Tiger Nageswar Rao Movie Review : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ ..
X
రివ్యూ : టైగర్ నాగేశ్వరరావు
తారాగణం : రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, మురళీశర్మ, నాజర్, జిషుసేన్ గుప్తా, హరీష్ పేరడి, రేణూ దేశాయ్ తదితరులు
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ : మధీ
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
నిర్మాత : అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం : వంశీ
రవితేజ సినిమా అంటే మాస్ కు జోష్, నిర్మాతలకు క్యాష్ గ్యారెంటీ. ఎన్ని ఫ్లాపులు వస్తున్నా.. నాన్ స్టాప్ గా సినమాలు చేస్తూ ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తున్నాడు రవితేజ. ఈ యేడాది వాల్తేర్ వీరయ్య, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర తర్వాత ఇప్పుడు దసరా బరిలో టైగర్ నాగేశ్వరరావులా వచ్చాడు. వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ముందు నుంచీ మంచి అంచనాలున్నాయి. 1970ల ప్రాంతంలో చీరాల ఏరియాలోని స్టూవర్ట్ పురంకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుందో చూద్దాం.
కథ :
పిఎమ్ పర్సనల్ సెక్యూరిటీ నుంచి చీరాల డిఎస్పీ శాస్త్రి(మురళీ శర్మ)కి అర్జెంట్ గా ఢిల్లీకి రావాలని పిలుపు వస్తుంది.అతను వెళ్లాక.. టైగర్ నాగేశ్వరరావు(రవితేజ) గురించి చెప్పమని అడుగుతారు. ఎందుకూ అంటే.. ప్రధానమంత్రి(ఇందిరా గాంధీ)కి సెక్యూరిటీ పెంచడానికి అంటారు. అప్పుడు ఆ డీఎస్పీ స్టూవర్ట్ పురంనాగేశ్వరరావు కథ చెప్పడం మొదలుపెడతాడు. ఆ కథలో నాగేశ్వరరావు ఒక నటోరియస్ క్రిమినల్. దోచుకున్న సొత్తునంతా అమ్మాయిలకు తగలేస్తూ.. దారుణమైన దోపిడీలు చేస్తుంటాడు. అతన్ని నమ్ముకుని చిలకలూరి పేటలో నాలుగు ‘కంపెనీ’లే నడుస్తున్నాయని చెబుతాడు. అలాంటి అతను సారా(నుపుర్ సనన్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒక డ్యూయొట్ తర్వాత ఇంట్లో ఒప్పుకోకున్నా పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అయినా చివరి దొంగతనం అంటూ చెన్నైకి వెళ్లిన టైగర్ నాగేశ్వరరావు తిరిగి చెప్పిన టైమ్ కే వచ్చినా.. అప్పటికే చుట్టుముట్టిన పోలీస్ లు పట్టుకుని అరెస్ట్ చేస్తారు. తన అరెస్ట్ కు లోకల్ పొలిటీషియన్ యలమంద(హరీష్ పేరడీ) కారణమని తెలుసుకుని.. జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది.. నిజంగా టైగర్ నాగేశ్వరరావు అంత కౄరుడా..? తను ప్రేమించిన అమ్మాయి ఏమైంది..? టైగర్ వల్ల ప్రధానమంత్రి సెక్యూరిటీకి ఉన్న సమస్య ఏంటీ..? అనేది మిగతా కథ.
