పల్లవి ప్రశాంత్ పై ఆరు కేస్ లు
X
పల్లవి ప్రశాంత్.. రైతుబిడ్డనంటూ ఎన్నో వీడియోలు చేశాడు. పొలం పని చేస్తూ అతను చేసిన వీడియోలకు జనం నుంటి ఆదరణ బాగానే వచ్చింది. దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం గట్టిగానే చేశాడు. తనను బిగ్ బాస్ హౌస్కు పంపించాలని కోరాడు. పల్లవి ప్రశాంత్ కు యూ ట్యూబ్ తో పాటు ఇన్ స్టా గ్రాంలోనూ తిరుగులేని ఫాలోయింగ్ ఉండటంతో బిగ్ బాస్ రేంజ్ సెలబ్రిటీస్ తో త్వరగానే పరిచయాలే ఏర్పడ్డాయి. వాటిని కూడా అడ్డుపెట్టుకుని అదే పనిగా బిగ్ బాస్ టార్గెట్ గా వీడియోలు చేశాడు. ఫైనల్ గా అతని కల నెరవేరింది. బిగ్ బాస్ సీజన్ 7లోకి కామన్ మేన్ గా ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి వారం నుంచే హౌస్ మేట్స్ ప్రశాంత్పై ఎటాక్ మొదలుపెట్టడంతో శివాజీ అండగా నిలిచాడు. అటుపై తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయితే హౌస్ లో ఇతర కంటెస్టెంట్స్ చెప్పినట్టుగానే అతనో అపరిచితుడు. నామినేషన్ టైంలో ఒకలా, గేమ్ టైంలో మరోలా.. ఇతర సమయాల్లో ఇంకోలా ప్రవర్తించాడు. ఏం చేసినా రైతుబిడ్డననే సింపతీ పోకుండా జాగ్రత్త పడ్డాడు. చివరికి ఫస్ట్ తెలుగు నుంచి ఓ కామన్ మేన్ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. నిజానికి అతను హౌస్ లో చేసిన పర్ఫార్మెన్స్ కు నిజంగానే చాలామంది రైతుబిడ్డకు సపోర్ట్ చేయాలని భావించారు. ఈ మేరకు కొందరు సోషల్ మీడియా ఎక్స్ పర్ట్స్ కూడా ఉచితంగా అతనికి సర్వీస్ చేశారు.
ఇంత వరకూ బాగానే ఉంది. కానీ బిగ్ బాస్ కప్పు గెలిచి బయటకు వచ్చిన తర్వాత రైతు బిడ్డ అసలు రూపం బయటపడింది. ఇన్నాళ్లూ తను హౌస్ లో చేసిందంతా నటనే అని స్పష్టమైంజన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ను సపోర్ట్ చేస్తూ సోషల్, డిజిటల్ మీడియా వేదికగా ఎంతో మంది సాయం చేశారు. వారందరికీ తాను బయటకు వచ్చాక సెపరేట్గా ఇంటర్వ్యూస్ ఇస్తానని చెప్పాడట. కానీ తీరా బయటకు వచ్చిన తర్వాత అందరికీ హ్యాండ్ ఇచ్చాడు. పైగా తనేదో ఇండియాకే కప్పు సాధించిన రేంజ్ లో బిల్డప్ ఇస్తూ.. అందరికీ సాయం చేయడానికి నేనేమైనా సీఎంనా అంటూ మరో కోణం బయటపెట్టాడు. గతంలో బిగ్ బాస్ కు పంపమంటే జనం సపోర్ట్ చేశారు... అందుకే ఇప్పుడు సీఎంను కూడా చేయమని అడుగుతున్నాడా అంటూ నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. ఒక రకంగా పల్లవి ప్రశాంత్ తను రైతుబిడ్డను అనే అమాయకపు నటనతో అనేకమందిని మోసం చేశాడనే భావన ఇప్పుడు చాలామందిలో కలుగుతుంది. కానీ ఇప్పుడిక ఎవరూ ఏం చేసేది లేదు. అయినా ఇది ఒక ఎత్తైతే.. అతను గెలిచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు మరో ఎత్తు.
ఇప్పటి వరకూ బిగ్ బాస్ హిస్టరీలోనే లేని విధంగా పల్లవి ప్రశాంత్ అభిమానులమంటూ కొందరు అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన చిల్లర హంగామా చూసి సంస్కారం ఉన్న ఎవరైనా సిగ్గు పడాల్సిందే. అమర్ దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. ఇది చాలదన్నట్టు అస్సలు ఏ సంబంధం లేని ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. వారి దాడిలో ఆరు బస్సులు బాగా డ్యామేజ్ అయ్యాయి. ఇదే విషయం పల్లవి ప్రశాంత్ తో మీ అభిమానులు అమర్ దీప్ కార్ ను ధ్వసం చేశారు అని చెబితే.. నాకేం తెలుసు.. దొంగెవరో దొరెవరో అందరికీ తెలుసు. ఎవరో చేసిన దాన్ని నాపై వేస్తే ఎలా అంటూ అటు అమర్ ను దొంగలా చిత్రించే ప్రయత్నం చేస్తూనే.. తన అభిమానులకు తనూ ఏం సంబంధం లేదని తేల్చేశాడు.
ఈ మొత్తం ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. చాలామంది అమ్మాయిలతోనూ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరు పెట్రోల్ తీసుకు వచ్చి మరీ బెదిరింపులకు దిగారు. దాడులు చేస్తూ చెప్పరాని భాషలో బూతులు మాట్లాడారు. ప్రశాంత్ అలా చేయకండని ఒక్క మెసేజ్ ఇవ్వకపోగా.. ఆ తర్వాత కూడా తన అభిమానుల వల్ల జరిగిన అసౌకర్యంపై కనీసం స్పందించలేదు. దీంతో అతనిపై ఏకంగా పోలీసులు 6 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడానికి కారణం అయినందుకు, కొందరి ప్రైవేట్ వాహనాలను ధ్వసం చేయడంలో అతని పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తిస్తూ.. అక్కడ గురించిన కొందరితో పాటు ప్రశాంత్ పైనా కేసులు బుక్ చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్స్ చూసిన తర్వాత పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డగానే వచ్చాడు.. కానీ గెలిచిన తర్వాత రైతుబిడ్డలా మాత్రం ప్రవర్తించలేదు. హౌస్ లోకి వచ్చేందుకు, వచ్చిన తర్వాత, ఆటలు ఆడుతున్నప్పుడూ అతను ఎంతో వినమ్రంగా కనిపించాడు. బట్.. కప్ గెలిచిన తర్వాతే అసలు రూపం ప్రదర్శిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపం ఇప్పటి వరకూ అతనికి సపోర్ట్ చేసిన వాళ్లు కూడా ఇన్నాళ్లూ ఒక ఫేక్ పర్సన్ ను ఎంకరేజ్ చేశామని బాధపడుతున్నారంటే అతని ఒరిజినాలిటీ ఎంటో స్పష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడీ కేసుల నుంచి అతని ఫ్యాన్స్ కాపాడతారా.. లేక ఇంకెవరైనా వస్తారా అనేది చూడాలి.