Home > సినిమా > RGVకి షాక్.. ‘వ్యూహం’ సినిమా విడుదలకు హై కోర్టు బ్రేక్

RGVకి షాక్.. ‘వ్యూహం’ సినిమా విడుదలకు హై కోర్టు బ్రేక్

RGVకి షాక్.. ‘వ్యూహం’ సినిమా విడుదలకు హై కోర్టు బ్రేక్
X

వివాదాస్పద దర్శకుడిగా పేరున్న RGV( రాంగోపాల్‌వర్మ) దర్శకత్వంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్‌ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కోణంలో ‘వ్యూహం’ సినిమా తీశారని , సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలన్న లోకేష్ అభ్యంతరాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టారు జస్టిస్‌ సూరేపల్లి నంద. ఉదయం 11.45 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి.. రాత్రి 11.30 తరువాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్‌ను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా చేసుకుని రాంగోపాల్‌ వర్మ వ్యూహం సినిమాను రూపొందించారు. దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. అజ్మల్‌ అమీర్‌, మానస రాధాకృష్ణన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్‌ 29న దీనిని విడుదల చేయాలని భావించినా హైకోర్టు ఆదేశాలతో విడుదల వాయిదా పడింది. మరోవైపు వ్యూహం' సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌పై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విజయవాడకు చెందిన సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు మీసాల రాజేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా చిత్రంలో పాత్రలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ను పునః సమీక్ష చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.

Updated : 29 Dec 2023 8:43 AM IST
Tags:    
Next Story
Share it
Top