Oscar : ఆస్కార్ అవార్డుల బరిలో బలగం... మరో తెలుగు మూవీ కూడా..
X
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు మన దేశం తరఫున పంపే చిత్రాలను ఎంపిక చేసే కసరత్తు మొదలైంది. ప్రముఖ కన్నడ దర్శకుడు గిరీశ్ కాసరవెల్లి సారథ్యంలోని 17 మంది సభ్యుల జ్యూరీ చెన్నైలో తిష్టవేసి వడపోతను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది భారత్ తరఫున పంపిన RRR సినిమాలోని 'నాటు నాటు' పాటకు, 'ఎలిఫెంట్ విస్పర్స్' డాక్యుమెంటరీకి అస్కార్ రావడంతో జ్యూరీ ఈసారి కూడా సత్తా ఉన్న మూవీలను ఎంపిక చేస్తోంది.
తెలంగాణ గ్రామీణ మానవసంబంధాలను వెండితెరపై భావోద్వేగంతో చూపి ఇప్పటికే పలు అవార్డులను కొల్లగొట్టిన జబర్దస్త్ వేణు చిత్రం ‘బలగం’ మూవీని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా నటించిన రస్టిక్ మూవీ ‘దసరా’ను కూడా జ్యూరీ మదింపు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు సహా మొత్తం 22 చిత్రాలు ఎంపికకు వచ్చాయని వీటి నుంచి ఒక చిత్రాన్ని ఎంపిక చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రమాణాలతోపాటు దేశీ సంస్కృతి, ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుని భావోద్వేగాలు, కళాత్మక ఉట్టిపడే చిత్రాలను ఎంపిక చేసుకుని, తర్వాత మళ్లీ వడపోతకు వెళ్లనున్నారు. తమిళం నుంచి వెట్ర్రిమాన్ ‘విడుదలై’, హిందీ నుంచి ‘గదర్ 2’, 'ది స్టోరీ టెల్లర్', 'మ్యూజిక్ స్కూల్', 'మిస్ ఛటర్జీ వెర్సస్ నార్వే', '12th ఫెయిల్', 'గదర్ 2', 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' తదితర ఎంట్రీలు వచ్చాయి .
బలానికి వందకుపైగా
బలగం చిత్రానికి దేశ విదేశాల్లో నిర్వహించిన పలు చలన చిత్రోత్సవాల్లో వందకు పైగా అవార్డులు వచ్చాయి. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒనికో ఫిల్మ్ అవార్డు (ఉక్రెయిన్), లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డు, వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ తదితరాలు వీటిలో కొన్ని.