Home > సినిమా > అక్టోబర్ 6.. అర డజను సినిమాలు

అక్టోబర్ 6.. అర డజను సినిమాలు

అక్టోబర్ 6.. అర డజను సినిమాలు
X

సెప్టెంబర్ లో క్రేజీ డేట్స్ అన్నీ వదులుకున్నారు టాలీవుడ్ మేకర్స్. సెప్టెంబర్ 15, 22 తేదీల్లో సరైన తెలుగు సినిమాలే పడలేదు. దీంతో ఈ రెండు డేట్స్ వేస్ట్ అయిపోయాయి అనే ఫీలింగ్ ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఉంది. అనూహ్య పరిణామాల మధ్య సెప్టెంబర్ 28 సినిమాలు కొన్ని అక్టోబర్ 6కు వచ్చాయి. అదే టైమ్ లో ఆల్రెడీ వేరే సినిమాలు కర్చీఫ్ వేసి ఉన్నాయి. తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా అక్టోబర్ 6నే ఎంచుకోవడంతో అదే రోజున ఏకంగా అరడజను సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ప్రామిసింగ్ గా రూల్స్ రంజన్

సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయిన రూల్స్ రంజన్ మూవీ అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన సినిమా ఇది. ఏఎమ్ రత్నం తనయుడు రతినం క్రిష్ణ డైరెక్ట్ చేశాడు. పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన కిరణ్ అబ్బవరం సినిమాల కంటే చాలా బెటర్ గా ఉండబోతోంది అనే కలర్ కనిపించింది. కిరణ్, నేహాల జోడీ కూడా ఆకట్టుకుంటోంది. దీంతో అక్టోబర్ 6 చిత్రాల్లో అందరి కళ్లూ ఈ మూవీపైనే ఉన్నాయి.

క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా మ్యాడ్

రూల్స్ రంజన్ లానే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6కు వచ్చిన సినిమా మ్యాడ్. సితార బ్యానర్ నిర్మించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది.. నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. అతనితో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీప్రియ రెడ్డి కీలక పాత్రలు చేశారు. లేటెస్ట్ గా ఈ మ్యాడ్ ట్రైలర్ ను ఎన్టీఆర్ తో రిలీజ్ చేయించారు. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. పూర్తిగా కుర్రాళ్ల సినిమా అని కొందరు కమెంట్స్ చేస్తున్నా.. ఇలాంటి చిత్రాలే ఈ మధ్య ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి కాబట్టి.. మ్యాడ్.. రూల్స్ రంజన్ కు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.

మామా మశ్చీంద్రా - విభిన్నమైన త్రిపాత్రాభినయం

ఇక ఇదే రోజున వస్తోన్న మరో త్రిబుల్ ట్రీట్ మూవీ మామా మశ్చీంద్రా. సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన ఈ మూవీపై మొదట ఏ అంచనాలూ లేవు. నటుడు, రచయిత హర్ష వర్ధన్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఈషా రెబ్బా, మ్రుణాళిని రవి హీరోయిన్లు. ఇంతకు ముందు వరకూ ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలూ లేవు. కానీ ట్రైలర్ తర్వాత పెరిగాయి. చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన త్రిపాత్రాభినయం చిత్రాలకు భిన్నంగా కనిపిస్తోంది. కాకపోతే ప్రమోషన్స్ పెద్దగా లేవు. మరి ఆ రెండు సినిమాలకు మామా మశ్చీంద్రా ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి.

మంత్ ఆఫ్ మధు భావోద్వేగాల సమ్మేళనం

ట్రైలర్ తోనే వెరీ ఇంప్రెసివ్ అనిపించుకుని.. ఒక తరహా ప్రేక్షకుల నుంచి మస్ట్ వాచ్ లిస్ట్ లో పడిన సినిమా మంత్ ఆఫ్ మధు. నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించారు. ఇంతకు ముందు భానుమతి రామక్రిష్ణ అనే చిత్రంతో ఆకట్టుకున్న శ్రీకాంత్ నాగోతి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. టీజర్ కు భిన్నంగా ట్రైలర్ కనిపించింది. పూర్తిగా మనుషుల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో అల్లుకున్న కథలా ఉంది. కమర్షియల్ గా ఎలా ఉన్నా.. విమర్శియల్ గా మెప్పిస్తుందనుకుంటున్నారు. మంత్ ఆఫ్ మధు కూడా అక్టోబర్ 6నే వస్తోంది.

డబ్బింగ్ సినిమాలు

ఆ నాలుగు తెలుగు సినిమాలు కాక అదే రోజు వస్తోన్న మరో రెండు సినిమాలూ డబ్బింగ్. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా రూపొందిన 800తో పాటు సిద్ధార్థ్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిన్నా కూడా అక్టోబర్ 6నే వస్తున్నాయి. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రమోషన్స్ పరంగా కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్నా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉన్నాయీ చిత్రాలు.

విజేత ఎవరు

సో.. మొత్తం ఆరు చిత్రాల్లో నాలుగు స్ట్రెయిట్ తెలుగు మూవీస్. రెండు డబ్బింగ్ మూవీస్. మరి ఆరు చిత్రాల నుంచి బాక్సాఫీస్ వద్ద అసలైన విజేతగా నిలిచేది ఎవరనేది చూడాలి.


Updated : 3 Oct 2023 7:50 PM IST
Tags:    
Next Story
Share it
Top