విశ్లేషణ :
కొన్ని కథలు మొదలు కావడం ఆసక్తిగా ఉంటుంది. కానీ ముందుకు సాగుతున్నా కొద్దీ సాగదీతలా ఉంటుంది. టైగర్ నాగేశ్వరరావు కథ కూడా అంతే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సూపర్బ్ అనిపించుకున్నా.. నిడివి వల్ల సాగదీత కనిపిస్తుంది. టైగర్ కు ప్రేమకథ అతకలేదు. పైగా కాస్ట్యూమ్స్ అన్నీ మోడ్రన్ గా ఉండటం విశేషం. ఫస్ట్ హాఫ్ లో కథ నాగేశ్వరరావును పూర్తి విలన్ గా చూపిస్తుంది. కోర్ట్ ఆవరణలో ఒక వేశ్యతో అతను ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా ఫ్యాన్స్ కూ కోపం తెప్పిస్తుంది. అయితే దర్శకుడు దీన్నో ట్విస్ట్ లా చెప్పాలని సెకండ్ హాఫ్ లో ప్రయత్నించాడు. బట్ అప్పటికే డామేజ్ అయింది. టైగర్ గురించి ఇంక్వైర్ చేయడానికి ఢిల్లీ నుంచి ఐ.బి ఆఫీసర్ రాఘవేంద్ర(అనుపమ్ ఖేర్) మారువేషంలో వస్తాడు. అప్పుడు అతనికి నాగేశ్వరరావు కథ కొత్తగా తెలుస్తుంది. డిఎస్పీతనకు చెప్పిందంతా అబద్ధం అని అర్థం అవుతుంది. ఈ సెకండ్ హాఫ్ లో టైగర్ నాగేశ్వరరావు ఒక ధీశాలి. రాబిన్ హుడ్. పెద్దలను కొట్టి పేదలకు పంచుతుంటాడు. అందరి దృష్టిలో అతనో హీరో. ఈ క్రమంలో తన ఊరిని బాగు చేయడానికి సాహసాలతో పాటు త్యాగాలూ చేస్తుంటాడు. వాటి వల్ల ఆ ఊరికి కరెంట్, రోడ్ సౌకర్యాలు ఏర్పడతాయి. ఇందుకోసంఅతనికి హేమలతా లవణం(రేణూ దేశాయ్ చేసింది) సాయం చేస్తుంది. సెకండ్ హాఫ్ లో నాగేశ్వరరావు పాత్రను ఎంత ధీరోదాత్తంగా చూపించినా.. మొదటి సగంలో మరీ దారుణంగా చూపడంతో అవే గుర్తొస్తాయి తప్ప.. ఇతని గొప్పదనం ప్రేక్షకులకు ఎక్కదు. ఆ పాత్రపై ఏ దశలోనూ గౌరవం, జాలి వంటివి కలగవు. ముఖ్యంగా ఇంటర్వెల్ టైమ్ లో హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నా.. ప్రేక్షకులకు చిన్న బాధ కూడా అనిపించదు. ఇది దర్శకుడి వైఫల్యం. ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్్ హాఫ్ చాలా బెటర్ గానే ఉన్నా.. మితి మీరిన ఫైట్లు, రక్తపాతం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెడతాయి.
రవితేజ ఈ పాత్ర కోసం వందశాతం ఎఫర్ట్ పెట్టాడు. పాత్రను ఆవాహన చేసుకున్నాడు. రెండు భిన్నమైన రూపాల్లో ప్రెజెంట్ చేసిన పాత్రలో పర్ఫెక్ట్ గా కనిపించాడు. హీరోయిన్స్ లో నుపుర్ ఫస్ట్ హాఫ్ లో, గాయత్రి సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది. ఇద్దరూ ఓకే. యలమంద పాత్రలో మళయాల నటుడు హరీష్ పేరడీ ఓకే. మురళీశర్మ, అనుపమ్ ఖేర్, జిషుసేన్, నాజర్ పాత్రలన్నీ రొటీన్. అయితే హేమలతా లవణం పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన రేణూదేశాయ్ తేలిపోయింది. ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. తను పెద్దరికంతో కనిపించింది తప్ప హుందాగా లేదు. మంచి రీ ఎంట్రీ అనలేం. ఇతర పాత్రలన్నీ ఓకే.
టెక్నికల్ గా జివి ప్రకాష్ కుమార్ నేపథ్యం సంగీతం కొన్ని సీన్స్ లో హైలెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. ముందే చెప్పినట్టు లెంగ్తే ప్రధాన సమస్య. అందువల్ల దాదాపు 20 నిమిషాల వరకూ ఎడిట్ చేసినా వచ్చే నష్టమేం లేదు. మాటలు జస్ట్ ఓకే. ఆర్ట్ వర్క్, సెట్ వర్క్ బావున్నాయి. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ నాసిరకంగా కనిపిస్తాయి. దర్శకుడు ఈ కథను రెండు కోణాల్లో చెప్పాలనుకున్నాడు. ఒకటి పోలీస్ ల కోణం.. రెండోది వాస్తవ కోణం. రెండోది బావున్నా.. మొదటిది మరీ దారుణంగా ఉండటంతో దెబ్బయిపోయాడు. సినిమా బోర్ కొట్టదు కానీ.. సాగదీతలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో రవితేజన భరించగలిగితే.. సెకండ్ హాఫ్ పాసై పోతుంది.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ
నేపథ్య సంగీతం,
సినిమాటోగ్రఫీ
ఫైట్స్
మైనస్ పాయింట్స్ :
కథ, కథనం
నిడివి
సాగదీత
వినోదం లేకపోవడం
పాటలు
ఫైనల్ గా : నాగేశ్వరరావు టైగర్ అయితే కాదు
రేటింగ్ : 2.5/5
- కామళ్ల. బాబురావు.