసం చేశాడట. తన ఎంబీఏ క్లాస్ మెట్ అయిన ఆ అమ్మాయిని, చాలా లాభాలు వస్తాయని నమ్మించి.. తనతో బ్రాంచ్ ఓపెన్ చేయించి.. తానే మొత్తం చూసుకునే వాడు. అయితే.. ఆ అమ్మాయికి మాత్రం.. నెలకు 7 వేలు మాత్రమే లాభం వచ్చిందంటూ ఇచ్చి.. మిగతాదంతా నొక్కేశాడు. దీంతో.. మోసపోయామని గుర్తించి ఇచ్చిన డబ్బులు అడగ్గా యువతిని బ్లాక్ చేసేశాడు. ఫ్రెండ్ కావటంతో ఆ అమ్మాయి కూడా ఓపికున్నంత వరకు అడిగి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. సంపత్ వినయ్ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో.. బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తూ.. తమ గోడు వినిపిస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.