Vyooham : వ్యూహం వివాదం.. అక్కడే తేల్చుకోవాలన్న హైకోర్టు
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూవీపై మొదటి నుంచి టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 29న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. మూవీ విడుదలను ఆపాలంటూ నారా లోకేష్ వేసిన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ నెల 11వరకు విడుదల ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై నిర్మాత దాసరి కిరణ్ కుమార్ డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు.
ఈ పిటిషన్పై డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ చేపట్టింది. సినిమా రిలీజ్ ఆగిపోవడంతో రూ.కోట్లలో నష్టం వచ్చిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ అంశాన్ని సింగిల్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నెల 11కు బదులు 8న విచారణ జరిపి.. ఆ రోజే తీర్పు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానానికి విన్నవించారు. ఈ క్రమంలో ఈ నెల 8న విచారణ జరిపి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ను డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.