Home > సినిమా > వేయని పాత్ర లేదు.. చేయని జోనర్ లేదు..

వేయని పాత్ర లేదు.. చేయని జోనర్ లేదు..

వేయని పాత్ర లేదు.. చేయని జోనర్ లేదు..
X

స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన అందరూ స్టార్లు అయిపోరు. టాలెంట్ లేకపోతే ఎంత గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ప్రేక్షకులు మాత్రం పట్టించుకోరు. ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కొడుకుగా తెరంగేట్రం చేసినా.. తన నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో బాలయ్య చేయని పాత్ర, ట్రై చేయని జోనర్ లేదు. జానపదం, పౌరాణికం, చారిత్రకం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్.. అదీ ఇదీ అనే తేడాలేకుండా అన్ని రకాల చిత్రాల్లో నటించారు. ప్రయోగాలకు పెద్దపీట వేసి క్లాస్ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

తాతమ్మ కలతో తెరంగేట్రం

తాతమ్మ కల సినిమాతో బాలయ్య వెండితెరకు పరిచయమయ్యాడు. అప్పటికి ఆయన వయసు 14 ఏండ్లు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రి ఎన్టీఆర్ కు ఆయన మనవడిగా నటించాడు. టాలీవుడ్లో తండ్రితో కలిసి 12 చిత్రాల్లో నటించిన ఏకైక హీరో బాలకృష్ణ. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కల, దానవీర శూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం తదితర చిత్రాల్లో బాలయ్య నటించాడు.

అన్నీ సూపర్ హిట్లే..

హీరోగా బాలయ్య తొలి చిత్రం సాహసమే జీవితం. 1984లో రిలీజైన ఈ మూవీ సరిగా ఆడలేదు. కానీ ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఏ డైరెక్టర్తో చేసినా విజయం ఖాయం. స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, బాలయ్యల కాంబోలో 13 సినిమాలు రాగా.. వాటిలో 9 సూపర్ హిట్ కొట్టాయి. ఇక కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చేసిన 7 సినిమాల్లో 6 బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన బాలయ్యకు తన సినిమాలకు సింహం పదం వచ్చేలా టైటిళ్లు పెట్టడం సెంటిమెంట్. సింహం నవ్వింది, బొబ్బిలి సింహం, సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, సింహా, జై సింహా, వీర సింహారెడ్డి తదితర సినిమాలకు సింహం పేరు కలిసొచ్చేలా టైటిల్ పెట్టుకున్నారు.

పోలీస్ పాత్రలకు కేరాఫ్

బాలకృష్ణ ఇప్పటి వరకు 12 చిత్రాల్లో పోలీసుగా కనిపించారు. భలే తమ్ముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్స్పెక్టర్, మాతో పెట్టుకోకు, సుల్తాన్, భలేవాడివి బాసు, సీమ సింహం, చెన్న కేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా, అల్లరి పిడుగు, రూలర్ సినిమాల్లో బాలయ్య పోలీస్ పాత్ర పోషించాడు. ఒక్క ఏడాదిలో 8 సినిమాలు విడుదలైన హీరోగా బాలకృష్ణ రికార్డు సొంతం చేసుకున్నారు. 1987లో ఆయన నటించిన అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, రాము, అల్లరి కృష్ణయ్య, సాహస సమ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వ గోపాలుడు, భానుమతి గారి మొగుడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ – విజయశాంతిలది సూపర్ హిట్ జోడీ. అందుకే దర్శక నిర్మాతలు బాలయ్య సరసన విజయశాంతిని ఫస్ట్ ఛాయిస్గా ఎంచుకునే వారు. వీరిద్దరూ జంటగా 17 సినిమాల్లో నటించారు. ముద్దుల మావయ్య, భలే దొంగ, రౌడీ ఇన్స్పెక్టర్, భార్గవ రాముడు, లారీ డ్రైవర్ తదితర చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

పౌరాణిక పాత్రల్లో

ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా బాలయ్య సొంతం. బాలయ్య ఐదు సినిమాల్లో డాన్ గా నటించాడు. నిప్పులాంటి మనిషి, ప్రాణానికి ప్రాణం, అశోక చక్రవర్తి, యువరత్న రాణా, సుల్తాన్ చిత్రాల్లో ఆయన డాన్ పాత్ర పోషించారు. సెకండ్ జనరేషన్ హీరోల్లో పౌరాణిక పాత్రలు చేసిన హీరోల్లో బాలయ్యదే అగ్రస్థానం. తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణతో కలిసి శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించిన బాలకృష్ణ.. తండ్రితో కలిసి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు, దుష్యంతుడు, హరిశ్చంద్రుడు తదితర పౌరాణిక, చారిత్రక పాత్రలను పోషించారు. బ్రహ్మర్షి విశ్వామిత్రలో ఎన్టీఆర్ విశ్వామిత్రుడిగా, రావణుడిగా నటిస్తే బాలయ్య హరిశ్చంద్ర, దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

ప్రయోగాత్మక చిత్రాలు

1990లలో అనేక ప్రయోగాత్మక చిత్రాలకు సై అన్నారు బాలకృష్ణ. బాలయ్య నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీలో బాలయ్య శ్రీ కృష్ణ దేవరాయలు, కృష్ణ కుమార్ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించాడు. ఈ మూవీకి సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా చేసే ఆలోచనలో ఉన్న అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇక ఆదిత్య 369ను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లోనే భైరవ ద్వీపం అనే జానపద చిత్రంలోనూ బాలయ్య మెప్పించారు. మాస్ హీరోగా, గ్లామరస్ కథా నాయకుడిగా రాణిస్తున్న సమయంలో భైరవద్వీపంలో కురూపిగా నటించేందుకు ఆయన ఒప్పుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి.

డ్యూయెల్ రోల్స్

టాలీవుడ్లో బాలయ్య చేసినన్ని డ్యూయెల్ రోల్స్ ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు. 16 సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. 2012లో వచ్చిన అధినాయకుడు మూవీలో తాత, తండ్రి, మనవడిగా మూడు పాత్రలు చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనూ బాలయ్య అనేక చిత్రాలు చేశారు. 1999లో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహా రెడ్డి ఫ్యాక్షన్ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తాను నటించిన చిత్రాల్లో సమరసింహా రెడ్డి తనకెంతో ఇష్టమని చెబుతారు బాలకృష్ణ. ఇక తండ్రి బయోపిక్ లో నటించిన ఏకైక హీరోగా అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాల్లో తండ్రి పాత్ర పోషించారు. ఈ సినిమాలతోనే ఎన్టీఆర్ నిర్మాతగా మారారు.

Updated : 10 Jun 2023 6:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top