Home > సినిమా > Koratala Shiva: ‘శ్రీమంతుడు’ డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంలో షాక్

Koratala Shiva: ‘శ్రీమంతుడు’ డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంలో షాక్

Koratala Shiva: ‘శ్రీమంతుడు’ డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంలో షాక్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' సినిమా దర్శకుడు కొరటాల శివకి సుప్రీంకోర్టు సైతం షాక్ ఇచ్చింది. కాపీరైట్ చట్టం కింద క్రిమినల్ చర్యలు ఎదురుకోక తప్పదని ఆదేశించింది. “శ్రీమంతుడు” సినిమా కథను అప్పట్లో స్వాతి పత్రికలో ప్రచురితమైన “చచ్చేంత ప్రేమ” అనే తన నవల ఆధారంగా తీసారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఎంబి క్రియేషన్స్ అధినేత, హీరో మహేష్ బాబు, మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్, దర్శకుడు కొరటాల శివపై శరత్ చంద్ర కేసు వేశారు. 2012లో “చచ్చేంత ప్రేమ” అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురించడం జరిగిందని, అయితే తన అనుమతి లేకుండానే అదే కథ ఆధారంగా “శ్రీమంతుడు” మూవీని తెరకెక్కించారని శరత్ చంద్ర ఆరోపించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ, కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడి ధర్మాసనం నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది.

దీంతో శివ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత రచయిత శరత్‌ చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరపున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘పిటిషన్‌ను మమ్మల్ని డిస్మిస్‌ చేయమంటారా? లేక మీరే వెనక్కి తీసుకుంటారా’ అని న్యాయవాది నిరంజన్‌రెడ్డిని కోర్టు ప్రశ్నించగా, తామే పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై న్యాయపోరాటం చేసిన రచయిత శరత్ చంద్ర ఎట్టకేలకు విజయం సాధించినట్లయింది.



Updated : 29 Jan 2024 11:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top