Home > సినిమా > కెప్టెన్ ను కోల్పోయిన కోలీవుడ్

కెప్టెన్ ను కోల్పోయిన కోలీవుడ్

కెప్టెన్ ను కోల్పోయిన కోలీవుడ్
X

తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నాళ్లుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోన్న స్టారో, పొలిటీషియన్ విజయ్ కాంత్(71) కన్నుమూశారు. చాలా రోజులుగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. రెగ్యులర్ హాస్పిటల్ లో చెకప్ కు వెళుతూ వస్తోన్న విజయ్ కాంత్ ను నిన్న(బుధవారం) కూడా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. రెగ్యులర్ చెకప్ కోసమే అన్నారు. కానీ ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. అభిమానులు ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకునే విజయ్ కాంత్ మరణం తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

1952 ఆగస్ట్ 25న జన్మించిన విజయ్ కాంత్ 1979లో నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. మొదట్లో విలన్ పాత్రలే చేశాడు. తర్వాత హీరోగా మారినా వరుసగా ఫ్లాపులే వచ్చాయి. 1981లో వచ్చిన సట్టం ఒరు ఇరుట్టారై సినిమతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీతో పెద్ద బ్రేక్ వచ్చింది. ఇదే సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా చట్టానికి కళ్లు లేవు పేరుతో రీమేక్ చేశారు. అటుపై విజయ్ కాంత్ యాక్షన్ హీరోగా మారాడు. అతని సినిమాలు దాదాపు తెలుగుతో పాటు హిందీలోనూ రెగ్యులర్ గా డబ్ అవుతుండేవి. ఇవన్నీ యాక్షన్ సినిమాలే కావడంతో మాగ్జిమం అన్ని చోట్లా సక్సెస్ అందుకున్నాడు. ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా.. తమిళ్ పరిశ్రమకే పూర్తిగా పరిమితమయ్యాడు విజయ్ కాంత్. ఎనభై, తొంభైల కాలంలో అతను చేసిన సినిమాలు మాగ్జిమం విజయాలు అందుకున్నాయి. రోజుకు మూడు షిఫ్ట్స్ చొప్పున పనిచేస్తూ.. సినిమాపై తన ప్యాషన్ ను నిరూపించుకున్నారు. అందుకే చాలా తక్కువ సమయంలోనే వంద సినిమాలు పూర్తి చేసుకున్నాడు. అతని వందవ సినిమా కెప్టెన్ ప్రభాకర్. ఎర్రచందనం స్మగ్లర్ కు సంబంధించిన కథ. నేటి పుష్పలోని చాలా సన్నివేశాలు ఈ మూవీలో అప్పట్లోనే కనిపించాయి. ఈ చిత్రంతోనే రీసెంట్ గా త్రిష, చిరంజీవిల ఇష్యూస్ తో కోర్ట్ వరకూ వెళ్లిన మన్సూర్ అలీఖాన్ కు విలన్ గా తిరుగులేని ఇమేజ్ వచ్చింది. కెప్టెన్ ప్రభాకర్ డబ్బింగ్ వెర్షన్ లో తెలుగులోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం. ఈ మూవీకి ముందు వరకూ విజయ్ కాంత్ ను పురచ్చి కళైంగర్.. అంటే రివల్యూషనరీ యాక్టర్ అని పిలుచుకున్న అభిమానులు కెప్టెన్ ప్రభాకర్ నుంచి కెప్టెన్ అనే పిలుచుకుంటున్నారు.

విజయ్ కాంత్ యాక్షన్ సినిమాలన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ లా కనిపిస్తాయి. ఇలాంటి ఫైట్స్ కూడా ఉంటాయా అనిపించేలా నేటి తరం ట్రోల్స్ చేసుకునేలా ఉన్నాయి. అయినా అప్పట్లో అవే పాపులర్. అవే అతనికి తిరుగులేని ఇమేజ్ ను తెచ్చాయి. పెద్ద అందగాడు కాదు. నటనా తెలియదు.. ఇలాంటి ఫైట్స్ చేస్తున్నాడనీ.. అప్పట్లో తమిళ్ టాప్ ఫిల్మ్ మేకర్స్ కానీ, సెన్సిబుల్ మూవీ మేకర్స్ కానీ విజయ్ కాంత్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా తనదైన రూట్లోనే వెళ్లాడు. ఒక భాషలో ఎక్కువ పోలీస్ ఆఫీసర్ గా నటించిన హీరో విజయ్ కాంతే. అతను ఏకంగా 20 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గానటించాడు. దేశభక్తి, కరప్షన్ చుట్టూనే అతని కథలన్నీ కనిపించేవి. తెలుగులో సిందూరపూవు, మాతృభూమి, జమిందార్ తీర్పు, కెప్టెన్ ప్రభాకర్, నరసింహ నాయుడు, సిటీ పోలీస్, రాజ సింహా, క్షత్రియుడు వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి.

మెగాస్టార్ కు ప్రజారాజ్యం పార్టీకి ముందు తిరుగులేని ప్రజాబలాన్ని ఇచ్చిన ఠాగూర్ సినిమా ఒరిజినల్ మూవీ విజయ్ కాంత్ చేసిందే. తమిళ్ లో రమణ పేరుతో రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాతే ఆయన కూడా 'దేశీయ మర్పొక్కు ద్రవిడ కళగమ్' (డి.ఎమ్.డి.కే) అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లారు. రాజశేఖర్ నటించిన మా అన్నయ్య ఒరిజినల్ కూడా విజయ్ కాంత్ నటించిందే. పొలిటికల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా తనదైన శైలిలో చివరి వరకూ రెబల్ గానే కనిపించే ప్రయత్నం చేశారు.

వ్యక్తిగతంగా విజయ్ కాంత్ చాలా గొప్ప వ్యక్తి అని పరిశ్రమ మొత్తం చెప్పుకుంటుంది. తెలుగులో కృష్ణగారిలా.. రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారు కాదు. సినిమాలు ఫ్లాప్ అయితే పారితోషికం కూడా వదులుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చెబుతారు. మొత్తంగా తమిళ సినిమా పరిశ్రమలో విజయ్ కాంత్ ది ఒక ప్రత్యేక అధ్యాయం. ఎవరికీ సాధ్యం కాని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఇంట్లో కంటే హాస్పిటల్స్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కోలుకున్నారు అని చెప్పారు. కానీ తాజాగా మరోసారి ఆయనకు కోవిడ్‌ ఎటాక్ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్ల తన ఆఖరి శ్వాస విడిచారు.

Updated : 28 Dec 2023 10:35 AM IST
Tags:    
Next Story
Share it
Top