Home > సినిమా > తెలుగు తెర రాముళ్లు

తెలుగు తెర రాముళ్లు

తెలుగు తెర రాముళ్లు
X

సర్వమంగళ గుణ సంపూర్ణుడైన రాముడిని దేవుడుగా కొలవడం ద్వారా మానవులు ఉన్నత ఆశయాలతో జీవించగలుగుతారు. ఆ ప్రేరణ నింపేందుకే కవులెల్ల నీ దివ్యకథ నెల్లరీతుల గొనియాడి ముక్తి గైకొండ్రు గాత!.అంటాడు అదేదో సినిమాలో నాగయ్యగారు. సరిగ్గా ఈ స్ఫూర్తితోనే టాలీవుడ్‎లో అనేక మంది రామాయణాన్ని తెరకెక్కించి ధన్యులయ్యారు. రాముడిగా నటించి మరెందరో నటులు జన్మ పునీతం చేసుకున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ వస్తున్న సందర్భంగా తెలుగు తెర మీద ఇప్పటి వరకు రాముని పాత్రలు పోషించిన నటులను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

తొలి తెర శ్రీరాముడు సూర్యనారాయణ :




టాలీవుడ్ టాకీ యుగంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చిన తొలి రామాయణం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో యడవల్లి సూర్యనారాయణ నటించారు. తెలుగు తెర తొలి రాముడు ఆయనే. ఆ తర్వాత 1933లో వచ్చిన లవకుశతో పారుపల్లి సుబ్బారావు రాముడుగా నటించి మెప్పించారు. అదే కథతో ఆ తర్వాత పాతికేళ్లకు విడుదలైన మరో లవకుశలో రాముడుగా నటించిన నందమూరి తారక రామారావు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్.టి.ఆర్ రంగ ప్రవేశంతో తెలుగుతెర మీద పౌరాణిక పాత్రల తీరుతెన్నులు మారిపోయాయి. ఆయన ఎంతటి ముద్ర వేశారంటే...రాముడు అనగానే కళ్లముందు ఆయన రూపమే సాక్షాత్కరించేంతగా ప్రభావం చూపారు.

తమిళ సినిమాలోనూ రాముడిగా ఎన్టీఆర్ :






ఎన్టీఆర్ మొదటిసారి రాముడుగా కనిపించిన చిత్రం చరణదాసి. ఎన్టీఆర్, ఏఎన్‎ఆర్ కాంబినేషన్‎లో రూపుదిద్దుకున్న ఈ సాంఘిక చిత్రంలో ఓ నాటకంలో రామారావు రాముడి గెటప్‎లో కనిపిస్తారు. తెలుగువారి తెరవేల్పు ఎన్టీఆర్ తొలిసారి పూర్తిస్థాయిలో రాముడి పాత్రలో కనిపించింది తెలుగు చిత్రంలో కాదు. 1958లో వచ్చిన తమిళ సంపూర్ణ రామాయణంలో ఎన్టీఆర్ రాముడుగా నటించారు. ఆ సినిమా తెలుగులో డబ్ అయింది. అయితే అందులో ఎన్టీఆర్‎కు చుండ్రు సూర్యనారాయణ డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా చూసే 1959లో ప్రారంభించిన లవకుశలో రాముడి పాత్రకు రామారావే బెస్ట్ అనుకున్నారు సి.పుల్లయ్య. లవకుశ సినిమాతో తెలుగు తెర మీద రాముడు అంటే రామారావే అనే భావన స్థిరపడిపోయింది. ఆ తర్వాత శ్రీ కృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్దం, శ్రీ కృష్ణార్జున యుద్దం, శ్రీరామ పట్టాభిషేకం లాంటి చిత్రాల్లో రాముడుగా కనిపించి అలరించారు రామారావు.

