క్రియాశీలక రాజకీయాల్లోకి తమిళ దళపతి?
X
తమిళ హీరో విజయ్ సినిమాలు మానేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేస్తారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దాని కోసం వ్యూహ రచన కూడా మొదలెట్టేసారని చెబుతోంది. 2026 ఎన్నికల్లో కచ్చితంగా విజయ్ పోటీ చేస్తారని అంటోంది.
హీరో విజయ్ సినిమాలకు బైబై చెప్పేస్తున్నారని ఓ ప్రముఖ తమిళ వెబ్ సైట్ ప్రకటించింది. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో లియో సినిమాలో విజయ్ లీడ్ రోల్ చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ గా దీని షూటింగ్ జరుగుతోంది. దీని తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి 68 సినిమా చేయనున్నారు. విజయ్ కు అదే లాస్ట్ సినిమా అంటోంది కోలీవుడ్. దళపతి 68 షూటింగ్ 2025 కల్లా ముగించుకుని పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేస్తారని చెబుతోంది.
తమిళనాడులో 2026లో ఎలక్షన్స్ జరగనున్నాయి. అందుకే 2025 ఏడాది మొత్తం మక్కల్ ఇయక్కం పార్టీ పనులు చేయాలని విజయ్ భావిస్తున్నారుట. దీని గురించి ఆయన సన్నిహితులు, రాజకీయ నేతలతో చర్చిస్తున్నారని సమాచారం. ఎప్పటి నుంచో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా...అవి నిజం అవలేదు ఎప్పుడూ. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని అంటున్నారు. విజయ్ ఈసారి చాలా సీరియస్ గానే రాజకీయాల్లోకి రావాలను కుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో ఓటు హక్కు గురించి విజయ్ మాట్లాడ్డం, ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగాలు లాంటివి అన్నీ రాజకీయ ప్రవేశానికి ముందు జరిగే తంతేనని ఆయన అభిమాన సంఘాల్లోని ముఖ్యమైన వ్యక్తులు నమ్మకంగా చెబుతున్నారు.