వ్యూహం సినిమా విడుదలపై హైకోర్టు స్టే.. ఆ రోజే తీర్పు..
X
వ్యూహం సినిమా విడుదలకు న్యాయపరమైన చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్కు అనుమతించాలంటూ నిర్మాత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును తెలంగాణ హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. అప్పటి వరకు సినిమా విడుదల ఆపాలని ఆదేశించింది. ఈ సినిమా వల్ల ఏపీలో అభ్యంతరాలుంటే తెలంగాణలోనైనా విడుదలకు పర్మిషన్ ఇవ్వాలని నిర్మాత కోర్టును కోరారు. దీనికి లోకేష్ తరుపు న్యాయవాది అభ్యంతరం చెప్పడంతో ఈ నెల 22న తుది తీర్పు వెళ్లడిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
గత నెల 29న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. వ్యూహం సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లను కించపరిచేలా ఉందంటూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై నిర్మాత దాసరి కిరణ్ కుమార్ డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. సినిమా రిలీజ్ ఆగిపోవడంతో రూ.కోట్లలో నష్టం వచ్చిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సింగిల్ బెంచ్కు డివిజన్ బెంచ్ కీలక సూచనలు చేసింది. దీంతో సెన్సార్ సర్టిఫికెట్తో పాటు రికార్డును పరిశీలించిన న్యాయస్థానం.. ఇవాళ తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. అయితే ఇరుపక్షా మధ్య ఇవాళ మరోసారి వాడీవేడీ వాదనలు జరగ్గా.. ఈ నెల 22 తుది తీర్పు ఇస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.