వెండితెర రాముడంటే రామారావే :

అయితే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ రామాంజనేయ యుద్దంలో రాముడుగా రామారావు చాలా అందంగా కనింపించారు. ముఖ్యంగా ఓపెనింగ్ సాంగ్ మేలుకో శ్రీరామలో రామారావు విగ్రహం ప్రేక్షకుల్లో భక్తి బావాన్ని మేల్కొలుపుతుంది. స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన తొలి చిత్రం నిజానికి సీతారామకళ్యాణమే అయినా...అందులో రాముడుగా హరనాథ్ రాజును తీసుకుని తాను రావణుడి పాత్ర పోషించి మెప్పించారు ఎన్టీఆర్. ఆ తర్వాత చాలా కాలానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించిన శ్రీ రామ పట్టాభిషేకంలో రాముడుగా కనిపిస్తారు. చిత్తూరు నాగయ్య దర్శకత్వంలో రూపొందిన రామదాసు చిత్రంలో కూడా నందమూరి తారక రాముడే శ్రీ రాముడిగా తానీషా దగ్గరకు వెళ్లి రామదాసు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లిస్తారు. ఈ సన్నివేశంలో శ్రీరాముడి అనుజుడు లక్ష్మణుడుగా శివాజీగణేశన్ నటించడం విశేషం. తెలుగు తెర మీద రాముడుగా రామారావు తర్వాత అంతటి ప్రేక్షకాభిమానాన్ని పొందిన నటులు ఇద్దరున్నారు. ఒకరు హరనాథ్ అయితే మరొకరు శోభన్ బాబు. వీరిద్దరి రామపాత్ర ధారణ వెనుక నందమూరి ఆశీస్సులు పుష్కలంగా ఉండడం విశేషం.





రాముడిగా మెప్పించిన ఏఎన్‎ఆర్ :





రామారావుకన్నా ముందుగా రాముడి పాత్ర పోషించి అడియన్స్ ఆశీస్సులు అందుకున్న వారు అక్కినేని నాగేశ్వర్రావు. టాలీవుడ్ సెకండ్ జనరేషన్ హీరోలుగా పాపులర్ అయిన ఎన్టీఆర్, ఏఎన్‎ఆర్ లు ఇద్దరూ తొలిరోజుల్లో పౌరాణికాలు చేసిన వారే. అక్కినేని తొలి చిత్రం సీతారామజననం. అందులో ఆయన శ్రీరాముడుగా కనిపిస్తారు. ఆ తర్వాత పౌరాణికాలకు కాస్త దూరంగా ఉన్న ఏఎన్‎ఆర్ చివరి రోజుల్లో శ్రీ రామరాజ్యం సినిమాలో వాల్మీకిగా నటించి ఆ పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేశారు.

ఎన్టీఆర్ సిఫార్సు చేసిన రాముడు హరనాథ్ :




ఎన్టీఆర్ తర్వాత శ్రీరాముడుగా కనిపించి ప్రేక్షకులతో ఔరా అనిపించుకున్న కథానాయకులు హరనాథ్. ఆయన్ని రాముడి పాత్రకు స్వయంగా రామారావే సిఫార్సు చేయడం విశేషం. ఎన్.ఎ.టి బ్యానర్‎లో తానే దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సీతారామ కళ్యాణంలో హరనాథ్ రాముడుగా కనిపిస్తారు. రాముడుగా హరనాథ్ చాలా అందంగా ఉంటారు. స్వీయ దర్శకత్వంలో రామారావే నిర్మించిన శ్రీ సీతారామ కళ్యాణం చిత్రంలో రామారావు రావణపాత్రలో కనిపిస్తారు. ఇది ఆయన గురువులుగా అభిమానించే చక్రపాణి, కె.వి.రెడ్డిలే మెచ్చలేదు. పైగా వద్దన్నారు. కానీ తను అనుకున్న పని చేసి తీరే రామారావు అనుకున్నట్టుగానే హరనాథ్‎ను రాముడుగా డైరక్ట్ చేశారు. శభాష్ అనిపించారు. ఆ తర్వాత పద్మనాభం తీసిన శ్రీరామకథలోనూ రాముడుగా ఫుల్ లెంగ్త్ రోల్‎లో కనిపిస్తారు హరనాథ్.

అందాల రాముడైన ఆంధ్రుల అందగాడు :




హరనాథ్ తర్వాత రాముడుగా సక్సస్ అయిన వారు ఆంధ్రుల అభిమాన అందాల నటుడు శోభన్ బాబు. అరవై దశకంలో వచ్చిన గుమ్మడి పోతనలో శ్రీరాముడుగా మొదటిసారి తెరమీద కనిపించారు శోభన్ బాబు. ఆ తర్వాత బాపు సంపూర్ణ రామాయణంలో నందమూరి తారక రామారావు ఆశీస్సులతో పూర్తి స్తాయి రాముడుగా నటించి హిట్ అయ్యారు. శోభన్ బాబుతో సంపూర్ణ రామాయణం తీయబోతున్న విషయాన్ని ముందుగా రామారావుకే చెప్పారు బాపు రమణలు. మొదట ఆశ్చర్యపోయినా...ఆ తర్వాత అభినందించారు నందమూరి. చిత్రం విడుదలయ్యాక మొదటి రోజు కలెక్షన్స్ డల్ అయిన సందర్భంలో అంతా కంగారు పడకండి...టాక్ పికప్ అవుతుంది. సినిమా హిట్ అవుతుందని ధైర్యం చెప్పిందీ రామారావే.

బాపు తీర్చిదిద్దిన రాముళ్లు వీరే :




70 దశకంలో పౌరాణికాలు దాదాపు తగ్గిపోయాయి. దర్శకుడు బాపు రామాయణం మీద ప్రత్యేకాభిమానంతో ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు. ఈ జనరేషన్‎లోనూ ప్రాపర్‎గా తీస్తే పౌరాణికాలు జనం చూస్తారని శ్రీ రామరాజ్యంతో నిరూపించారు బాపు. బాపు తీర్చిదిద్దిన రాముళ్లుగా శోభన్ బాబునీ, రవినీ, నందమూరి బాలయ్యలను చెప్పుకోవాలి. 1934 ప్రాంతాల్లో తెలుగులో సీతాకళ్యాణం పేరుతో ఒక చిత్రం వచ్చింది. అందులో ప్రముఖ సంగీత విధ్వాంసుడు కళ్యాణి వెంకట్రావు శ్రీరాముడుగా నటించారు. అదే టైటిల్‎తో సెవెంటీస్‎లో బాపు రవి అనే కొత్త నటుడ్ని తీసుకుని రాముడుగా తీర్చిదిద్ది...ఔరా అనిపించారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణను శ్రీరాముడుగా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసిన ఘనత కొట్టేశారు బాపు. శ్రీ రామరాజ్యం చిత్రంలో బాలయ్యను చూసిన ఆడియన్స్ లవకుశలో రామారావును చూసిన అనుభూతి పొందారా అనేది అనుమానమే. పొందినట్టు నటించారా అనేది కూడా అనుమానమే.

వారసత్వాన్ని కొనసాగించిన జూ.ఎన్టీఆర్ :



రాముడుగా నందమూరి వంశం మూడో తరం హీరో తారక్ కూడా నటించాడు. కూచిపూడి ప్రాక్టీస్ చేసిన తారక్ తొలి చిత్రం బాల రామాయణం కావడం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో మల్లెమాల నిర్మించిన ఈ చిత్రంలో చిన్న వయసులోనే రాముడుగా నటించాడు జూనియర్ ఎన్టీఆర్.

టాలీవుడ్‎లో ఎంతమంది రాముడి పాత్రలో కనిపించినా...మెప్పించినా...ప్రేక్షకులతో గున్నారనిపించుకున్న...మనస్సుల్లో స్థిరపడిపోయిన రాముడు మాత్రం నందమూరి తారక రాముడే. అయితే ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడుగా ఎలాంటి ప్రభావం వేయబోతున్నాడు?.. ఈ సినిమా విజయం తర్వాత పౌరాణిక చిత్రాలకు పూర్వవైభవం వస్తుందా?. అని చర్చలు సాగుతున్నాయి. మరి ప్రభాస్ ఆ రేంజ్‎లో తెలుగు తెర రాముళ్ల వారసత్వాన్ని నిలబెడతాడో లేదో రేపు విడుదల అవుతున్న ఆదిపురుష్ చూస్తే గానీ చెప్పలేం.





Updated : 15 Jun 2023 2:52 PM IST
Tags:    
Next Story
Share it
Top